తెలుగు సినిమాకు వన్నెలద్దిన అభినవ అల్లూరి

‘‘‌మానవత్వంతో మూర్తీభవించిన ఘట్టమనేని మంచి నటుడు, బాధ్యతగల పౌరుడు, వివాదాలెరుగని వీరుడు, అభిమానుల గుండెల్లో నిలిచిన అద్వితీయుడిగా 2,500లకు పైగా అభిమాన సంఘాల మనసు దోచిన మన నటశేఖరుడు నేటి తరం నటీనటులకు దిక్సూచిగా నిలిచారు.’’

(టాలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌నటశేఖరుడు కృష్ణ అంతిమ శ్వాస వార్తకు స్పందనగా)
నిన్నటి టాలీవుడ్‌ ‌తార రాలిపోయింది. యన్టీఆర్‌, ఏఎన్నార్‌, ‌శోభన్‌ ‌బాబు, కృష్ణంరాజులను కలిసి కోవడానికి ఆకాశానికి పయనమైనారు మన నటశేఖరుడు. అంతరిక్షానికి చేరింది మరో ధృవ తార. తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా పలు సంచలనాలకు తెరతీశారు. తేనె మనసున్న మహామనీషిగా కీర్తి గడించారు. తొలి కౌబాయ్‌ ‌వేషం వేసినా, అభినవ అల్లూరి సీతారామరాజుగా నిటించి మెప్పించినా, జేమ్స్‌బాండ్‌గా అవతారమెత్తినా అది కృష్ణకే స్వంతం. కృష్ణ నట, వ్యక్తిగత జీవితం నేటి యువతకు కూడా ప్రేరణాత్మకం. ప్రముఖ నటుడు, నిర్మాత,దర్శకులు, రాజకీయ నాయకుడుగా మనందరికీ చిరపరితుతుడైన కృష్ణ నిజ జీవితంలో కూడా మహా నాయకుడుగా, మానవీయ మూర్తిగా, మంచి మనసున్న మనిషిగా నిలిచారు. టాలీవుడ్‌లో 350కి పైగా సినిమాల్లో నటించిన నటశేఖరుడు 2009లో పద్మ భూషన అవార్డును స్వీకరించారు. కాంగ్రేస్‌ ‌పార్టీ పక్షాన 1989 యంపీగా ఎంపికై ప్రజలతో మమేకం అయ్యారు. తొలి ఈస్ట్‌మన్‌ ‌కలర్‌ ‌చిత్రం(1982-ఈనాడు), తొలి సినీమాస్కోప్‌ ‌చిత్రం(1974-అల్లూరి సీతారామరాజు), తొలి 70యంయం (1986-సింహాసనం) చిత్రం, తొలి గూఢచారి (1966-గూఢచారి 116), తొలి జేమ్స్‌బాండ్‌ ‌చిత్రం (మోసగాళ్లకు మోసగాడు), తొలి డిటియస్‌(1995-‌తెలుగువారి లేవరా)సినిమా, తొలి ఓఆర్‌డబ్ల్యూ రంగుల చిత్రం (గూడుపుఠాణి), తొలి ఫ్యూజీ ఫిలిమ్‌(‌భలే దొంగలు), తొలి సినిమాస్కోప్‌ ‌టెక్నోవిజన్‌ ‌చిత్రం (దొంగల దోపిడీ), బహు నాయకుల సినిమాలకు చిరునామాగా నిలిచారు.
బాల్యం, వ్యక్తిగత జీవితం :
తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న మహా నటుడు మన ‘ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి’. తేనె మనసున్న మన జేమ్స్‌బాండ్‌ 31 ‌మే 1942న ఏపి రాష్ట్ర గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో నాగరత్నమ్మ-రాఘవయ్య దంపతులకు జన్మించారు. 1960లో ఏలూరు సి ఆర్‌ ‌రెడ్డి కళాశాలలో బియస్సీ పూర్తి చేసిన కృష్ణ కళాశాల జీవితంలోనే నటన పట్ల ఆకర్షితులైనారు.  కృష్ణ – ఇందిర దంపతులకు ముగ్గురు కుమార్తెలు (పద్మావతి జయదేవ్‌, ‌మంజుల-సంజయ్‌, ‌ప్రియదర్శిని-సుధీర్‌), ఇద్దరు కుమారులు(మహేష్‌ ‌బాబు, రమేష్‌ ‌బాబు) ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలు అగ్ర నటుడిగా సేవలందించిన కృష్ణ 79వ ఏట పలు అనారోగ్య కారణాలతో 15 నవంబర్‌ ‌తెల్లవారు జామున కన్నుమూసి అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచారు. 2019లో విజయ నిర్మల,జనవరి 2022లో కుమారుడు రమేష్‌ ‌బాబు, సెప్టెంబర్‌ 2022‌లో సతీమణి ఇందిర మరణాలు కృష్ణకు కోలుకోలేని మనో వేదనకు కారణం అయ్యాయి.
