దేశంలోనే అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో హైదరాబాద్‌

  • ఉన్నత విద్యలో 7.50 శాతం పెరిగిన నమోదు
  • దూర విద్యలో 7 శాతం పెరుగుదల

2011 నుంచి ప్రతి ఏట కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ విడుదల చేస్తున్న సర్వేలో భాగంగా తాజాగా భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను విడుదల చేసిన ‘‘అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2020-21(ఆల్‌ ఇం‌డియా సర్వే ఆన్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ఏఐయస్‌హెచ్‌ఈ : 2020-21)’’ ‌నివేదిక పేర్కొంది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా కేంద్ర/రాష్ట్ర/ప్రభుత్వ/ప్రైవేట్‌ ‌రంగాల్లో విస్తరించిన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, విద్యార్థుల నమోదు, అధ్యాపకుల వివరాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, ఆర్థిక సమాచారాలు, ఉన్నత విద్యా సంస్థల సాంద్రత, స్థూల నమోదు నిష్పత్తి(జిఆర్‌ఈ), ‌విద్యార్థి అధ్యాపకుల నిష్పత్తి, ప్రతి విద్యార్థిపై సగటు విద్యా ఖర్చు, జెండర్‌ ‌పారిటీ ఇండెక్స్ ‌లాంటి పలు అంశాలతో కూడిన ఈ రిపోర్టు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఉన్నత విద్య సంస్థల వివరాలు :
2020-21 సర్వే వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,113 యూనివర్సిటీలు(2019-20లో 1,043 యూనివర్సిటీలు), 43,796 కళాశాలలు, 11,296 స్వతంత్ర ప్రతిపత్తిగల (స్టాండ్‌ ఎలోన్‌) ‌విద్యా సంస్థలు ఉన్నట్లు తెలుస్తున్నది. గత ఏడాదితో పోల్చితే 2020-21లో 70 యూనివర్సిటీలు, 1,453 కళాశాలలు పెరిగినట్లు వివరించారు. 2014-15 నుంచి 2020-21 వరకు 353 యూనివర్సిటీలు కొత్తగా వెలిసినట్లు తెలుస్తున్నది. అత్యధిక యూనివర్సిటీలు కలిగిన రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్‌(92), ‌యూపీ(84), గుజరాత్‌(83) ‌ముందు వరుసలో ఉన్నాయి. గత ఏడేళ్లలో ఏడాదికి సాలీనా నూతనంగా 59 యూనివర్సిటీలు స్థాపించబడ్డాయి. దేశంలోని 17 యూనివర్సిటీలు, 4,375 కళాశాలలు మహిళలకు మాత్రమే ఉన్నత విద్యను అందిస్తున్నాయి.

ప్రతి లక్ష యువ జనాభా(18-23 ఏండ్లు)కు సగటున 31 కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక కళాశాలలు కలిగిన 8 జిల్లాలో జాబితాలో బెంగుళూరు అర్బన్‌(1058 ‌కాలేజీలు), జైపూర్‌(671), ‌హైదరాబాద్‌(488), ‌పూనె(466), ప్రయాగ్‌రాజ్‌(374), ‌రంగారెడ్డి(345), భోపాల్‌(327), ‌నాగపూర్‌(318) ‌జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. అత్యధిక కళాశాలలు కలిగిన 10 రాష్ట్రాల్లో యూపీ, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్‌, ‌తమిళనాడు, యంపీ, ఏపీ, గుజరాత్‌, ‌తెలంగాణ, కేరళలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 43 శాతం యూనివర్సిటీలు, 61.4 శాతం కళాశాలలు గ్రామీణ భారతంలో విస్తరించి ఉన్నాయి. దేశంలోని 50 జిల్లాల్లోనే 32 శాతం వరకు కళాశాలలు పని చేస్తుండటం విశేషం.

ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు :
2019-20 ఏడాది ఉన్నత విద్యలో 3.85 కోట్ల విద్యార్థులు నమోదు కాగా 2020-21లో 4.14 కోట్లకు(7.5 శాతం 28.8 లక్షల పెరుగుదల) విద్యార్థుల నమోదు పెరగడం గమనించారు. 2014-15 నుంచి 2020-21 వరకు విద్యార్థుల సంఖ్య 72 లక్షలు(21 శాతం) పెరగడం గుర్తించారు. 2019-20లో ఉన్నత విద్యలో మహిళల నమోదు 1.88 కోట్లు ఉండగా 2020-21 వరకు 2.01 కోట్లకు పెరిగింది. 2014-15 నుంచి 2020-21 వరకు 28 శాతం మహిళల నమోదు పెరిగినట్లు తెలుస్తున్నది. 18-23 ఏండ్ల లోపు యువత ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (గ్రోస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ‌రేషియో, జీఈఆర్‌) 2019-20‌లో 25.6 ఉండగా, 2020-21లో 27.3కి చేరడం జరిగింది. 2019-20తో పోల్చితే 2020-21లో యస్టీ యువత జీఈఆర్‌ 1.9 ‌పెరగడం, జెండర్‌ ‌పారిటీ ఇండెక్స్(‌జీపిఐ-మహిళలు, పురుషుల నిష్పత్తి) 2017-18 కన్న 2020-21లో 1.05 పెరగడం గమనించారు.

