- క్విట్ ఇండియా నినాద సృష్టి కర్త యూసుఫ్ మెహరల్లీ
- ఆగస్టు 9… ‘క్విట్ ఇండియా డే’
భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన ఘట్టం, అనాడు దేశాన్ని ఊపేసిన నినాద మైన ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని సూచించింది నాటి ముంబై మేయర్ మెహరల్లీ. సోషలిస్టు నాయకుడైన ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎనిమిది సార్లు జైలుకెళ్లారు. ఉద్యమం నాటికి ముంబై మేయర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల యూసుఫ్ మెహరల్లీ. మేయర్ పదవికి ఎన్నికైన తొలి సోషలిస్ట్ మెహరల్లీ. ఆయన స్వాతంత్య్రోద్యమానికి ఊపునిచ్చిన ‘క్విట్ ఇండియా’ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో కే. గోపాలస్వామి రాసిన ‘గాంధీ అండ్ బాంబే’ పుస్తకంలో వివరించారు. దేశ స్వాతంత్య్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి పనికి వచ్చే మంచి నినాదాలను సూచించాల్సిందిగా వారిని కోరారు. అందుకు ‘గెటవుట్’ అని ఎవరో సూచించారు. అదంత మర్యాదగ లేదని గాంధీ తిరస్కరించారు. ‘రిట్రీట్ ఆర్ విత్ డ్రా’ అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించారు. అక్కడే ఉన్న యూసుఫ్ మెహరల్లీ ‘క్విట్ ఇండియా’ పదాన్ని సూచించారు. బాగుందని గాంధీజీ మెచ్చుకున్న వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు.
1942 ఆగస్టు 8న ముంబయిలోని గొవాలియా బ్యాంక్ మైదానంలో జరిగిన సభలో ఆయన ఈ నినాదాన్ని ఇచ్చారు. ‘క్విట్ ఇండియా’ నినాదం భారత స్వాతంత్ర్య సమరాన్ని కొత్తపుంతలు తొక్కించింది. గాంధీజీ పిలుపు మేరకు ఆగస్టు 9 నుంచి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం దేశవ్యాప్తంగా ఆరంభమైంది.గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్ వచ్చాక దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య ఉద్యమం పలు రూపాల్లో విస్తరించింది. స్వపరిపాలన హోదా ఇవ్వకుంటే సత్యాగ్రహం ఉధృతం చేస్తామన్న తీర్మానాలు, రాజకీయ అసంతృప్తి, లాహోర్లో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో సంపూర్ణ స్వతంత్ర సాధన పిలుపునకు క్రమానుగత హేతువులయ్యాయి. 1930 జనవరి 26న దేశం మొత్తం ‘సంపూర్ణ స్వాతంత్ర్య దినంగా పాటించాలని నిర్ణయం జరిగింది. అనంతర పరిణామాలతో దశాబ్దకాలం పాటు కొనసాగిన వివిధ ఆందోళనలు సత్యాగ్రహాలు, నిరసనలు, బాంబు దాడులు, విధ్వంసం క్రమంలో- ‘క్విట్ ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని గాంధీజీ ఇచ్చారు. క్విట్ ఇండియా’ నినాదాన్ని సూచించింది.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించడానికి ఒక నెలకు ముందుగానే 1942 జూలై 14వ తేదీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పూర్తి స్వాతంత్ర్యం లభించాలని తీర్మానం చేసింది. 1942 ఆగస్టు ఎనిమిదో తేదీ ముంబైలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. 1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ “డూ ఆర్ డై” కి పిలుపునిచ్చాడు. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్ళలో చాలా మంది జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు) లు బ్రిటిషు వారికి మద్దతుగా నిలిచాయి.
ఉద్యమంలో పాల్గొన్న గాంధి, పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వంటి పలువురు నాయకులను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి అహమ్మద్ నగర్‌లోని పోర్ట్ కారాగారంలో బంధించారు. ఆగస్టు తొమ్మిదో తేదీ ఉదయం ముంబై బహిరంగ సమావేశానికి మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించే నేతలు లేకపోవడంతో, యువ వీరవనిత అరుణా ఆసఫ్ అలీ ఈ కాంగ్రెస్ బహిరంగ సభకు నాయకత్వం వహించి, జెండా ఆవిష్కరణ గావించారు.1942 ఆగస్టు 9 నుండి 1942 సెప్టెంబరు 21 వరకు, క్విట్ ఇండియా ఉద్యమంలో స్థానిక నిర్ణయాల మేరకు 550 పోస్టాఫీసులు, 250 రైల్వే స్టేషన్లపై దాడి చేసారు. అనేక రైలు మార్గాలను దెబ్బతీసారు. 70 పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేసారు. 85 ఇతర ప్రభుత్వ భవనాలను తగలబెట్టడమో, ధ్వంసం చెయ్యడమో చేసారు. టెలిగ్రాఫ్ వైర్లు కత్తిరించిన సందర్భాలు సుమారు 2,500 ఉన్నాయి.
బీహార్‌లో అత్యధిక స్థాయిలో హింస జరిగింది. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం 57 బెటాలియన్ బ్రిటిషు దళాలను మోహరించింది. ఇలాంటి సంఘటనలకు ఆందోళన చెందిన బ్రిటిషు వారు వెంటనే స్పందించి గాంధీని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (జాతీయ నాయకత్వం) సభ్యులందరినీ జైలులో పెట్టగా, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని బ్రిటిషు ప్రభుత్వం నిషేధించింది. గాంధీ అహింసాయుత సిద్దాంతాలకు వ్యతిరేకంగా 1943 వ సంవత్సరానికి క్విట్-ఇండియా ఉధ్యమం నీరసించింది. అయితే క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 రూపాయి స్మారక నాణెం జారీ చేసింది.
ఏది ఏమైనప్పటికీ కోట్లాది ప్రజలు, చరిత్రలో అపూర్వమైన విధంగా, ఒక త్రాటిపై నిలచి, ఏకకంఠంతో స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యమని ప్రకటించడమే స్వాతంత్ర్య సాధనకు ముఖ్యకారణమని విస్మరించరాదు.
రామకిష్టయ్య సంగనభట్ల…
9440595494