ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్3: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ పని చేయనుంది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు కానుంది. విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. చైర్మన్, సభ్యులు రెండేండ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు.
విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్ ఛైర్మన్, సభ్యులను త్వరలో నియమించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విద్యాకమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వరదసహాయక చర్యల్లో పోలీసుల పనితీరు భేష్
ప్రాణాలకు తెగించి పలువురిని కాపాడిన పోలీసులు
సీతారాం తండాలో చిక్కుకున్న 40మంది తరలింపు
సిరోల్ ఎస్ఐ నగేశ్‌ను సన్మానించిన సిఎం రేంవత్
]మహబూబాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్3: మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వరదలు పొటెత్తాయి. దీంతో అధికారులు, పోలీసులు పగలు రాత్రి అని తేడా లేకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజలకు అవసరమైన సహాయం చేస్తూ.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతారాం తండాలో వరదల్లో చిక్కుకున్న 40 కుటుంబాలను పోలీసులు కాపాడారు.. వారిని సకాలంలో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. అంతేకాకుండా.. చాలా మందికి ఆహారం సమకూర్చారు.. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని పోలీస్ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సన్మానించి ప్రశంసించారు. మహబూబాబాద్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులను అభినందించారు.
సీతారాం తండాలో వరదల్లో చిక్కుకున్న వారిని ప్రజలను ఒడ్డుకు చేర్చడంలో కీలక భూమిక నిర్వహించిన మహబూబాబాద్ జిల్లాలోని సిరోల్ ఎస్.ఐ సిహెచ్ నగేష్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. సహాయక చర్యల్లో ప్రధాన పాత్ర వహించిన పోలీసులను రేవంత్ రెడ్డి ప్రశంసించారు.అనంతరం, వరద నీటితో కేసముద్రం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో కేసముద్రం, మహబూబాబాద్ టౌన్ రైల్వేస్టేషన్ లొ రైలు నిలిచిపోయి ప్యాసెంజర్లు ఇబ్బంది పడకుండా తినడానికి ఆహారంతో పాటు వాటర్ బాటిల్స్, బిస్కెట్ పాకెట్స్ సమకూర్చిన సీఐలను ముఖ్యమంత్రి సన్మానించారు.
రైల్వే స్టేషన్ లో ఉన్న 5300 మంది ప్రయాణికులను కాజిపేటకు తరలించిన రూరల్ సీఐ సరవయ్య, టౌన్ సీఐ దేవేందర్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. వర్షాల్లో ఇబ్బందులు పడ్డ బాధితులను ఆదుకునేలా చర్యలు చేపట్టిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ను, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సన్మానం అందుకున్న ఎస్ఐ నగేష్ సిఐలు సర్వయ్య, దేవేందర్ లను డిజిపి డాక్టర్ జితేందర్, శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ ప్రశంసించారు. విధి నిర్వహణలో పలువురికి ఆదర్శంగా నిలిచారని వారిని కొనియాడారు.
““