దశాబ్దాల కాలంగా జరిగిన ఈ పోరాటానికి పోల్చదగిన పోరాటమేది చరిత్రలో జరుగలేదు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వేచ్చ లభించింది. దాన్ని వేడుకగా చేసుకోవడానికి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు ఇష్టపడలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ పార్టీయే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఆ ఆలోచనకు తావివ్వలేదు. బిజెపి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు ఎనిమిదేళ్ళ కింద ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఏనాడు ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపాలన్న నిర్ణయం తీసుకున్నదిలేదు. సార్వత్రిక ఎన్నికలు మరో సంవత్సరకాలంలో జరుగనుండడంతో ఈ ప్రాంతంపైన ఆధిపత్యం కోసం ఇప్పుడు ఈ పార్టీలు పోటాపోటీగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. రెండు వందల సంవత్సరాలుగా నిర్బంధాలకు, నిరాదరణకు గురైన ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించాల్సిన విషయాన్ని మరిచి ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నాయన్నది జనవ్యాఖ్య…
– మండువ రవీందర్‌రావు
‘తెలంగాణ’ ఏనాటికి ఒడవని ముచ్చటగా తయారైంది. దశాబ్దాలు గడుస్తున్న ఈ ప్రాంతం విషయంలో ఏదో రకమైన వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నిరంకుశ నిజామ్ నవాబు కబంధ హస్తాల నుండి ఈ ప్రాంతానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని కలిగించడంకోసం జరిగిన పోరాటాలు మొదలు, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళ నుండి కూడా ఈ ప్రాంతం నిత్యం చర్చనీయాంశంగా మారుతూనే వచ్చింది. ఏడున్నర దశాబ్దాల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాంతంపైన ఇప్పుడు ఎక్కడలేని ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి. మేమంటే మేము అని రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించడంలో కుస్తీ పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఏడాది పొడవునా ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు సంకల్పించగా, రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు గతంలో ఎవ్వరూ నిర్వహించని రీతిలో ఈ ఉత్సవాలను జరుపాలని నిశ్చయించింది. ఇప్పటికే ఈ రెండు ప్రభుత్వాలు ఉత్సవాలకు శ్రీకారం చుట్టాయి కూడా. ర్యాలీలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఇంకా ఆనాటి పోరాటాల్లో ఎవరైనా బతికి ఉంటే వారిని సన్మానించే కార్యక్రమాలను రూపొందించాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లలో తలమునకలవుతున్నాయి. రాష్ట్ర రాజధానిలోని పబ్లిక్ గార్డెన్‌లో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ జండాను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించబోతున్నారు.
తెలంగాణ ఏర్పడడానికి ముందు ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించడంలేదని, ఆ నాటి ఉద్యమనాయకుడిగా గొంతెత్తి అరిచిన కెసిఆర్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ ఎనమిదేళ్ళలో ఏనాడు విమోచన లేదా విముక్తి దినాన్ని అధికారికంగా చేపట్టడానికి సాహసించలేదు .ఈ ఎనమిదేళ్ళ కాలంలో అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన ఈ విషయంలో ఏనాడు పెదవి విప్పలేదు. తెరాసకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు భయపడి ఉత్సవాలు నిర్వహించడంలేదంటూ బిజెపి లాంటి పార్టీలు తీవ్రంగా విమర్శలు చేసినప్పటికీ ఆయన ప్రతిపక్షాల మాటలను ఏనాడు పట్టించుకున్నది కూడా లేదు. పార్టీలోని కొందరు ప్రముఖులు సెప్టెంబర్ 17 కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా ఏదో అయిందనిపించడానికే పరిమితమయ్యారు. రాష్ట్రంలోని బిజెపి నాయకత్వం మాత్రం ప్రతీ ఏడు సెప్టెంబర్ 17 వస్తుందనగానే తెరాస ప్రభుత్వంపై ఈ విషయంలో దాడి ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. అలాంటి బిజెపి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు ఎనిమిదేళ్ళ కింద ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఏనాడు ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపాలన్న నిర్ణయం తీసుకున్నదిలేదు. కాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి ఒకేసారి ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే తెలంగాణ మీద ఆధిపత్యం కోసం తమ అస్త్రశస్త్రాలన్నిటినీ వినియోగిస్తున్న బిజెపి కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులంతా ఈ విషయంపైన ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనతో పాటు కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కూడా రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రాబల్యం కోసం చేస్తున్న ఉత్సవాలుగానే దీన్ని భావించాల్సి వస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన ఈ డెబ్బై అయిదు ఏండ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారాయి. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా తెలంగాణ చరిత్రను పట్టించుకున్నది లేదు. రెండు వందల సంవత్సరాలుగా పరాయి రాజుల పాలనలో మగ్గిన ఇక్కడి ప్రజలు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పదమూడు నెలల తర్వాతగాని స్వేచ్ఛా వాయువులు పీల్చలేదు. అప్పటివరకు ఈ ప్రాంతానికి జరుగాల్సిన నష్టం జరిగింది. వేలాది మంది ఊచకోతకు గురైనారు. అటు నిజామ్ సైన్యం, మరో పక్క ఆయనకు మంత్రిగా వ్యవహరించిన ఖాసిమ్ రజ్వీ ప్రైవేటు సైన్యం రజాకార్ల పేరున జరిపిన మానభంగాలు, హత్యలకు లెక్కేలేదు. అనంతరం జనరల్ చౌదరి, వెల్లోడి సారథ్యంలో కమ్యూనిస్టులపై జరిగిన హింసాకాండ కూడా తక్కువేమీకాదు.
భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో యావత్ భారత ప్రజలు బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే, తెలంగాణ ప్రజలు ఆంగ్లేయులతోపాటు, నిజామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకకాలంలో రెండు ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో తమకు తాముగా సమిధలైన లక్షలాది త్యాగధనుల చరిత్రతో తెలంగాణ ప్రాంతం ముడివడి ఉంది. తమ లక్ష్య గమనంలో తమ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా ఈ ప్రాంత విముక్తికోసం ప్రాణత్యాగం చేసినవారెందరెందరో…
రెండు శతాబ్ధాల నిజామ్‌ల పాలన కాలంలో ఇక్కడి ప్రజలు దుర్భర జీవితాలను అనుభవించారు. రాజకీయంగా, విద్యావిషయంలో, ఆర్థికంగా, సంస్కృతీ సంప్రదాయపరంగా బలవంతంగా అణచివేతకు గురైనారు. పరస్పరం అండగా నిలిచిన నిజామ్, భూస్వాముల కబంధ హస్తాల్లో ఇరుక్కుని సర్వం కోల్పోయిన వారి గాథలు వెలుగు చూడకుండానే మరుగున పడిపోయాయి.
జమీందార్లు, దేశముఖ్‌ల దౌర్జన్యాలు, వెట్టిచాకిరి, అక్రమ నిర్బంధ వసూళ్ళు, సాగుదారులను ఏదో ఒంకతో భూమి నుండి వేరుచేసే కుట్రలను వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగబడక తప్పలేదు. భూమికోసం, భుక్తికోసం జరిపిన పోరాటం చిరకు సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకుంది. దశాబ్దాల కాలంగా జరిగిన ఈ పోరాటానికి పోల్చదగిన పోరాటమేది చరిత్రలో జరుగలేదు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వేచ్ఛ లభించింది. దాన్ని వేడుకగా చేసుకోవడానికి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు ఇష్టపడలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ పార్టీయే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఆ ఆలోచనకు తావివ్వలేదు. బిజెపి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు ఎనిమిదేళ్ళ కింద ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఏనాడు ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపాలన్న నిర్ణయం తీసుకున్నదిలేదు. సార్వత్రిక ఎన్నికలు మరో సంవత్సరకాలంలో జరుగనుండడంతో ఈ ప్రాంతంపైన ఆధిపత్యం కోసం ఇప్పుడు ఈ పార్టీలు పోటాపోటీగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. రెండు వందల సంవత్సరాలుగా నిర్బంధాలకు, నిరాదరణకు గురైన ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించాల్సిన విషయాన్ని మరిచి ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నాయన్నది జనవ్యాఖ్య.