- బాగుపడ్డది కెసిఆర్ కుటుంబం మాత్రమే
- ప్రజలు బిఆర్‌ఎస్ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి
- ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
- భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ
భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఇచ్చిన తెలంగాణలో బాగుపడ్డది కేవలం కెసిఆర్ కుటుంబం మాత్రమేనని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె భువనగిరిలో రోడ్ షోలో మాట్లాడుతూ… విూ దైనందిన జీవితంలో ప్రతి రోజూ పడుతున్న కష్టాల్లో..ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అవి విూకు వొస్తున్నాయా? అని ప్రజలను అడిగారు. ఈ సర్కార్‌పై అటువంటి ఆశ ఉందా?.. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వానికి అవగాహన లేదని ఆమె విమర్శించారు. నోట్ల రద్దు సమయంలో ఏటీఎం, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విషయంలో ప్రజలు చాలా కష్టపడ్డారని, తర్వాత కొరోనా వొచ్చి ఎన్నో ఇబ్బందులు వొచ్చాయని ప్రియాంక గాంధీ అన్నారు.
కానీ ఈ ప్రభుత్వం ప్రజల కష్టాల్లో అండగా నిలబడలేదని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కావాలనే ఆశ ఉందా? విూ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌కు వోట్లు వేసి గెలిపించాలని కోరారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతుందని, వ్యవసాయం చేసుకునే రైతులకు లోన్లు రావని, రుణమాఫీ జరగదని, ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే.. ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆమె ఆరోపించారు. పై నుంచి కింద వరకు ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి మయమేనని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలిసిన విషయమనని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అధికారం కోసం చూస్తాయని, ప్రజల కష్టాలను పట్టించుకోవని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తేవడం కోసం విూ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలియజేయాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం వొచ్చిందని ప్రియాంక గాంధీ అన్నారు.