- కెసిఆర్ మద్దతు మనో ధైర్యం ఇచ్చింది
- కెసిఆర్, టిఆర్‌ఎస్‌లతో ప్రజాస్వామ్యం బలోపేతం
- గెలిస్తే రాష్ట్రపతిని అవుతా..ఓడితే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతా
- దేశానికి కెసిఆర్ లాంటి నాయకులు కావాలి
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. విద్వేషాన్ని పెంచి పోషించే ఆగడాలు జరుగుతుంటే ప్రధాని మౌనం వహించడం బాధాకరమన్నారు. హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలోనైనా ఆ అంశాల గురించి ప్రధాని మాట్లాడుతారో.. లేదో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో శనివారం తనకు మద్ధతుగా టిఆర్‌ఎస్ న్విహించిన సభలో ఆయన మాట్లాడుతూ…మోడీ ప్రతినెలా మన్ కీ బాత్ చెబుతారు.. కానీ ఒక్కసారి కూడా ప్రజల మన్‌కీ బాత్ వినరని తెలిపారు. గత 8 ఏళ్ల పాలనలో మోడీ ఒక్కసారి కూడా వి•డియా ముందుకు వొచ్చేందుకు ధైర్యం చేయలేదన్నారు. తాను ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఈడీ తన శాఖ పరిధిలోనే ఉండేదని, కానీ అప్పట్లో నాకు ఈడీని దుర్వినియోగం చేయాలనే దురాలోచన తనకు రానే రాలేదని, విపక్షాలపైకి దాన్ని ఉసిగొల్పాలనే పన్నాగాలు కూడా పన్నలేదని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. విపక్షాల నాయకులను అవమానించడమే లక్షంగా ఎన్డీయే సర్కారు ముందుకు సాగుతుందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఈసారి అసాధారణ పరిస్థితుల నడుమ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీకాదు.. రెండు సిద్దాంతపరమైన వైరుధ్యాల మధ్య జరుగుతున్న పోటీ. టీఆర్‌ఎస్ లాంటి పార్టీల సహకారంతో నేను ఈ పోటీలో నిలబడుతున్నాను. ఇటువంటి ప్రత్యేక సందర్భంలో ప్రత్యర్ధి దగ్గర ఎలాంటి అస్త్రశస్త్రాలున్నాయి. వాళ్ల బలం, బలగం ఏమిటనేది పట్టించుకోవాల్సిన అవసరంలేదు.
మన దగ్గరున్నన్ని వనరులతోనే శత్రువుపై పోరాటం చేయాల్సి ఉంటుంది’ అని ఆయన కామెంట్ చేశారు. తాను రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిస్తే.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కర్తవ్యంగా ముందుకుపోతానని, ఒకవేళ ఓడిపోతే రానున్న రోజుల్లో ఎన్డీయే కూటమిపై జరుగుతున్న పోరాటంలో భాగమవుతానని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకులు కావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి యావత్ దేశంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతిపదం వాస్తవమన్నారు. దేశంలో పీపుల్స్ మూమెంట్ మొదలైందన్నారు. టీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్ దిల్లీకి తనకు సంఘీభావం తెలపడం మరింత నైతిక బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో కొట్లాడారని యశ్వంత్ సిన్హా కామెంట్ చేశారు. దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్ లోక్‌సభలో గళం విప్పారని చెప్పారు. ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమవుతానని వెల్లడించారు.
టీఆర్‌ఎస్ పార్టీ తనకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘వి• ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్ సవివరంగా చెప్పారు. తెలంగాణలో ప్రజా చైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేము. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచిదికాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం?. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్ కోసం కాదు. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటమిది’ అని యశ్వంత్ సిన్హా అన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పారు.