సినీ ప్రస్థానం-సాహసాలకే చిరునామా:
తేనె మనసులు(1965) సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయమైన ఘట్టమనేని శివరామ కృష్ణ కులగోత్రాలు (1961), పదండి ముందుకు(1962), పరువు ప్రతిష్ట (1963), సాక్షి(1967) లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించి మెప్పించారు. పండంటి కాపురం(1972) లాంటి అలనాటి అపూర్వ సినిమాలకు ప్రాణం పోసిన ఘట్టమనేని నేషనల్‌ ‌బెస్ట్ ‌తెలుగు ఫిలిమ్‌ ఆవార్డు పొందారు. చారిత్రక, పౌరాణిక, పాశ్చాత్య, ఫాంటసీ, గూఢాచారి, సాంఘిక సినిమాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. తొలి సినిమా స్కోప్‌ ‌చిత్రంగా అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలై సంచలనం సృష్టించడమే కాకుండా అనేక భాషల్లో కూడా విడుదలై బహుళ ప్రచారం పొందగలగడం విశేషం. ఈనాడు (1982), సింహాసనం (1986), తెలుగు వీర లేవరా(1995), గూఢాచారి 116(1966), జేమ్స్‌బాండ్‌ 777(1971), ‌గూఢాచారి 117(1989) లాంటి అలనాటి చిత్రాల్లో తన ముద్రను చూపారు. దర్శకుడిగా శంఖారావం (1987), ముగ్గురు కోడళ్లు(1988), కొడుకు దిద్దిన కాపురం (1989), బాలచంద్రుడు(1990), అన్నాతమ్ముడు(1990) లాంటి 17 సినిమాలను తీసారు. అత్యంత బిజీ నటుడిగా ఏడాదికి 10 సినిమాలకు పైగా నటిస్తూ, ఏకధాటిగా రోజుకు మూడు షిఫ్టుల్లో పను చేస్తూ అనేక సంవత్సరాలు అప్రతిహతంగా వెలుగొందారు. తన సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు హింది, తమిళం, మలయాళం, బెంగాలి లాంటి ఒబాషల్లో కూడా పలు విజయవంతమైన సినిమాలను పద్మాలయ స్టూడియోను స్థాపించి తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాదుకు తరలేలా మార్గం సుగమం చేశారు.
ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదన్‌ ‌రావు, కె విశ్వనాథ్‌, ‌దాసరి నారాయణ రావు, కె రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో తన పాత్రలకు జీవం పోశారు. సతీమణి విజయ నిర్మలతో కలిసి 48 సినిమాలు, జయప్రదతో కలిసి 47 సినిమాల్లో నటించి మెప్పించారు. సతీమణులు ఇందిరా, విజయ నిర్మల, కొడుకు రమేష్‌ల మరణానికి చిలించిన కృంగిపోయిన సూపర్‌ ‌స్టార్‌ ‌కృష్ణ 15 నవంబర్‌ 2022 ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కొడుకు మహేష్‌ ‌బాబును బాల నటుడిగా తెరకు పరిచయం చేశారు. నాటి సినీ దిగ్గజాలు యంటీఆర్‌, ఏయన్‌ఆర్‌, ‌శోభన్‌బాబు లాంటి కథానాయకులతో కలిసి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. అగ్నిపరీక్ష (1970), మోసగాళ్లకు మోసగాడు(1971), దేవుడు చేసిన మనుషులు (1973), పాడిపంటలు(1976), కురుక్షేత్రం(1976), వియ్యాలవారి కయ్యాలు (1979), అల్లరి బుల్లోడు(1979, మండే గుండెలు(1979), కొత్త అల్లుడు(1979), బుర్రిపాలెం బుల్లోడు(1979),ముందడుగు(1983), అగ్నిపర్వతం(1985), పట్నాటి సింహం(1985), ముద్దాయి లాంటి అనేక ప్రజాధరణ పొందిన సినిమాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. కృష్ణ నటించిన మరో సంచలన చిత్రం మాయదారి మల్లిగాడు ఎంతో ప్రజాధరణ పొందిన చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచింది. మానవత్వంతో మూర్తీభవించిన ఘట్టమనేని మంచి నటుడు, బాధ్యతగల పౌరుడు, వివాదాలెరుగని వీరుడు, అభిమానుల గుండెల్లో నిలిచిన అద్వితీయుడిగా 2,500లకు పైగా అభిమాన సంఘాల మనసు దోచిన మన నటశేఖరుడు నేటి తరం నటీనటులకు దిక్సూచిగా నిలిచారు. 2016లో చివరి సారి శ్రీ శ్రీ సినిమాలో నటించారు.
పురస్కారాలే పులకించిన వేళ:
2009లో కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్‌ ‌పురస్కారం, 1974లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు, 2003లో యన్‌టిఆర్‌ ‌జాతీయ పురస్కారం, దక్షిణ భారత ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు, ఫిలిమ్‌ఫేర్‌ ‌జీవన సాఫల్య పురస్కారం లాంటి అనేక ఉత్తమ అవార్డులు పొందారు. కృష్ణ పొందిన అవార్డుల కన్న మిన్నగా ప్రేక్షకుల మనో మందిరాల్లో నటశేఖరుడు, సూపర్‌ ‌స్టార్‌గా చెరగని ముద్రను వేశారు. మనసున్న మనిషి, నిగర్వి, సినీ నిర్మాతలకు ఆరాధ్యుడు, సాహసాలకే సవాళ్లు విసిరిన ధీరుడు, అభినవ అల్లూరి, జేమ్స్‌బాండ్‌, ‌కౌబాయ్‌, ‌రైతు పక్షపాతి, అలుపెరుగని వెండి తెర వెలుగు, వివాద రహితుడు, మానవత్వం పరిమళించిన మూర్తిమత్వం, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఘట్టమనేని శివరామ కృష్ణ జీవితం నేటి యువతకు దారి దీపం. కృష్ణ జీవితం నేటి తరానికి స్పూర్తిని నింపాలని, వారు చూపిన మార్గం మనకు నిత్య ప్రేరణ కావాలని కోరుకుందాం, వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page