తెలంగాణ సాధనతో నా జన్మ సార్థకమైంది

  • సమైక్యతా దినంగా హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజు
  • నేడు దేశంలో అనేక రంగాల్లో నెం. 1 స్థానంలో తెలంగాణ
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం
  • వైద్య విద్యలో నూతన విప్లవం…జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌
  • ఐటి రంగంలో దేశంలోనే మేటిగా తెలంగాణ
  • మన పల్లెలు, పట్టణాలకు జాతీయ అవార్డులు
  • విశ్వనగరంగా హైదరాబాద్‌
  • స్వర్ణయుగాన్ని తలపిస్తున్న సాగు నీటి రంగం
  • జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలలో సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని, ప్రాణాలు తృణప్రాయంగా భావించి అనేక మంది గుండెలు ఎదురొడ్డి నిలిచారని, ఆనాటి ప్రజా పోరాటాలు, త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అంతకు ముందు సిఎం గన్‌పార్క్‌ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో వేడుకలలో పాల్గొన్న సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ…జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి ప్రజల పోరాటాలు జాతి గుండెల్లో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజును..జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామని సెం ఈ సందర్భంగా తెలిపారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురంభీం, రావి నారాయణరెడ్డి, షోయబ్‌ ఉల్లాఖాన్‌, సురవరం ప్రతాపరెడ్డి, స్వామి రామానందతీర్థ, జమలాపురం కేశవరావు, బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథి లాంటి ఎందరో యోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు. నాటి జాతీయోద్యమనాయకుల స్ఫూర్తిదాయక కృషిని ఎల్లప్పుడూ స్మరించుకుందామన్నారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ చాకచక్యం, మరెందరో నేతల అవిరళ కృషి వల్ల దేశం ఏకీకృతమైందని, నాటి జాతీయోద్యమనాయకుల స్ఫూర్తిదాయక కృషిని సైతం ఈ సందర్భంగా ఘనంగా  స్మరించుకుందామన్నారు. ఇక తెలంగాణ సాధనతో తన జన్మ సార్ధకమైందని, అయితే దేశం ఇప్పటికి కూడా ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా చూసినప్పుడు తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందని, తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, లబ్దిదారుల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించి..పెన్షన్లు పెంచామన్నారు. దేశంలో ఎక్కడ దళితబంధు పథకం లేదని, దళితబంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపామని, ఆదివాసీలకు పోడుభూముల పట్టాలు ఇచ్చామని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వ్యవసాయానికి ఎంతో లబ్ధి చేకూరిందని, దీంతో నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లా..మొత్తం 6 జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాల భూములకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు అందుతుందని,  పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నదని కెసిఆర్‌ తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఆ పథకాన్ని పట్టించుకోలేదని అన్నారు. పాలమూరు జిల్లాలో కరువును తరిమికొట్టామని, ఇప్పుడు పాలమూరు సస్యశ్యామలమవుతుందన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, వరంగల్‌ జిల్లాకు కూడా అదనంగా సాగునీటిని అందిస్తామని ఈ సందర్భంగా కెసిఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, త్వరలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెేలిపారు. హైదరాబాద్‌ రాష్ట్రం కొనసాగి ఉంటే అప్పర్‌ కృష్ణా, తుంగభద్ర..భీమా ఎడమ కాలువ ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదన్నారు.

వైద్య విద్యలో నూతన విప్లవం…జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌
దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించిందని, పేద ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని సిఎం కెసిఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యవిద్యను చేరువచేస్తూ, వైద్యసేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఈ దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్యకళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 8 మెడికల్‌ కాలేజీలను వొచ్చే ఏడాది ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసుకున్నామని, దీంతో జిల్లాకో మెడికల్‌ కాలేజీ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోబోతున్నదని అన్నారు. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 2017లో ప్రభుత్వం 4 కాలేజీలు ఏర్పాటు చేసిందని, అదే క్రమంలో 2020లో ఒకేసారి 8 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసుకోగా గతేడాదే వాటిని ప్రారంభించుకున్నామని, శుక్రవారం ఒకేరోజున 9 వైద్య కళాశాలలను ప్రారంభించుకున్నామని,  దీంతో 26 ప్రభుత్వమెడికల్‌ కాలేజీలు మన రాష్ట్రంలో అందుబాటులోకి వొచ్చాయని సిఎం తెలిపారు. 2014 నాటికున్న ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో కేవలం 850 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగిందన్నారు.