ఉన్నత విద్యలో వెనుకబడిన(యస్సీ/యస్టీ/ఓబిసి) వర్గాల నమోదు :
ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడిన యస్సీ, యస్టీ, ఓబిసీ యువత ఉన్నత విద్యలో నమోదు పెరిగిందనే విషయం ఆనందదాయకం. 2019-20లో యస్సీ యువత నమోదు 56.57 లక్షలు ఉండగా 2020-21లో 58.95 లక్షలకు (2014-15లో 46.06 లక్షలు) చేరడం గమనించారు. 2014-15లో యస్టీ విద్యార్థులు 16.41 లక్షలు, 2019-20లో 21.6 లక్షలు, 2020-21లో 24.1 లక్షలు నమోదైనట్లు తెలుస్తున్నది. 2007-14 మధ్య యస్టీ యువత సాలీనా అదనపు నమోదు 75,000 ఉండగా 2014-21 మధ్య ప్రతి ఏట ఒక లక్ష పెరిగినట్లు విశ్లేషించారు. 2019-20లో ఓబిసీ వర్గాల యువత నమోదు 1.42 కోట్లు ఉండగా 2020-21లో 1.48 కోట్లకు చేరింది. 2014-15 నుంచి 2020-21 వరకు ఓబిసీ నమోదు 32 శాతం పెరిగినట్సు తెలుస్తున్నది. గత ఏడాదితో పోల్చితే 2020-21లో 2 లక్షల యస్సీలు, 3 లక్షల యస్టీలు, 6 లక్షల ఓబిసీల నమోదు ఎక్కువగా జరిగింది.

దూరవిద్యలో నమోదు :
దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు యువత సౌకర్య సౌలభ్యత కోసం దూర విద్య, ఆన్‌లైన్‌ ‌విద్యాబోధనలను ప్రవేశ పెట్టడంతో వాటి ప్రాధాన్యం దినదినం పెరుగుతున్నది. 2019-20లో దూరవిద్య విధానంతో పోల్చితో 2020-21లో 7 శాతం నమోదు పెరగడం గమనించారు. 2020-21లో దూరవిద్యను అభ్యసిస్తున్న యువత 45.71 లక్షలు, ఇందులో 20.9 లక్షల మహిళలు ఉన్నట్లు తేలింది.

రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో నమోదు :
దేశంంలో 6 రాష్ట్రాలు..యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, యంపీ, కర్నాటక, రాజస్థాన్‌లలో విద్యార్థుల నమోదు అత్యధికంగా ఉన్నట్లు తేల్చారు. 2020-21లో 79.06 శాతం విద్యార్థులు అండర్‌‌గ్రాడ్యుయేషన్‌(‌యూజీ) స్థాయిలో, 11.5 శాతం పీజీ స్థాయిలో నమోదు అయ్యారు. వీటిలో యూజీ స్థాయి కోర్సుల్లో 33.5 శాతం ఆర్టస్, 15.5 ‌శాతం సైన్స్, 13.5 ‌శాతం కామర్స్, 11.9 ‌శాతం ఇంజనీరింగ్‌/‌టెక్నాలజీ విభాగాల్లో యువత చేరినట్లు పేర్కొన్నారు. పిజీ స్థాయిలో 20.56 శాతం సామాజిక శాస్త్రం, 14.83 శాతం విద్యార్థులు సైన్స్ ‌కోర్సుల్లో చేరారు.

ఉన్నత విద్యలో మహిళల నమోదు 29.5 లక్షలు ఉండగా పురుషులు 26 లక్షలు మాత్రమే ఉండడం ఆశ్చర్యంగా తోస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 59 శాతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా 73.1 శాతం యువత నమోదు గమనించారు. దేశంలో ఉన్న 21.4 శాతం ప్రభుత్వ కళాశాలలు ద్వారా 35.5 శాతం విద్యార్థుల నమోదు గమనించారు. 2014-15 నుంచి 2021 వరకు డిఫెన్స్, ‌సంస్కృతం, బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్స్, ‌డిజైన్‌, ‌స్పోర్టస్ ‌లాంటి కోర్టులకు ప్రాధాన్యం పెరగడం సంతోషదాయకం. ఉన్నత విద్యా సంస్థల్లో 97 శాతం గ్రంథాలయాలు, 88 శాతం ప్రయోగశాలలు, 91 శాతం కంప్యూటర్‌ ‌సెంటర్లు, 61 శాతం స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్లు, 56 శాతం నేషనల్‌ ‌నాలెడ్జి నెట్‌వర్క్ ‌సదుపాయాలు ఉన్నాయి.

ఉన్నత విద్యలో అధ్యాపకుల లభ్యత :
దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో 15.51 లక్షల అధ్యాపకులు ఉండగా, ఇందులో 57.1 శాతం పురుషులు, 42.9 శాతం మహిళలు ఉన్నారు. 2014-15లో ప్రతి వంద మంది పురుష అధ్యాపకులకు 63 మంది మహిళ అధ్యాపకురాల్లు ఉండగా, 2020-21లో 75 మంది మహిళ కళాశాల టీచర్లు సేవలు (2019-20లో 100 పురుషులు : 74 మహిళలు) అందిస్తున్నట్లు తేలింది. గత ఏడాదితో పోల్చితో 2020-21లో 47,914 మంది కాలేజ్‌ ‌టీచర్లు పెరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page