దళితబంధు..అనుయాయులకే విందు

  • ప్రహసనంగా మారిన ఎంపిక వ్యవహారం
  • ఎమ్మెల్యేలకు తలనొప్పి..శ్రేణుల్లో చిచ్చు

జగిత్యాల, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై దళిత వర్గాల్లో చిచ్చు మొదలైంది. తమనే ఎంపిక చేయాలంటూ పలు గ్రామాల్లో దళితులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. నియోజకవర్గానికి వంద మందిని దళిత బంధుకు ఎంపిక చేయాల్సి ఉండగా, ఆ వంద మందినీ ఎవరు ఎలా ఎంపిక చేస్తారన్న విషయం వివాదంగా మారుతుంది. ‘దళిత బంధు’ పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల నగదును బ్యాంకులో వేస్తారు. మొదటి దశలో తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 11,900 మంది అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఇప్పుడు 1200 కోట్లు కేటాయించినట్టు, రాబోయే మూడు నాలుగేండ్లలో రూ.35 – 40 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించారు. నిజానికి హుజూరాబాద్‌ ఎన్నికల సందర్భంగా ఈ పథకం ప్రకటించారు. అక్కడి నుంచే దీన్ని మొదలు పెట్టాలనుకున్నారు. అయితే ఈ పథకం ప్రకటన సమయం నుంచీ అనేక విమర్శలు వొచ్చాయి. ఈ పథకాన్ని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు ప్రకటించడంతో, ఆ ఎన్నికల కోసం వేసిన ఎత్తుగడగానే అందరూ చూశారు. పథకం విధి విధానాలు, నిధులపై తీవ్ర ఆరోపణలు వొచ్చాయి. ఎన్నడూ లేనిది, ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించి ఈ స్కీమ్‌ ‌గురించి వివరించారు. ఈ పథకాన్ని ముందుగా భావించినట్టు హుజూరాబాద్‌ ‌నుంచి కాకుండా, ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించారు. ఆ తరువాత హుజురాబాద్‌, ‌ఖమ్మంలోని చింతకాని, సూర్యాపేటలోని తిరుమలగిరి, నాగర్‌ ‌కర్నూల్‌ ‌లోని చరగొండ, కామారెడ్డిలోని నిజాంసాగర్‌ ‌మండలాలలో మొదలుపెట్టారు. దీనిని మరింత విస్తరిస్తూ అన్ని నియోజకవర్గాలలో, నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మార్చి నాటికి ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికైనా లబ్ధిదారుల ఎంపిక కోసం కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఎంపిక జరగాలి. కానీ దళిత బంధుకు ఏ మార్గదర్శకాలూ లేవు. దీంతో ఎంపిక పక్రియ పూర్తిగా స్థానిక రాజకీయ, అధికారుల విచక్షణపై, పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లాలోని ఒక మండలానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు పార్టీ స్థాపన నుండి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ అభివృద్ధికి పలు త్యాగాలు చేసాడు. జీవితాన్ని ఎన్నో రకాలుగా నష్ట పోయాడు. ఎమ్మెల్యే సాన్నిహిత్యంతో దళిత బంధు పథకం తనకే వొస్తుందని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ చివరకు పదవుల కోసం ఆశపడి వేరే పార్టీ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన వారి పేరును ప్రతిపాదించినట్లు తెలియడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. కనీసం తనకి కాకపోయినా, అర్హులయిన నిరుపేద కుటుంబం వారెవరికైనా వొస్తుందేమో అనుకున్నారు. కానీ వారి ఊరి నుంచి ఎంపికైన వారి పేర్లు చూసి ఆశ్చర్యపోయారు. జిల్లాలోని పలు మండలాల్లో దళిత బంధు కోసం పేర్లు ఇచ్చిన వారిలో ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, కాంట్రాక్టులో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యే అనుచరులు, వారికి దగ్గర మనుషులను ఎంపిక చేసారు. వారి పేర్లనే ఎమ్మెల్యే కలెక్టర్‌కి పంపారు. బీర్పూర్‌ ‌మండలంలోని కండ్లపల్లి గ్రామంలో 100కు పైగా దళిత కుటుంబాలు ఉన్నా ఒక్క గుంట భూమిలేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిని ఎంపిక చేయలేదు.

సరికదా 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమంగా పట్టా చేయించుకున్న ఓ మాజీ ప్రజాప్రతినిది భర్త పేరును దళిత బంధు పథకం ఎంపికకు ప్రతిపాదనలు పంపడం పట్ల గ్రామంలోని దళిత కుటుంబాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పేదరికంలో ఉన్నవారిని కాదని, వారిని ఎలా ఎంపిక చేస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్క జిల్లాలో జరుగుతున్న సంఘటనలు కావు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్‌ ‌మండలం గోదూరులో కూడా పేదలకు కాకుండా అనర్హులకు అవకాశం ఇస్తున్నారని అక్కడ కొందరు దళితులు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌ ‌రావు దిష్టి బొమ్మ దహనం చేసారు. గత కొన్ని రోజులుగా లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో పర్యటిస్తున్న నేతలు, అధికారులకు, పలువురు దళితుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేల జోక్యమే తప్పు అంటున్నారు పలువురు దళిత సంఘాల నాయకులు. రాజకీయ జోక్యం వల్ల అవినీతి పక్షపాతం కనిపిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పేర్ల ఎంపిక చేసినందుకు ప్రతిఫలంగా వొచ్చే సొమ్ములో ఎంతో కొంత స్థానిక పెద్దలకు సమర్పించుకునేలా ఒప్పందం చేసుకుంటున్నట్టు కూడా ఆరోపణలు అక్కడక్కడా జిల్లాలలో వినిపిస్తున్నాయి. దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారగా..వొచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ప్రతికూలతను చూపనుందేమోనని జంకుతున్నారు. ప్రస్తుతం దళితబంధు పథకం గ్రామాల్లోని దళిత వాడల్లో చిచ్చు రేపుతుండగా.. టీఆర్‌ఎస్‌ ‌పార్టీపై దళిత సామాజిక వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page