దేశద్రోహ చట్టం కేసులు నిలిపివేయండి

  • తుది నిర్ణయం తీసుకునే వరకు చట్ట ప్రయోగం ఆపండి
  • సెక్షన్‌ 124ఏ ‌కింద కేసులు నమోదు కాకుండా రాష్ట్రాలను ఆదేశించండి
  • కేంద్రం అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం సూచన

న్యూ దిల్లీ, మే 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో…దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశించింది. సెక్షన్‌ 124ఏ ‌ప్రకారం కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అప్పటివరకు కేసులు నిలిపివేత సాధ్యాసాధ్యాలపై ఆరా తీసింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. దేశద్రోహం చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. అదే సమయంలో, దేశద్రోహం చట్టంపై పునఃపరిశీలన పక్రియను 3-4 నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు సూచించింది. దేశద్రోహం చట్టం కింద నమోదైన పెండింగ్‌ ‌కేసులపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని యోచిస్తుందనే విషయాన్ని వివరించాలని కోరింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బుధవారం స్పందన సమర్పించనున్నట్లు సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వెల్లడించారు. కేంద్రం తరపున విచారణకు హాజరైన ఆయన.. కేసుల నమోదు తాత్కాలికంగా నిలిపివేయడంపై చర్చిస్తామని చెప్పారు.

అనంతరం విచారణ బుధవారానికి వాయిదా పడింది. రాజద్రోహం చట్టంపై పునరాలోచన చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం సోమవారం తెలియజేసింది. అంతకుముందు అఫిడవిట్‌లో చట్టాన్ని సమర్థించిన కేంద్రం.. అనూహ్యంగా యూటర్న్ ‌తీసుకుంది. ఈ కేసులపై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలో.. కేంద్రం తన స్పందన తెలియజేసింది. పునఃపరిశీలన పక్రియ ముగిసేవరకు వ్యాజ్యాలపై విచారణ చేపట్టవద్దని అఫిడవిట్‌లో పేర్కొంది. ‘వలసపాలకుల నాటి రాజద్రోహం చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలను విస్తృత ధర్మాసనానికి నివేదించాలా? లేదా?’ అన్న అంశంపై ఈ నెల 10న వాదనలు వింటామని ఇటీవల వెల్లడించింది. దీనిపై గతవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఈ అంశంపై తన స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. దీనిపై సుప్రీమ్‌ ‌కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 124ఏ ‌యథేచ్ఛగా దుర్వినియోగమవుతుందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో సుప్రీమ్‌ ‌కోర్టు కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చింది.

ఈ వివాదాస్పద సెక్షన్‌ను సమీక్షించాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో, ఈ పక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం నమోదైన రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోందా లేదా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. బుధవారం నాటికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించేంత వరకు విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. చట్టాన్ని పునఃపరిశీలించేందుకు ఎంత కాలం పడుతుందని, దీని దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతాను సుప్రీమ్‌ ‌కోర్టు ప్రశ్నించింది. హనుమాన్‌ ‌చాలీసాను పఠించడం కూడా ఇటువంటి కేసులకు దారి తీస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు గుర్తు చేసింది. ఈ చట్టం దుర్వినియోగ మవుతుందని అఫిడవిట్లోనే చెప్తున్నారని పేర్కొంది. దీనిని ఎలా ఎదుర్కుంటారని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌ ‌రాణా, ఆమె భర్త రవి రాణా వంటివారిపై ఈ సెక్షన్‌ ‌ప్రకారం రాజద్రోహం కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే సెక్షన్‌ ‌ప్రకారం హిమాచల్‌ ‌ప్రదేశ్‌కు చెందిన పాత్రికేయుడు వినోద్‌ ‌దువాపై నమోదైన కేసును సుప్రీమ్‌ ‌కోర్టు రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page