కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ వ్యవస్థను ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్ఘత విబేధాలు, వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ముందునుండి అండగా నిలిచిన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిపైన కూడా ఆయన ప్రత్యేక దృష్టిని పెట్టారనడానికి ఇటీవల ఇక్కడ జరుగుతున్న మార్పులే కారణం. తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితం కావడంపై ఆయన విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపిలో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు శైలనాథ్‌ను మార్చి గిడుగు రుద్రరాజుకు ఆ బాధ్యతను అప్పగించడాన్నిబట్టి ప్రక్షాళన దిశగా ఖర్గే అడుగులు పడుతున్నాయన్నది స్పష్టమవుతున్నది. తెలంగాణ విషయానికొస్తే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని దిల్లీకి పిలిపించుకుని రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పరిస్థితిపై సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తున్నది. రోజురోజుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దిగజారిపోతున్న దన్న విషయంపైన ఆయన రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులను కూడా అడిగి తెలుసుకుంటున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీ మారుతున్నారన్న విషయంపైనే ఆయన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తాజాగా మర్రి శశిధర్‌రెడ్డి వెళ్ళడం వెనుక ఏం జరిగిందన్న విషయంపైనే ఖర్గే పలువురిని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ మారిన వారి విషయంపైన ఆరా తీసినట్లు తెలుస్తున్నది. పార్టీని వీడి పోతున్నవారిని ఎందుకు నిరోధించలేకపోయారన్నది ఒకటికాగా, మర్రి శశిధర్‌రెడ్డి లాంటివారికి సమాధానం చెప్పుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేకపోయారన్న విషయంపైన ఆయన గట్టిగా నిలదీసినట్లు తెలుస్తున్నది. వాస్తవంగా రేవంత్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటినుండి యూత్‌లో ఉత్సాహం ఇనుమడించింది. ఆయన పార్టీ పరంగా ఇచ్చిన ప్రతీ పిలుపునందుకుని యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో చాలాకాలంగా స్థబ్ధతగా ఉన్న పార్టీలో కొంత ఊపు వొచ్చినట్లైంది. అయితే సీనియర్లు మాత్రం మొదటినుండీ ఆయనపైన అలకబూనారు.
పార్టీ కార్యక్రమాల్లోగాని, పార్టీ సమావేశాల్లోగాని వారు పాల్గొనకపోవడంతో క్యాడర్ చాలావరకు నిరాశకు లోనయింది. రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని తనతో తెచ్చుకున్నవారిని, తాను పార్టీలో చేర్చుకున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాడంటూ సీనియర్లు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి లాంటివారు పలు సందర్భాల్లో బహిరంగంగానే ఆయనపై విమర్షనాస్త్రాలను సంధించారు.మునుగోడు ఎన్నికలో పార్టీ నిలిపిన అభ్యర్థిని కాదని, పార్టీ మారిన తన తమ్యుడికి వోటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పడం రేవంత్‌రెడ్డిపైన ఆయనకున్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనకు నోటీసు ఇవ్వడం వేరే విషయం. అయితే మర్రి శశిధర్‌రెడ్డి విషయంలో ఆ విధంగా నోటీసు ఎందుకివ్వలేదన్న విషయంపైన కూడా ఖర్గే నిలదీసినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే రాష్ట్ర పార్టీ పనితీరుపై పార్టీ మారడానికి ముందు, మారుతున్న క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, శ్రవణ్ లాంటి వారు అధిష్టానానికి సుదీర్ఘ లేఖలు రాసారు. వాటన్నిటినీ ఇప్పుడు ఖర్గే పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డిపైన, పార్టీలోని మరికొందరిపైనా వారు వివరణాత్మకంగా రాసిన ఆ లేఖల్లోని సారాంశ అంశాల్లో నిజానిజాలను ఆయన నిగ్గుతేల్చేదిశలో ఉన్నట్లు సమాచారం.
సీనియర్‌లలో చాలామంది రేవంత్‌రెడ్డి వైపు వేలెత్తి చూపుతున్నప్పటికీ, ఏపిలో లాగా ఇక్కడ పిసీసి ప్రెసిడెంటును మార్చే ఆలోచన అధిష్టానానికి లేదని తెలుస్తున్నది. అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కొనసాగిస్తూనే పార్టీని ప్రక్షాళన చేసే ప్రక్రియలో అధిష్టానం ఉంది. టిపిసిసి కార్యవర్గంతో పాటు పలు జిల్లాల్లోని డిసిసి అధ్యక్షులను కూడా మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. పైరవీలు చేసుకుని పదవు)ను అలంకరించడం కాకుండా వాస్తవంగా పార్టీ శ్రేయస్సుకోసం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఐక్య కార్యాచరణతో పనిచేసేవారినే పార్టీ పదవుల్లో కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. వొచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను పూర్వంలా పటిష్టపర్చేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటి నొకదాన్ని ఏర్పాటు చేయాలని కూడా అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందులో పార్టీని దశాబ్ధాలకాలం అంటిపెట్టుకుని, నేటికీ నాన్ కాంట్రవర్సీగా ఉన్న జానారెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ లాంటి సీనియర్లను కమిటీ సభ్యులుగా తీసుకుని వారి సలహాలు, సూచనలతో పార్టీ కార్యక్రమాలను చేపట్టాలన్నది అధిష్టానం ఆలోచన. అయితే ఈ కమిటీకి ప్రియాంక నేతృత్వం వహించనున్నట్లు తెలుస్తున్నది. ఇకనుండి తెలంగాణరాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను ప్రియాంకనే పరిశీలించనుండడంతో కాంగ్రెస్ ఇప్పటికైనా గాడిలో పడుతుందన్న ఆశాభావాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
గెస్ట్ ఎడిట్ ….మండువ రవీందర్‌రావు