సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి
ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఈ ఐదుగురు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేలా చూడాలి. ఎపికి చెందిన టిడిపి మంత్రులు ఎపి సమస్యలపై నిలదీసేందుకు వెనకాడక పోవొచ్చు. అలాగే సమస్యలు ప్రస్తావిస్తామని, తమ పదవులను ఎపి ప్రయోజనాల కోసం వినియోగి స్తామని కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు ప్రకటించారు. వారికి సమస్యల పట్ల చిత్తశుద్ది ఉంది. ఎపిని బాగుచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేజోన్ వంటివి వారి ఎజెండాలో ఉన్నాయి. తెలంగాణలో కూడా అలాంటి సమస్యలు పరిష్కరిం చేందుకు ఎజెండాను తయారు చేసుకునే పనిలో ఇక్కడి మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ముందుండాలి. తెలంగాణకోసం లక్షలకోట్లు ఇచ్చామని కాకమ్మకబుర్లు చెబితే ప్రజలు ఇకముందు నమ్మరు. తెలంగాణలో కూడా ఇద్దరు మంత్రులు కొంతకాలం రాజకీయాలను పక్కన పెట్టాలి. అదేపనిగా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ఎజెండాను పక్కన పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి సమస్యల కోసం పోరాడాలి. ఇక్కడ ఏ మేలు జరిగినా ప్రజలకే అన్న భావనలో ముందుకు సాగాలి. తమ రాజకీయాల కోసం ప్రజల సమస్యలను పక్కన పెట్టే ప్రయత్నాలు ఇకనుంచి నడవకుండా చూసుకోవాలి.
అన్నింటికి మించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఎపి సమస్యలపై కొంత డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. మోదీ బలం కూడా అంతంత మాత్రమే ఉంది. ఈ క్రమంలో దేశం ఎదుర్కొంటున్న ,ముఖ్యంగా ఎపి విభజన సమస్యల పై చర్చల ద్వారా సాధించుకోవాల్సింది చాలా ఉంది. ప్రధాని మోదీ కూడా గతంలోగా కాకుండా కొంత ఉదారంగా వ్యవహరించి ప్రజల సమస్యలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. సహచరులు, మంత్రులు చెప్పే సమస్యలను పరిష్కరించే లక్ష్యం దిశగా పనిచేయాలి. రాజకీయాల్లో కూడా అప్పుడ ప్పుడు వాతావరణ సమతుల్యత కనిపిస్తుందనడానికి ఇటీవలి ఫలితాలను బేరీజు వేసుకోవొచ్చు. ప్రకృతి ప్రమేయం ఇక్కడా కనిపించడం గమనించవొచ్చు. తనకు తిరుగులేదనుకున్న వైకాపాను తిరుగుటపా కట్టించిన తీరు చూశాం. 151 సీట్లలో మధ్యలో ఉన్న ఐదును లాగేసుకోవడంతో ఆ పార్టీ 11కు పరిమితం అయ్యింది. తాను అంతా మంచే చేశానని, డబ్బుల పందేరం చేశానని జగన్ వగచినా..జనం నమ్మలేదు. పాలన అంటే డబ్బులు పంచే కార్యక్రమం కాదని జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి.
చంద్రబాబు కూడా ఇలాంటి ప్రయత్నాల జోలికి పోకుండా రాష్టాన్న్రి గాడిలో పెట్టే పనిలో పడాలి. అంతుకముందు తనకు తిరుగు లేదన్న బిఆర్‌ఎస్ అధకారం ఊడబెరికి అవతల పెట్టారు. అయినా ఇంకా ఎగిరెగిరి పడడం చూసి సహించలేని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న కోరలను కూడా పీకేశారు. ఇది చాలు..వారి నిర్వాకానికి. అన్నీ తప్పులు చేసి, అప్పులు చేసి, అదే అభివృద్ది, అదే పాలన అని చెప్పిన జగన్, కెసిఆర్‌లకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు. ఇరు తెలుగు రాష్టాల్ల్రో ఓ రకంగా ప్రకృతి న్యాయం చేసిందనే భావించాలి. ఇది అందరికీ గుణపాఠం కావాలి. అలాగే మోదీని కూడా 240 సీట్లకు పరిమితం చేశారు. ప్రజాస్వామ్యం కలిసి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది.
