తెలంగాణ వైతాళికులు నిరంతర చైతన్య శీలి, బహు భాషా కోవిదుడు.కలాన్ని ఆయుధంగా చేసుకొని తల్లి భాషలోనే కవిత్వం రాసి ప్రజల పక్షం వహించి తన కవిత్వంతో సమాజానికి చైతన్యం కలిగించిన నిత్య చైతన్య శీలి ప్రజా కవి కాళోజీ. తెలంగాణ మాండలిక భాషకు ఊపిరి పోసిన బహు భాషావేత్త. ఉద్యమకారుడు రచయిత అన్యాయాలపై ఉక్కిపిడికిలెత్తిన కాళోజి నారాయణరావు
1914 సెప్టెంబర్ 9న కాలోజీ రంగారావు రమాబాయి దంపతులకు ద్వితీయ సంతానంగా, బీజాపూర్ జిల్లా రట్టిహల్లి గ్రామంలో జన్మించారు. కాళోజీ పూర్తి పేరు *రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజి*
మడికొండలో వారి స్థిర నివాసం. ప్రాథమిక విద్య మడికొండలో ఉన్నత విద్య హనుమకొండలో పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో సహజంగా పోరాటజీవి 1931లో భగత్ సింగ్ ఉరి తీయడం, స్కూల్లో నాటకాలు కాళోజీ వ్యక్తిత్వాన్ని దృఢంగా మార్చినాయి. ప్రజల హక్కులను అణిచివేసే చట్టాం *గస్తిర్షాన్ తిరుపన్**చట్టంపై నిరసనగలం విప్పారు. ఖలీల్ జీబ్రాన్ రచనలతో ప్రభావితులయ్యారు.
అన్యాయ అసమానతలను చూసి *ఎందుకో హృదిని ఇన్ని ఆవేదనలు*
అంటూ పరుల కష్టం చూసి పగిలిపోవును గుండె- మాయ మోసము చూసి మండిపోవును ఒళ్లు అంటూ అక్షరాలని ఆయుధాలుగా చేసుకుని ఈ వ్యవస్థపై వ్యంగ్యంతో, బాధతో, కోపంతో నిజమైన మనిషిగా స్పందించారు.
*ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి*
అంటూ ఓటరుకు కర్తవ్య బోధ చేసిండు. అన్ని మాండలిక భాషలు అన్ని వాడుక భాషలు ప్రచారంలో ఉండాలని కోరుకున్నడు.
*బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అన్నాడు*
వాడుక భాషలో రచనలు రావాలని కోరుకున్నడు. పరభాష వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న వారిని తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచబడియెదవు సంగతేమిటి రా *అన్య భాషలు నేర్చు ఆధ్రంబు రాదనుచు సఖిలించు ఆంధ్రుడా చావవెందుకురా*
అంటూ ఘాటుగా చురకలు పెట్టాడు. *నీ భాషలో నీ బతుకున్నది, నీ యాసలనే నీ సంస్కృతున్నది ఎవని యాసల వాడు రాయాలని* గట్టిగా గర్జించి చెప్పిండు. మాతృభాషలో చదవడం రాయడం వచ్చినోడు ఎక్కడైనా ఏదైనా సాధించగలరని తన నమ్మిక. తెలంగాణ మాండలిక భాషకు ప్రాణం పోసిన కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నాం. భాషలోనే మనిషి జీవమున్నదని నమ్మిన మహనీయుడు.
*తెలంగాణ సాధిద్దాం పదరా దొంగల దూరం కొడదాం పదరా*
అంటూ ఉద్యమ గళమెత్తి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో గీటురాయి అయిండు. పాల్గొనని సమావేశాలు నిరసనలు నిర్భంధాలు లేవు. ఆచార్య జయశంకర్ సార్ తో కలిసి ఉద్యమంలో చురకైన పాత్ర పోషించిండు.
*అన్నపురాసులొకచోట ఆకలి కేకలు ఒకచోట*
అంటూ సమాజంలో అసమానతలు నిరసించిండు.
*బతుకు తప్పదు… బతక్కా తప్పదు**అన్యాయాన్ని ఎదిరించి న వాడే నాకు ఆరాధ్యుడు అంటూ సుతి మెత్తగా మందలించిండు. తన లెక్కనే అన్యాయం ఎదిరించాలనినే సోయిని ప్రజల్లో కలిగించిండు. అన్యాయం అసమానలతో గొడవ పెట్టుకుని *నా గొడవకు* శ్రీకారం చుట్టారు. ఆయన రచించిన నా గొడవ గేయాలు అఖిలాంధ్ర ప్రజల గొడవగా ప్రశంసలు పొందాయి.*జరిగేవన్నీ చూస్తూ కూర్చుండగా సాక్షీభూతుణ్ణి కాను – సాక్షాత్తు మానవుణ్ణి* అంటూ ధీమాగా చెప్పుకున్నారు. మనిషి పోరడిగా బతుకొద్ధు- పౌరుడిగా బతకాలి అన్నడు.గొర్రె కసాయిని నమ్మినట్లు నమ్మొద్దు పిల్లల్ని రెక్కల్లో పొదువుకునే కోడి పెట్టవల గద్దల్ని ఎదిరించాలనీ యువతకు వాళ్ళ విధులను గుర్తు చేస్తూ నిలువెత్తున చైతన్యాన్ని నింపారు. *ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ అంటూ* ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ బతుకు మీద భరోసాను నేర్పిండు. సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే సావు అంటూ నిత్య చైతన్యంతో ముందుకు సాగాలని స్ఫూర్తిని నింపిండు. *ఒక్క సిరా చుక్క మెదళ్లకు కదలిక* అన్నడు. తన రచనలతో తెలంగాణ యావత్తు నాలుగు కోట్ల ప్రజల మెదళ్లను కదిలించిన కలం యోధుడు.
