- సాధ్యాసాధ్యాలపై చర్చించాలి
- నేరాలను అరికట్టడంలో ఆధునిక సాంకేతికత
- పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలి
- సూరజ్‌కుండ్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం
న్యూ దిల్లీ, అక్టోబర్ 28 : ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫామ్ సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోమ్ మంత్రులతో శుక్రవారం జరిగిన మేథోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. సహకారాత్మక సమాఖ్యతత్వానికి ఈ చింతన్ శిబిరం అసాధారణ ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా భారత దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు. ఇది రాజ్యాంగ భావన అని, ప్రజల పట్ల మనకు కల కర్తవ్యమని వివరించారు. ‘ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫామ్’ సాధ్యాసాధ్యాలపై చర్చించాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు.
నేరగాళ్ళు దేశ సరిహద్దుల ఆవలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. ఇటువంటి నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానంగా స్పందన రానంత వరకు, అన్ని రాష్ట్రాలు వీటిపై పోరాటానికి కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కునడం అసాధ్యమని చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేథోమథనం సదస్సు రెండు రోజులపాటు జరుగుతుంది. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని కల్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడటం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోమ్ మంత్రులు పాల్గొన్నారు. దేశం ముందు ఉన్న సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వ్యాప్తి, క్రాస్ బోర్డర్ టెర్రరిజం వంటి సవాళ్ళను ఎదుర్కునడం కోసం ఉమ్మడి వేదికను ఈ సదస్సు అందజేస్తుందని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రధాని మోడీ..ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీ లాండరింగ్ వంటి నేరాలు సరిహద్దులు దాటి జరుగుతున్నాయన్నారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామని తెలిపారు. 5జీతో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉందన్న ప్రధాని…క్రిమినల్స్ కంటే 10 అడుగులు ముందు ఉండాలని చెప్పారు. నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.