‘‘ఇకనైనా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ జపాన్ని కాస్త తగ్గించుకొని, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయ రేటును పెంచే విధంగా చర్యలు చేపట్టి, వివిధ నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలపై పెంచిన ధరలను తగ్గించి ఆ భారాన్ని కార్పొరేట్ శక్తులపై, ఉన్నతవర్గాల ప్రజలపై పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు దఫాలుగా నిరాటంకంగా దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యుని ఆగ్రహానికి గురికాకతప్పదు.’’
‘‘దేశం కోసం.. ధర్మం కోసం..’’ ఈ ట్యాగ్ లైన్ బిజెపి ప్రభుత్వానికి బాగా కలిసొస్తోందనే చెప్పాలి. ఎందుకంటే, బిజెపి ప్రభుత్వం చేపట్టే ఎలాంటి ప్రజా వ్యతిరేక చర్యలనైనా ఈ ఒక్క ట్యాగ్ లైన్ తో ప్రజల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడకుండా చేస్తోంది. ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అని, నిరుపేదలతో గ్యాస్ కనెక్షన్స్ తీసుకునేలా చేసి.. ఆ వెంట వెంటనే యాభై, వందా వంట గ్యాస్ ధరపై పెంచుతూ ఇప్పటికి అక్షరాలా రూ. 1124/- చేసింది బిజెపి ప్రభుత్వం. దీనికి సామాన్య ప్రజల నుండి వ్యతిరేక జ్వాలలు ఎగసిపడకుండా తమ సోషల్ మీడియా సోల్జర్స్ తో మోడీ ఏది చేసినా మన ‘‘దేశం కోసం, ధర్మం కోసమే’’ అంటూ సమర్థింపులు చక్కర్లు కొట్టడంతో సామాన్యులు సైతం దేశంపై ఉన్న భక్తితో నోరు మూసుకోవాల్సి వస్తోంది. ఇక పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అలాగే, 2017 సంవత్సరంలో జీఎస్టీ విధింపులపై ప్రధాని మోదీ స్పందిస్తూ, మునుపటి ప్రభుత్వాలు పేదలను టాక్స్ ల పేరుతో దోచుకుతిన్నాయని తెలుపుతూ, తాము సామాన్య పేద ప్రజలు ఉపయోగించే నిత్యావసర సరుకులు, బియ్యం, పాలు, మజ్జిగ, పప్పులు, ఇతర ఆహారపదార్థాలపై జీఎస్టీ విధించబోమని స్పష్టం చేయడం జరిగింది. కానీ, ప్రస్తుతం తమ స్టేట్మెంట్ ను తామే చెత్తబుట్టలో వేస్తూ బియ్యం, పాలు, మజ్జిగ, పప్పులు, ఇతర ఆహారపదార్థాలపై 5 శాతం నుండి ఆపైన జీఎస్టీ విధిస్తున్నట్టు ప్రకటించడం, దానికి సైతం వారి వాట్సాప్, సోషల్ మీడియా సైనికుల చేత మోడీ ఏది చేసినా ‘‘దేశం కోసం ధర్మం కోసమే’’ అన్నట్టుగా మెసేజిలు చక్కర్లు కొట్టేలా చేయడం గమనించదగ్గ విషయం.