ఇప్పుడు మోదీ కావొచ్చు.. జగన్ కావొ చ్చు..రేవంత్ కావొచ్చు… ప్రజలను దృష్టి పెట్టుకుని నిర్ణయాలతో ముందుకు సాగాలి. దేశ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ తీర్పు ఒక గొప్ప గుణపాఠం అన్నది గుర్తించాలి. మోదీ అనుకున్నట్లుగా నాలుగువందల సీట్లు సాధించివుంటే ఆయనకు పట్టపగ్గాలు ఉండేవి కావు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల పాత్ర రాష్ట్రం వరకే పరిమితమై ఉండేది. దుష్పరిపాలన అంతం అయిందని ప్రజలు భావించేవారు. రాజధాని మొదల్కెన అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం యధావిధిగా చంద్రబాబు కేంద్రం చుట్టూ తిరగాల్సి వచ్చేది. భేతాళ కథల్లాగా అలుపెరగకుండా చంద్రబాబు పర్యటనలకే పరిమితం అయ్యేవారు.
అయితే ఇప్పుడా పరిస్థితి లేనందుకు సంతోషించాలి. ఇప్పుడున్న ఇద్దరు మంత్రులు గట్టిగా పోరాటం చేయాల్సిందే. చంద్రబాబు కూడా నాన్చివేత ధోరణని ప్రదర్శించకుండా నిక్కచ్చిగా నిలదీయగలగాలి. అసెంబ్లీ విజయం కంటె లోక్‌సభకు తెలుగుదేశం నుంచి గెలిచిన సభ్యుల సంఖ్యకు అధిక ప్రాధాన్యం ఏర్పడిరదన్న విషయం ఎప్పుడూ గుర్తించి ముందుకు సాగాలి. మోదీ కూడా తనకు సీట్లు తక్కువ ఉన్నాయనే భావంతో పనుల్లో జోరు పెంచాలి. విపక్షాలకు గౌవరం ఇవ్వాలి. పార్లమెంట్ ప్రజల సమస్యలకు వేదికగా మారాలి. మోదీకి పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే, చంద్రబాబు ప్రాధాన్యం అత్యంత పరిమితంగా ఉండేది. తెలుగుదేశం బలగం మోదీ ప్రభుత్వ మనుగడకే కీలకం కావడంతో, ఇప్పుడు చంద్రబాబు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
బీజేపీ ప్రభుత్వం దూకుడుకు ఈ రెండు పార్టీలు క్లళెం వేస్తాయని, వేయాలని దేశంలోని వివిధ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి. ఎపికి సంబంధించి గౌరవం ఇచ్చి, అభివృద్దికి ఆసరా ఇచ్చినంత కాలం చంద్రబాబు మిత్రధర్మానికే కట్టుబడి ఉండవొచ్చు. లేకుంటే ప్రత్యామ్నాయం కూడా వెంటనే ఉంది. అవతల ఇండియా కూటమి కూడా బలంగానే ఉందన్న విషయం గమనించి దేశం కోసం మోదీ నిజంగానే కష్టపడాలి. ఇంతకాలం చేసిన ప్రచారార్భాటాలు పక్కన పెట్టాలి. ఏకపక్ష పాలనకు, సంకీర్ణ భాగస్వామ్యపాలనకు తేడా ఇప్పుడు ప్రజలు కూడా గమని స్తుంటారు. ఎవరు కట్టు తప్పినా ప్రజలు చూస్తూనే ఉంటారు. ఒకే దేశం ఒకే నాయకుడు అని భ్రమిస్తే మోదీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఇండియా కూటమి అప్రమత్తంగా ఉన్నంత కాలం, బీజేపీ మీద ఆ ఒత్తిడి పనిచేస్తూనే ఉంటుంది. పాలక కూటముల మధ్య పోటీ వల్ల కూడా ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. మిత్ర పక్షాలన్నిటి నుంచి ఒత్తిడిని తప్పించుకోవడానికి బీజేపీ ఇతర మార్గాల ద్వారా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటుంది. ఏ పార్టీని, చీల్చుదామా అని అన్వేషిస్తుంటుంది. అందువల్ల అన్ని పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రధాని పదవికి కూడా మచ్చతెచ్చే విధంగా సాగిన విద్వేష ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. అందువల్ల మోదీ కూడా జాగ్రత్తగా ఐదేళ్లు పాలించి మంచి పేరు తెచ్చు కోవాల్సి ఉంది. అభివృద్ది ఎజెండగా సాగినంత కాలం ప్రజలు నిరంతరంగా అండగా ఉంటారని గుర్తించి మసలుకోవాలి. నంబర్ గేమ్ కోసం వెంపర్లాడే పనులకు కొంతకాలం విరామం ఇవ్వాలి. ప్రధాని వద్ద సమస్యలను ప్రస్తావించడంలో మంత్రులు నిర్భయంగా ముందుకు సాగాలి. ఈ విషయంలో భయంతో వెళితే సమస్యలు పరిష్కారానికి నోచుకోవని గుర్తించాలి. ముఖ్యంగా బిజెపి మంత్రులు ఇది బాగా గుర్తించాలి.
-కె.ఎస్