ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి
అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి
హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
మండువ రవీందర్రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్
స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి దేశం సిగ్గు పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాంతంత్య్రం వొచ్చిన వెంటనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు దళిత బంధు పథకాన్ని అమలు పరిచి ఉంటే ఇవ్వాళ దళితులు ఎంతో ఉన్నతిని సాధించేవారన్నారు. దశాబ్ధాలుగా అధికారాన్ని అనుభవించిన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో తమకు ఇంకా ఒక్క అవకాశాన్ని ఇవ్వమని అడుగుతున్నారంటూ, ఆరవై ఏండ్లుగా చేయలేని పనులను ఇప్పుడేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు ఏదో చెబుతుంటాయని, వారి మాటలు విని ఆగమాగం కావద్దని ప్రజలకు ఆయన హితోపదేశం చేశారు.ఎన్నికల నోటిఫికేషన్ వొచ్చిన తర్వాత మొదటిసారిగా ఆదివారం హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పేరున ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక శాసనసభ్యుడు వొడితల సతీష్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధిక సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుండి పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్న కెసిఆర్ నిర్ణయించిన సమయం ప్రకారం మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకు హెలికాఫ్టర్‌లో హుస్నాబాద్ చేరుకున్నారు. ఎన్నికల మొదటి ప్రచార కార్యక్రమాన్ని ఆయన హుస్నాబాద్నుండే ప్రారంభించారు. ఇక్కడి నుండి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇది మూడవసారి. 2014, 2018ల్లో ఇక్కడినుండే ఎన్నికల శంఖారావాన్ని బిఆర్ఎస్ పార్టీ పూరించి ఘన విజయం సాధించింది. అప్పుడు వరుసగా 68, 88 స్థానాలను గెలుచుకుని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ సాధిస్తామన్న నమ్మకాన్ని కెసిఆర్ వ్యక్తం చేశారు. గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగిందన్నది ప్రజల కండ్ల ముందే కనబడుతున్నదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్బంగా సి ఎం కేసీఆర్ మాట్లాడుతూ .. నికరెంటు, సాగునీరు, తాగునీరు లేని పరిస్థితినుండి ఇప్పుడు పుష్కలమైన జలకళతో పచ్చని పంటలు పండుతున్న పరిస్థితిని చూస్తున్నాం. నాడు వలసలు పోతున్న స్థితినుండి నేడు తిరిగి తమ గ్రామాలకు వచ్చి పంటలు పండిరచుకుంటున్న వారిని చూస్తున్నాం. ఎక్కడ చూసిన పచ్చని పైర్లతో ఇప్పుడు హుస్నాబాద్ ఎంతో కళకళలాడుతోంది.అంతేకాదు గతంతో పోలిస్తే తలసరి ఆదాయం పెరిగింది.తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఏర్పడిరది. ఫలితంగా తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో నెంబర్ ఒన్‌గా నిలిచింది. పారిశుద్ధ్యమైతేనేమీ, పంటల విషయంలోనైతేనేమీ, పచ్చదనంలో ఒక్కటేమిటి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది. ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానానికి ప్రపంచ వ్యాపార దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో 20 నుండి 25 లక్షల వరకు వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభ్యమైనాయి. కేంద్రం సహకారం లేకపోయినా ప్రముఖ ఆర్థిక వేత్తల సలహాలు, సంప్రదింపులు, సూచనలతో ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచగలిగామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని వారిని ఏదో రకంగా ఆదుకునేందుకు ఇప్పటికే అనేక పథకాలను రూపొందించి అమలుచేస్తున్నాం. ప్రజలు వాటిని అనుభవిస్తున్నారు. అయితే నేటి పరిస్థితులకు అనుగుణంగా వాటిలో కొంత మార్పు చేయడంతోపాటుగా, కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ఉదయం తెలంగాణ భవన్లో ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులకు బి ఫామ్‌లు ఇచ్చిన అనంతరం, ప్రకటించిన పార్టీ మానిఫెస్టోలోని కొన్ని అంశాలను ఆయన హుస్నాబాద్ సభలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా విఫులీకరించారు. ఆయిదు వేలవరకు పెన్షన్‌ను పెంచడం, రైతు బంధును 16వేలవరకు పెంచడం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాల వల్ల కలిగిన ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా హుస్నాబాద్ ఒకప్పుడు భూగర్భజలాలు లేక ఎంత దీనస్థితిలో ఉండేదన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ ఎన్నికలు కాగానే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి, తానే స్వయంగా వచ్చి నీళ్ళు విడుదల చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే శనిగరం ప్రధాన కాలువకట్ట మరమ్మతు పనులు, అందులో కాళేశ్వరం నీళ్ళను విడుదల చేసే విషయాలను చెప్పుకొచ్చారు. స్థానికులు చాలాకాలంగా కొరుతున్న సిద్దిపేట` ఎల్కతుర్తి జాతీయ రహదారి, ముల్కనూరు కొత్త బస్‌స్టాండ్, జూనియర్ కళాశాలతోపాటు కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయ అభివృద్ది తదితర పనులపైన తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటినుండి బిఆర్ఎస్ను అశీర్వదిస్తున్న ప్రజలు ఈసారి కూడా తమను ఆశీర్వదించాలని కోరారు. గత ఎన్నికల్లో 88 స్థానాలు రాగా ఈసారి 95 నుండి 105 స్థానాలు రావాలని, అందుకు కార్యకర్తలు, స్థానిక నాయకులు కష్టపడాలన్నారు. పార్టీ ప్రకటించిన మానిఫెస్టోను పూర్తిగా అర్థంచేసుకుని ప్రతీ గడపగడపకు వెళ్ళి వాటిని ప్రజలకు వివరించాలని కెసిఆర్ పార్టీ వర్గాలను కోరారు. అయితే ఈ సభ ద్వారా ఆయన కాంగ్రెస్, బిజెపిపైన విరుచుకు పడుతారనుకున్న వారికి కొంత నిరాశే ఎదురైంది. ఈ సభలో మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపి క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు, పార్టీ జనరల్ సెక్రెటరీ కేశవరావు, మున్సిపల్ చేర్మన్ ఆకుల రజిత, జడ్పి చేర్మెన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.