ఇక దేశంలో ప్రస్తుతం సగటు సామాన్యుని పరిస్థితి చూస్తుంటే, కడు దయనీయంగా కనిపిస్తోంది. కొరోనా కారణంగా రెండు సంవత్సరాలు ఉపాధి కోల్పోయి, బతుకు జీవుడా అంటూ చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని మోయలేక, ఇంటి అద్దెలు కట్టలేక, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, స్కూల్ ఫీజుల మోత మోయలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు సామాన్య ప్రజానీకం. డాలర్ తో రూపాయి మారకం విలువ నానాటికీ క్షీణిస్తున్న తరుణంలో నేటికీ సామాన్యుని సగటు జీతం నెలకు ఒక్కంటికి 8 వేల నుండి 15 వేల వరకు పనిని బట్టి ఉంటుండడం దురదృష్టకరం. అయితే కొరోనా మూలంగా ప్రతి దేశ ఆదాయం దెబ్బతినడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలంగా చమురు ధరలతోపాటు ఆ దేశాల నుండి దిగుమతి చేసుకొనే సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో దేశాన్ని ఆర్థికంగా నిలపడానికి ప్రధాని మోదీ చమురు ఉత్పత్తుల ధరలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలను పెంచడం విదితమే.. ఈ దశలో దేశాన్ని ఆర్థికంగా చితికిపోనివ్వకుండా చేపట్టిన మోదీ చర్యలపై సామాన్యులు సైతం నోరు మెదపకుండానే అప్పులపాలవుతూ తమ దేశాన్ని తామే రక్షించుకోవాలనే తలంపుతో అధిక ధరల ప్రభుత్వ నిర్ణయానికి సైతం సహకరించారు. దేశాన్ని ఆర్థికంగా చితికిపోనివ్వకుండా ప్రధాని మోదీ చేసే చర్యలు ఉత్పత్తులపై ధరలను పెంచుతూ పోవడమే తప్ప, దేశంలో నానాటికీ పడిపోతున్న సామాన్యుని తలసరి ఆదాయాన్ని పెంపొందించే దిశగా చర్యలు సఫలీకృతం కాలేదని ఆయన నిర్ణయాలను చూస్తుంటే అర్థమవుతుంది. కనీస నికర ఆదాయం లేనివారితో జీరో అకౌంట్లు తీయించి, ఆ తర్వాత కట్టెల పొయ్యితో వంటలు వండుకునేవారికి ఉజ్వల ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇప్పించి, ఆ గ్యాస్ ధరను అమాంతం పెంచేసి, సబ్సిడీ సొమ్మును వారి జీరో బాలన్స్ బ్యాంకు అకౌంట్ లో జమ చేయించి, ఆ సబ్సిడీ సొమ్ము వారి జీరో అకౌంట్ లో జమ కాగానే ఏవేవో నిబంధనల పేరుతో బ్యాంకర్లు ఆ సొమ్మును ఖాలీ చేయడం జరుగుతోందని పేదలు వాపోతున్నారు. ఈ చర్యను బిజెపి ప్రభుత్వం ఏవిధంగా సమర్థించుకుంటుంది?. ఇలాంటి చర్యలను ‘‘దేశం కోసం ధర్మం కోసం’’ అని సమర్థించుకోగలరా?
ఇక బిజెపి ప్రభుత్వ నిర్ణయాల మూలంగా పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఆర్ధిక భారానికి లోనై ఆకలి చావులు చావాల్సి వచ్చేలా పరిస్థితులు తయారవుతున్నాయంటే అభ్యంతరకరం కాదేమో. అలాగే, మరోవైపు మోదీ ప్రభుత్వ నిర్ణయాల మూలంగా అత్యధికంగా లాభపడుతున్నది పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన కార్పొరేట్ శక్తులే అనడంలో సందేహమే లేదు. అందులో మరీ ముఖ్యంగా అంబానీ, ఆదానీ కుటుంబాలే అత్యధికంగా లాభపడుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయాలు. ఇందుకు నిదర్శనంగా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన ధనికుల జాబితాలో మన గౌతమ్ అదానీ ఏకంగా బిల్ గేట్స్ నే దాటేసి ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నుడుగా నిలవడం గమనార్హం. కాంట్రాక్టు ల పేరుతో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే లక్షల కోట్ల నిధులను పరిశీలిస్తే అదానీ, అంబానీ సంపాదనలో దేశం సొత్తు ఎంత ఉందో ఇట్టే అర్థమవుతుంది. దేశ రక్షణకు వినియోగించే యుద్ధ సామాగ్రి తయారీ నుండి ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా ఆయా ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, ఆదానీలకే కట్టబెడుతున్నట్టు స్పష్టమైన ఆధారాలు బహిర్గతమవుతుండడం దీనికి నిదర్శనం. అలా కాంట్రాక్టు