2014లో ప్రభుత్వ ప్రైవేటురంగంలో కలిపి మొత్తం 2,850 మెడికల్‌ సీట్లు మాత్రమే ఉండగా, ఇవాళ మూడిరతలు పెరిగిపోయాయని, ప్రతిఏటా పదివేలమంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నదని తెలియజేయడానికి తాను గర్విస్తున్నానన్నారు. రాష్ట్రంలో వైద్యసేవలు మరింత విస్తరించాలని, నిరుపేదలకు కూడా సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెద్దసంఖ్యలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నదన్నారు. వరంగల్‌ నగరంలో 1,116 కోట్ల రూపాయల వ్యయంతో 2,458 పడకల సామర్ధ్యంతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం వేగంగా సాగుతున్నదని, హైదరాబాద్‌ నగరానికి నలువైపులా నాలుగు టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మించుకుంటున్నామని, మరో రెండు వేల పడకలతో నిమ్స్‌ హాస్పిటల్‌ని విస్తరించుకుంటున్నామని సిఎం తెలిపారు. వీటికితోడు బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, ఉచిత డయాలసిస్‌ సేవా కేంద్రాలు, ఉచిత డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేయడంతో రోగులకు మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి వొచ్చాయన్నారు. రెండు దఫాలుగా నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో కోట్లాది మందికి దృష్టి లోపాలను సరిదిద్దగలిగామని, వీటికి తోడు కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ గర్భిణీలు, బాలింతలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు.  ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు తల్లీ, పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామన్నారు.

నేడు దేశంలో అనేక రంగాల్లో నెం. 1 స్థానంలో తెలంగాణ
నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. అనతి కాలంలోనే విద్యుత్‌ రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటల పాటు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. తలసరి ఆదాయంలో కూడా 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని చెప్పారు. మిషన్‌ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ మాత్రమేని తెలిపారు. దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్న వయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్‌ మార్మోగుతున్నదని, తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని అన్నారు. మన సమైక్యతే మనకు బలమని, ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని, తెలంగాణ ప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దామని సీఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ఐటి రంగంలో దేశంలోనే మేటిగా తెలంగాణ
రాష్ట్రంలో ఐటీ రంగం దినదినాభివృద్ధి సాధిస్తున్నదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రోజుకో కొత్త సంస్థ ముందుకు వొస్తున్నదని, ఐటీ రంగంలో నేడు తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగిందని సిఎం కెసిఆర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ఉండగా, నేడు వారి సంఖ్య 9 లక్షల 5 వేల 715కు పెరిగిందన్నారు. అదే విధంగా 2014లో ఐటీ ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా, నేడది 2 లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగిందని చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకొని, ఐటీ టవర్లు నిర్మించుకున్నామని సిఎం కెసిఆర్‌ తెలిపారు.

మన పల్లెలు, పట్టణాలకు జాతీయ అవార్డులు
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయని, చక్కటి వసతులు సమకూరి, పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయని సీఎం చెప్పారు. ఇటీవల రాష్ట్రపతి చేతులు మీదుగా మన స్థానిక సంస్థల ప్రతినిధులు 13 జాతీయ అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. పాలనా సౌకర్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త పంచాయతీలు, అవసరాన్ని బట్టి కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రతిజిల్లా ప్రధాన కేంద్రంలో జిల్లా సమీకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలు నిర్మించుకుంటున్నామని, దాంతో ప్రభుత్వ పాలన ప్రజలకు దగ్గరైందని చెప్పారు.

విశ్వనగరంగా హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరం ఓ మినీ ఇండియా అని సీఎం కెసిఆర్‌ అభివర్ణించారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో కలసిమెలసి బతుకుతున్నారన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు గట్టి పునాదులు వేశామని, గతంలోలా మత కల్లోలాలు, గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్‌ నగరం ప్రశాంతంగా ఉందని చెప్పారు. పారదర్శక పరిపాలన, నిరంతర విద్యుత్తు వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయన్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించి, సిగ్నల్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి, పూర్తిచేస్తున్నామని చెప్పారు. నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పటికే 20 ఫ్లై ఓవర్లు పూర్తి చేసి ప్రారంభించుకున్నామని, అంతర్జాతీయస్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున హుస్సేన్‌ సాగర్‌ నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయని సీఎం చెప్పారు. హైదరాబాద్‌ నగరం నలువైపులా 69 వేలకోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీంతో హైదరాబాద్‌లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నదని, విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నదని సిఎం అన్నారు.

స్వర్ణయుగాన్ని తలపిస్తున్న సాగు నీటి రంగం
కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు, మిషన్‌ కాకతీయ,పెండిరగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని సీఎం అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబంధు, రైతు బీమా, 37 వేల కోట్ల రూపాయల వరకు పంటరుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నకు ఊరటనిచ్చాయన్నారు. నేడు వ్యవసాయం పండుగగా మారిందని, సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తున్నారని, ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నదని, వరి ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంవైపు తెలంగాణ పరుగులు పెడుతున్నదని సీఎం తెలిపారు. రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల, సుఫల, సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గానూ కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తిచేసే కృషిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page