దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌తెలంగాణ రాష్ట్రం

సంగారెడ్డి జిల్లా ఏర్పాటుతో జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది
చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన
రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర,జూన్‌ 10: ‌ప్రజలకు చేరువగా పాలనను అందిస్తూ, పారదర్శకంగా  లబ్ధి చేకూరుస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుపరిపాలనను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.
శనివారం తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా  కొండాపూర్‌ ‌మండలం మల్కాపూర్‌ ‌లోని గోకుల్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో  సుపరిపాలన దినోత్సవంను  నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ కెసిఆర్‌ ‌తడబాటు  లేని పరిపాలన అందిస్తున్నారని, నవ్వినచోటే నాప చేను పండినట్లు కెసిఆర్‌ ‌చూపించారన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హైదరాబాదులో కర్ఫ్యూ వస్తుందని, చీకటిమయం అవుతుందని, తెలంగాణ వారికి పరిపాలన రాదని అంటూ పలు కారణాలు చెప్పి ఆనాడు ఆంధ్ర పాలకులు అడ్డుకున్నారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటుతో వెలుగు, జిలుగులు నిండా యని, దేశానికే తెలంగాణ రోల్‌ ‌మోడల్‌ ‌గా మారిందన్నారు. నేడు తెలంగాణ ను కెసిఆర్‌ అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.

తొమ్మిది ఏళ్ల లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అం‌దించిన సుపరిపాలనే అందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారే ఈరోజు పాశ్చాత్తాప పడుతున్నట్లు ఇటీవల తెలుసుకున్నానని మంత్రి అన్నారు. సంగారెడ్డి జిల్లా ను ఏర్పాటు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని, చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజల ముంగిట్లోకి పాలన చేరువైందన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలో కొత్తగా మూడు రెవిన్యూ డివిజన్లు, 9 మండలాలు, 4 మున్సిపాలిటీలు,190 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు చేరువ చేశామన్నారు. 500 జనాభా దాటిన జిల్లాలోని 81 గిరిజన తండాలను ,గూడాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. ఏ సంఘం లేని వారు ఎవరంటే రైతులు మాత్రమేనని, అలాంటి రైతుల కోసం రాష్ట్రంలో 6100 రైతు వేదికలు కట్టి రైతులను సంఘటితం చేశామన్నారు. జిల్లాలో 116 రైతు వేదికలను ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు నీటికి కట కటపడిన రాష్ట్రం జల సిరులతో, పాడి పంటలతో తులతూగుతుందన్నారు. రాష్ట్రం గొప్పతనం తెలియాలంటే సర్పంచ్‌ ‌లు అందరిని పక్కనే గల మహారాష్ట్రకు లేదా గుజరాత్‌ ‌కు తీసుకువెళ్లి వారి పరిపాలనను, వారి అభివృద్ధి ఎలా ఉందో చూపించాలని కలెక్టరుకు సూచించారు. అప్పుడే తెలంగాణది ఎంత గొప్ప మోడల్‌ అన్నది తెలుస్తుందన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలని అన్నారు. ధరణిని పకడ్బందీగా రూపొందించిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. ప్రజలకు నయా పైసా ఖర్చు లేకుండా 65 లక్షల మంది రైతులకు 60 వేల కోట్ల రూపాయలు రైతుబంధు జమ చేశామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.ఆన్లైన్‌ ‌డిజిటల్‌ ‌ట్రాన్సాక్షన్లో తెలంగాణ టాప్‌ ‌లో ఉందన్నారు. కెసిఆర్‌ ‌మాటలు తక్కువ ,చేతులు ఎక్కువని, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అది చేస్తున్నారన్నారు. దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులే నన్నారు. దివ్యాంగులకు 3016 నుండి 4016 రూపాయల పెన్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి రావలసిన లక్ష 30 వేల కోట్ల నిధులు కేంద్రం ఆపుతుందన్నారు. గతంలో లీడర్లు, పైరవీకారులు జేబుల్లోకి వెళ్లే డబ్బులు ఈరోజు ఖజానాకు వస్తున్నాయన్నారు. సంపద పెంచి, పేదలకు పంచేలా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలో కి పోతున్నాయని మంత్రి అన్నారు.

ఇతర రాష్ట్రాలు మన అభివృద్ధి గురించి తెలుసుకొని మన దగ్గర నేర్చుకుపోతున్నాయన్నారు. ఏ సంక్షేమ పథకం అయిన కుల, మత, పార్టీలకు అతీతంగా న్యాయంగా, ధర్మంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. తెలంగాణ పారిశ్రామిక స్థాపన సరళీకృత పద్ధతులతో దేశ  విదేశాల నుండి తెలంగాణకు పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే కెసిఆర్‌ ‌పాలన అయితేనే అది సాధ్యమని వారికి అండగా ఉండాలని మంత్రి కోరారు. అనంతరం ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన జహీరాబాద్‌ ‌మండలం కొత్తూరు బి, మనూరు మండలం కమలాపూర్‌, ‌సురాశిపేట మండలం ఇశ్రీతాబాద్‌, అమీన్పూర్‌ ‌మండలం వడక్‌ ‌పల్లి, మునిపల్లి మండలం పెద్దలోని, హత్నూర మండలం మధుర గ్రామపంచాయతీల సర్పంచులను మంత్రి శాలువాలతో సన్మానించి, జ్ఞాపికను, సర్టిఫికెట్లను అందజేశారు. అదేవిధంగా ఉత్తమ మండలంగా ఎంపికైన మండల ప్రజా పరిషత్‌ ‌లు మొగుడంపల్లి, పటాన్చెరు మండలాల ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు సన్మానించారు. ఉత్తమ మున్సిపాలిటీలుగా నారాయణఖేడ్‌, ‌తెల్లాపూర్‌ ‌మున్సిపాలిటీల మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌కమిషనర్‌ ‌లకు సన్మానించారు.అంతకుముందు దివ్యాంగుల పింఛన్‌ ‌పెంపు పై హర్షం వ్యక్తం చేస్తూ దివ్యాంగులు మంత్రితో కలిసి కేసీఆర్‌ ‌చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సంగారెడ్డి జిల్లా సుపరిపాలన దినోత్సవం కు సంబంధించిన కరపత్రాన్ని  మంత్రి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్‌ ‌మంజుశ్రీ జైపాల్‌ ‌రెడ్డి, శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్‌, ‌భూపాల్‌ ‌రెడ్డి, మాణిక్‌ ‌రావు, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ‌చింతా ప్రభాకర్‌, ‌డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివకుమార్‌, ‌డిసిసిబి చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌, ‌వైస్‌ ‌చైర్‌ ‌పర్సన్‌, ‌జడ్పీ వైస్‌ ‌చైర్పర్సన్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌శరత్‌, ‌జిల్లా ఎస్పీ రమణ కుమార్‌, అదనపు కలెక్టర్‌ ‌వీరారెడ్డి, జిల్లా అధికారులు ,ఉద్యోగులు, పోలీస్‌ ‌రెవెన్యూ అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page