లను కట్టబెట్టడం నేరం కాకపోవచ్చు. కానీ, ప్రభుత్వం ద్వారా లక్షల కోట్ల ప్రజల సొమ్మును పొందిన కార్పొరేట్ శక్తులు, అధిక ధరలను భరించగలిగే శక్తి ఉన్న ఉన్నత వర్గాల ప్రజలపై మోదీ పెద్దగా ఆర్ధిక బరువు మోపింది లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపి ప్రభుత్వం మూలంగా కార్పొరేట్ శక్తులకు, ఉన్నతవర్గాలకు చెప్పుకోదగ్గట్టు ఎలాంటి ఉపద్రవం లేదనేది ప్రజల్లో మెదులుతున్న వాదన. మోదీ ప్రభుత్వ నిర్ణయాల మూలంగా కార్పొరేట్ శక్తులకు, సంపన్నవర్గాల ప్రజలు ‘‘దేశం కోసం ధర్మం కోసం’’ ఏ విధంగానూ నష్టపోవాల్సిన పని కూడా లేదు. ఎటొచ్చి కుటుంబాన్ని పోషించడానికి ముప్పూటలా కష్టించి నెలకు 8 నుండి 15 వేల రూపాయల మధ్య సంపాదించి బతుకు జీవుడా అంటూ అప్పోసప్పో చేసి కుటుంబాన్ని సాకే సామాన్యులే మోదీ ప్రభుత్వ నిర్ణయాల మూలంగా బాధించబడుతున్నారనడం సమంజసమే కదా..! దానికి దేశం ‘‘కోసం ధర్మం కోసం’’ అనే ట్యాగ్ లైన్ తో సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ దేశంలో దేశ భక్తి ఉండాల్సింది ఒక్క పేద, మధ్యతరగతి జీవులకేనా? అనే ప్రశ్నలు సామాన్యుల నుండి వెల్లువెత్తుతున్నాయి.
డాలర్ తో రూపాయి మారకం విలువ 70 రూపాయలు దాటేసి 80 దిశగా పరుగులు పెడుతున్నా.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినా.. కొరోనా లాంటి విపత్తులు వచ్చినా.. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా రక్షించడానికి దేశంలో ప్రధాని మోదీ కి వెనువెంటనే కనిపించేది నెలకు 8 నుండి 15 వేల రూపాయలు సంపాదించే పేద, మధ్యతరగతి జీవులేనా? ఏ అలాంటి విపత్తులతో దేశాన్ని ఆర్థికంగా రక్షించడానికి ప్రభుత్వం నుండి లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందే కార్పొరేట్ శక్తులకు లేదా.. వారికి దేశ భక్తి ఉండాల్సిన అవసరం లేదా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కొరోనా కాలంలో కార్పొరేట్ శక్తులు దేశానికి ఇచ్చిన విరాళాలు ఎంత? ఓ సినీ నటుడు చేసిన సాయం ఎంత? అనేది సామాన్యులు సైతం తెలిసిన విషయమే. ఓ సామాన్య సినీ నటుడు చేసిన సాయం సైతం ఒక్క రతన్ టాటా మినహా ఏ కార్పొరేట్ శక్తులు సాయం అందించ లేదనేది కాదనలేని వాస్తవం. అంటే ప్రభుత్వం చేత నేరుగా లబ్ది పొందుతున్నది కార్పొరేట్ శక్తులు.. ఆర్ధిక భారాలు మోసేది మాత్రం పేద, మధ్యతరగతి ప్రజలా? దానికి ‘‘దేశం కోసం, ధర్మం కోసం’’ అనే ట్యాగ్ లైన్ ఒకటి.
విపత్తులు, యుద్ధాల మూలంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే మార్గాలు అన్వేషించకుండా, సామాన్యుని తలసరి ఆదాయం పెంపొందించకుండా అధిక ధరలు, పన్నుల రూపంలో సామాన్యునిపైనే మోపితే సామాన్యుల ఆవేశాలు కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంది. అప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టినా ఫలితం ఉండదు. కాబట్టి ‘‘దేశం కోసం ధర్మం కోసం’’ అంటూ సామాన్యుణ్ణి వేధించే తమ ప్రతీ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయకుండా, ఇకనైనా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ జపాన్ని కాస్త తగ్గించుకొని, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయ రేటును పెంచే విధంగా చర్యలు చేపట్టి, వివిధ నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలపై పెంచిన ధరలను తగ్గించి ఆ భారాన్ని కార్పొరేట్ శక్తులపై, ఉన్నతవర్గాల ప్రజలపై పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు దఫాలుగా నిరాటంకంగా దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యుని ఆగ్రహానికి గురికాకతప్పదు.
శ్రీనివాస్ గుండోజు, జర్నలిస్ట్,
99851 88429