దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘కాళేశ్వరం’

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు
సబ్‌ కాంట్రాక్ట్‌ కాదు…మేడిగడ్డను ఎల్‌అండ్‌టినే నిర్మించింది
బీఆర్‌ఎస్‌ అక్రమాల్లో బీజేపీ కూడా భాగస్వామి
లేకుంటే లక్ష కోట్ల రుణాలు ఎలా వొచ్చాయి
ఎన్‌డిఎస్‌ఎ విచారణకు పూర్తి సహకారం
మేడిగడ్డ పరిస్థితిపై నిపుణులు, అధికారులతో చర్చించేందుకు నేడు దిల్లీకి
మీడియాతో ఇష్టాగోష్టిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 1 : ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ, ఇతర బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలను, తద్వారా కలిగిన నష్టాలకు సంబంధించి విజిలెన్స్‌ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. శుక్రవారం మంత్రి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిలో కాళేశ్వరంకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీని ఎల్‌అండ్‌టీ కంపెనీనే నిర్మించిందని, సబ్‌ కాంట్రాక్ట్‌ ద్వారా అమలు చేసిన దాఖలాలు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎల్‌ అండ్‌ టీకి రూ.400 కోట్ల పెండిరగ్‌ బిల్లులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఎ) ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టాలపై నెల రోజుల్లో నివేదిక వొస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ నివేదిక ఆధారంగా మరమ్మతులు చేపట్టి రైతులకు నీరు అందేలా చూడాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తుందని ఆయన తెలిపారు. అయితే విజిలెన్స్‌ విజిలెన్స్‌ నివేదిక అందిందని, చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడిరచారు. మేడిగడ్డ నష్టంపై విచారణకు ఎన్‌డిఎస్‌ఎ కమిటీ వేయడాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. బీఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ సూచనల కంటే కమిటీ సూచనల ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. మేడిగడ్డ పరిస్థితిపై నిపుణులు, అధికారులతో సమావేశమై చర్చించేందుకు నేడు శనివారం దిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరంపై పూర్తి సమాచారం, పత్రాలు ఇవ్వలేదని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు, నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ శ్రీరామ్‌ వెదిరె చేసిన ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ఇది అవాస్తవమని, వాస్తవంగా ఆ నివేదికలు లేవని, ఉదాహరణకు, గత ప్రభుత్వ హయాంలో లేని విధంగా భౌగోళిక వివరాలను అందించలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చే వరకు నాణ్యత నియంత్రణ నివేదికలు లేవని స్పష్టం చేశారు. తాము అధికారం చేపట్టిన తర్వాత తాము చేపట్టిన చర్యల ఆధారంగా సమాచారాన్ని అందించామని స్పష్టం చేశారు. థర్డ్‌పార్టీ రిపోర్టులు లేని కారణంగా ఇవ్వలేదని, నివేదికల్లోని సమస్యలను ఎత్తిచూపడంతో పరిస్థితి విజిలెన్స్‌ విచారణకు దారితీసిందన్నారు. ఎన్‌డిఎస్‌ఏ బృందాన్ని విచారణకు ఆహ్వానించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, ఎన్‌డిఎస్‌ఎ విచారణకు పూర్తి సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాళేశ్వరం డిజైన్‌, ప్లానింగ్‌, నిర్మాణంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పొరపాట్లు చేసిందని, రైతుల భవిష్యత్తును ఫణంగా పెట్టి కమీషన్ల కోసం ప్రాజెక్టును రాజీ పడుతున్నదని ఆరోపించారు. నీటిపారుదల శాఖలో రుణాల వల్ల జరిగిన నష్టానికి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆయన కుమారుడు కేటీఆర్‌ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చేసిన అక్రమాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భాగస్వామిగా ఉందన్నారు. కేంద్రం హామీతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్ల రుణాలు వొచ్చాయని, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య అవగాహన లేకుంటే రూ.లక్ష కోట్ల రుణాలు ఎలా వొచ్చాయంటూ ఉత్తమ్‌ ప్రశ్నించారు.

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కెఆర్‌ఎంబి)కి ప్రాజెక్టులను అప్పగించే అంశంపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ..నాగార్జున సాగర్‌పై తెలంగాణ ప్రభుత్వం తమ నియంత్రణను కలిగి ఉంటుందని, సైట్‌ నుండి సిఆర్‌పిఎఫ్‌ బలగాలను ఉపసంహరించుకోవాలని ఆయన అభ్యర్థించారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీకి, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికకు సంబంధం లేదని ఆయన ఉద్ఘాటించారు. తుమ్మడిహట్టి వద్ద 160 టీఎంసీల సామర్థ్యం ఉందని సీడబ్ల్యూసీ నివేదికలో స్పష్టం చేసినా నీరు లేదని బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ హయాంలోనే ప్రారంభించి 30 వేల ఎకరాల్లో కొత్త ఆయకట్టు సాధించేందుకు పనులు చేపట్టామని వెల్లడిరచారు. ప్రాణహిత కోసం వెదిరె శ్రీరాములు చెప్పిన రూ.11 వేల కోట్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.6 వేల కోట్లే ఖర్చు చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు క్రెడిట్‌ దక్కకుండా చేసేందుకు కేసీఆర్‌ రీడిజైన్‌ చేశారని ఆరోపించారు. శుక్రవారం మేడిగడ్డకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు నిర్మాణంలో నష్టాలను చూసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ వైఖరిని ఖండిరచారు. బీఆర్‌ఎస్‌ నాయకులను మేడిగడ్డకు తీసుకెళ్తున్న బస్సు టైరు మార్గమధ్యంలో పేలిందని, వారి కారు (బీఆర్‌ఎస్‌ గుర్తు) ఇప్పటికే పనికి రాకుండా పోయిందని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page