తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోష పడాల్సిన సందర్భం అన్నారు.
వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజు రోజుకూ గుణాత్మక అభివృద్ధిని నమోదుచేసుకుంటున్నదని సీఎం తెలిపారు. అందుకు కేంద్రంతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు, రివార్డులు ప్రశంసలే సాక్ష్యమన్నారు. పలు విధాలుగా పథకాలను అమలు చేస్తూ ఎనిమిదేండ్ల అనతి కాలంలో ఊహించనంత సంక్షేమం, అభివృద్ధిని సాధించామన్నారు. పరిశ్రమలు, మౌలికవసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతున్నదని తెలిపారు. అత్యంత పారదర్శకతతో కూడిన ఆర్థిక క్రమశిక్షణతో, ప్రజా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రజల మేలుకోసం ధృఢమైన రాజకీయ సంకల్పంతో తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో అమలు చేస్తున్న కార్యాచరణ, అంతకు మించిన ప్రజల సహకారం.. అన్నీ కలుపుకుని ఇంతటి ఘన విజయానికి బాటలు వేసినాయన్నారు. నూతన రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆటంకం కలిగిస్తున్నా, మొక్కవోని ధైర్యంతో బంగారి తెలంగాణ సాధన దిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని సీఎం పునరుద్ఘాటించారు.