తన1958 నుంచి 1960 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యుడుగా, ఆంధ్రసారస్వతా పరిషత్ సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడుగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా వారి సేవలు అనన్య సామాన్యం.
అణా కథలు, కాళోజీ కథలు, పార్థివవ్యయం సంకలనం, నా గొడవ,తెలంగాణ ఉద్యమ కవితలు, ఇది నా గొడవ మొదలైన రచనలతో పాటు అముద్రిత రచనలు ఎన్నో ఉన్నాయి
*బాపు! బాపు!!* అని పేరు పెట్టి ఆత్మకథను రాసుకున్నారు. అందులో మొదటి ప్రపంచ యుద్ధం తో పాటే నేను భూమి మీద పడ్డాను అని చెప్పుకున్నారు. అంటే నా పుట్టుకే యుద్ధంలో ప్రారంభమైంది అందుకే సమాజం మీదనే నా యుద్ధం అంటూ ప్రజలను చైతన్యపరిచారు. కాళోజి అన్నగారు సుప్రసిద్ధ న్యాయవాది ఉర్దూ కవి ” షాద్” గా ప్రసిద్ధుడైన రామేశ్వరరావు. కాళోజి భార్య పేరు రుక్మిణి. కుమారుడు రవి కుమార్.
కాళోజీ గారు అనేక సత్కారాలు పురస్కారాలు సన్మానాలు పొందారు. 1972లో భారత ప్రభుత్వం చే స్వాతంత్ర సమరయోధుడిగా సత్కారం తామ్రపత్రం బహుకరణ,బూరుగుల రామకృష్ణారావు మెమోరియల్ అవార్డు, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, విశాఖ వారి గురజాడ అవార్డు, నాగపూర్ విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం, ఉండేలా మాల కొండారెడ్డి విజ్ఞాన పీఠం అవార్డు, రామినేని ఫౌండేషన్ అవార్డు తో పాటు ఇంకెన్నో అవార్డులు పొందారు. వీరు 2002 నవంబర్ 13న మరణించారు. మాండలిక భాష విషయంలో
ఇప్పటికీ కాళోజీ గారి ఆశయం నెరవేరలేదు.తను చెప్పిన పలుకుబడుల భాషలో కాకుండా బడి పలుకుల భాషలో విద్యా బోధన జరుగుతుండడంతో విద్యార్థులలో అవగాహన లోపంతో భాష పై, అయిష్టం ఏర్పడుతుంది. మాతృభాషలో మాట్లాడితే అవమానంగా భావించే వారు సరిగా రాకపోయినా పరాయి భాషలో మాట్లాడితే గౌరవ సూచకమని భావిస్తున్నారు నేటి ప్రజలు. ప్రభుత్వం కూడా *నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లు* మాటల వరకే మాతృభాష పైన అభిమానాన్ని చూపుతున్నారు చేతల్లో చూపట్లేదు. కాబట్టి మాతృభాషపై మమకారం ప్రజల్లో సన్నగిల్లింది. ఇటీవల ఇంటర్మీడియట్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టి తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు. ప్రజలకు అనుగుణంగా రచనలు చేసి తెలంగాణ భాషకు, యాసకు ప్రాణం పోసిన కాళోజి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచారాలకు వ్యవహారాలకు మణి మకుటమైన భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలె. కాళోజి పిలుపునే స్పూర్తి గా తీసుకుని నేను 108 పాటలతో *పూల జాతర* బతుకమ్మ పాటల పుస్తకాన్ని వెలువరించాను. కాళోజి స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాషను రక్షించి భవిష్యత్ తరాలకు బహుమానంగా అందించాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉంది. ఉద్యమాల బాటలో నడిచి అన్యాయం ఎక్కడ ఉన్నా ఎదిరిస్తూ కోపంతో, కన్నీళ్ళతో, కవిత్వాలు అల్లి పాటలు రాసి నిరసనను ప్రకటించిన కాళోజి వ్యక్తిగతంగా స్వేచ్ఛ జీవి. తన గురించి ఎప్పుడు ఆలోచించని స్వార్ధపరుడు. తన కోరిక మేరకు చనిపోయిన తర్వాత తన పార్ధీవ దేహాం కూడా సమాజానికే ఉపయోగ పడాలనీ కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించారు.వీదుల్లో విగ్రహాలు పెట్టి ,వరంగల్ నగరంలో కాళోజి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి, విశ్వవిద్యాలయానికి కాళోజి పేరు పెట్టి తనను యాదికి జేసుకొని ఘనంగా నివాళులర్పిస్తున్నాం. తెలంగాణలో మాండలిక భాషకు సరైన గౌరవం కల్పించిన రోజున కాళోజీ గారికి మనమిచ్చే నిజమైన నివాళి.
కొమ్మాల సంధ్య
తెలుగు అధ్యాపకురాలు
సమ్మక్క సారక్క తాడ్వాయి
ములుగు జిల్లా
9154068272.