ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : భారత్ లో తొలిసారి జరిగిన ఆరంభ ఎడిషన్ ఇండియన్ ఆయిల్, మోటో జీపీ ఇండియన్ గ్రాండ్ ప్రీ రేసులో మూనీ వీఆర్ 46 డుకాటి రేసింగ్ జట్టు రైడర్ మార్కో బెజ్జెకి(ఇటలీ) చాంపియన్‌గా నిలిచినట్లు ప్రీ రేసు ప్రతినిధులు సోమవారం నగరంలో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గ్రేటర్ నొయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన రేసులో బెజ్జెకి అందరికంటే వేగంగా 13 ల్యాప్‌లను 36 నిమిషాల 59.157 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ గెలుచుకున్నాడు. ఆరంభం నుంచి ప్రమాక్ డుకాటి టీమ్ రైడర్ జార్జ్ మార్టిన్(స్పెయిన్)తో నుంచి అతనికి గట్టి పోటీ ఎదురైంది. చివరకు మార్కోనే టైటిల్ గెలుచుకున్నాడు. జార్జ్ మార్టిన్ రెండో స్థానం సాధించగా.. మోన్‌స్టర్ యమహాకు చెందిన ఫ్రాన్స్ రైడర్ ఫాబియో క్వార్టారరో మూడో సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ చాంపియన్‌షిప్ లీడర్ ఫ్రాన్సెస్కో బగ్నాయా మరో ఎనిమిది ల్యాప్‌లు మిగిలి ఉండగానే క్రాష్ అయ్యాడు. కాగా, ఈ విజయంతో మోటో జీపీ రైడర్ల చాంపియన్ షిప్‌లో బెజ్జెకి తన అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. ఈ ప్రదేశం, ట్రాక్ తనకు చాలా బాగా నచ్చిందని ఈ విజయాన్ని అభిమానులతో కలిసి పంచుకున్నారు.