మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడుతామని మహిళా వోటర్లును ఆకట్టుకేలా ప్రసంగించారాయన.
తెలంగాణ ప్రజలు గత పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయారా…? ఆపార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లి పోయిందా..? అధికార మార్పిడిని కోరుకుంటున్నారా అంటే ప్రధాని నరేంద్రమోదీ మాటలు అవుననేవిగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరడం లేదు. తెలంగాణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి పర్చడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అవాంతరం ఏర్పడుతుంది. ఇక్కడ అవినీతి, మోసపూరిత ప్రభుత్వం కాకుండా నిజాయితీ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చేసిన బాసలు, వూసులు నెరవేర్చే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు. కాని, ఇక్కడ అభివృద్ధి జరుగకుండా రెండు కుటుంబ పాలిత పార్టీలు అడ్డుపడుతున్నాయి. ఈ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మార్చాయి. వీటికి ప్రజల సంక్షేమం పట్టదు. వారికి కావాల్సింది కేవలం కుటుంబ ప్రయోజనాలు మాత్రమే. తెలంగాణ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులన్నీ అవినీతితో కూడుకున్నవే. వీటివల్ల ఆ పార్టీలు చెబుతున్నంతగా రైతులకు ప్రయోజనకారివేమీకాదు. నీళ్ళను ఆశిస్తున్న రైతులకు వీరు కన్నీళ్ళు తెప్పిస్తున్నారు. ప్రాజెక్టుల పేరున రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల పథకాలను కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. వాగ్ధానం చేసినట్లుగా రైతులకు రుణమాఫీ కల్పించకపోవడంతో అనేక మంది రైతుల దుర్మరణానికి కారణమైనారు.
అందుకు కారణం తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్న కుటుంబాల పార్టీలే కారణం. బైద పీపుల్, ఫర్‌ద పీపుల్‌కు భిన్నంగా వీరు ఫర్ ద ఫ్యామిలీ.. బై ద ఫ్యామిలీ.. పార్టీ అఫ్ ద ఫ్యామిలీగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీలు ఒక ప్రైవేటు కంపెనీలుగా మారాయి. ఆ కంపెనీల్లోని కీలక పోస్టులన్నీ వారి కుంటుంబ సభ్యులతోనే నిండి ఉంటాయి. జిఎంలు, సీఇవో, మేనేజర్‌తో సహా అందరూ ఆ కుటుంబ సభ్యులే ఉంటారు. మిగతా పోస్టుల్లోనే ఇతర సభ్యులను నియమిస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. పరివార పార్టీలకు చరమగీతం పాడాలనుకుంటున్నారు. అలాంటప్పుడు వారికి ఆశాజనకంగా కనిపిస్తున్నది బిజెపి ఒక్కటే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పాలమూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యానం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మరో వారం రోజుల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో మోదీ తెలంగాణ టూర్ పెట్టుకున్నారు. ఈ నెలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఆయన సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలకుపైగా అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాజకీయలపై మాట్లాడనంటూనే మరి కొద్ది నిమిషాల్లో సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో (ఖులే మైదాన్ మే) మాట్లాడుతాననడంతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకిపెడుతారన్నది స్పష్టమైంది.
అనుకున్నట్లుగానే ఆయన ఇటు అధికార బిఆర్‌ఎస్, దేశంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల పేరు ఎత్తకుండానే పరోక్షంగా వాటిపై దాడి చేశారు. సహజంగా ఆయన తన ప్రసంగంలో తరుచు వాడే బాహియోం, బహనావోమ్‌కు బదులు తెలుగులో ‘నా కుటంబ సభ్యులారా …’ అంటూ మధ్యమధ్యలో సంబోధించడం ద్వారా సభికులను అకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజల జీవితాలను తీర్చిదిద్దడం, అన్ని విధాల వారిని అభివృద్ధి పర్చాలన్న నిరంతరం ఆలోచించే బిజెపివైపునే ఇప్పుడు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బిజెపి ప్రభుత్వం అంటే మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందంటేనే అది తప్పకుండా అమలవుతుందన్న నమ్మకాన్ని ప్రజలు వ్యక్తంచూస్తున్నారని పేర్కొన్న మోదీ తన ప్రసంగంలో మహిళల్లో సెంటిమెంటు రగిలించే ప్రయత్నం చేశారు. దిల్లీలో తమ ‘అన్న’ ఉన్నాడన్న నమ్మకం మహిళల్లో ఉందన్నారు. ఆ అభిమానంతోనే ఇప్పటికే మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడుతామని మహిళా వోటర్లును ఆకట్టుకేలా ప్రసంగించారాయన.
అలాగే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యాన్ని ఇస్తుందనడానికి తెలంగాణ తలమానికంగా ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సుమారు ఆరువేల కోట్లతో పునరద్ధరించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేకున్నప్పటికీ రైతుల మేలుకోరి కోట్లాదిరూపాయలు వారి ఖాతాలో జమచేసిన చరిత్ర బిజెపిదన్న విషయాన్ని ఆయన రైతులకు గుర్తుచేశారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అమలుచేస్తున్న పలు ఇతర పథకాలు, కొత్తగా ప్రకటించిన పథకాలను దృష్టిలో పెట్టుకుని వొచ్చే ఎన్నికల్లో ప్రజల బిజెపీని ఆశీర్వదిస్తార్నన్న ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలంగా విభజన హామీలను నెరవేర్చలేకపోయిన కేంద్ర ప్రభుత్వం మాటల గారడీలో పడవద్దంటున్నాయి అధికార బిఆర్‌ఎస్, ప్రధాన పక్షం కాంగ్రెస్.
మండువ రవీందర్‌రావు,
సీనియర్ జర్నలిస్ట్.