నానీలో ఒదిగిన సముద్రం…

విశాఖ సముద్రమంటే అమితమైన ఇష్టంతో అలల ప్రవాహం వంటి నానీలను శివకృష్ణ  కొక్కుల  రాశారు. సముద్రాన్ని చూసినా, ఊహించినా ఎన్నెన్నో భావాలు మనసుకు తట్టాయన్న కవి తన సంపుటికి సముద్ర నానీలు అని పేరు పెట్టారు. శివకృష్ణ  సముద్రతృష్ణ పేరుతో నానీల నాన్న ఆచార్య ఎన్‌ గోపి పుస్తకానికి రాసిన ముందు మాటలో అలలలో సౌందర్య దృష్టిని, జీవన తాత్వికతన,  మొత్తంగా సాగర హృదయాన్ని కవి దర్శించారని రాశారు. నిజమే సముద్రంతో  ఏర్పడిన చెప్పలేనంత  ఆత్మీయత కవి గుండెలయల్లో ఉపశృతులుగా  మిగిలి నానీల రూపాన్ని పొందాయి.

నాకూ సముద్రానికీ /  రోజూ పోటీ/  సూర్యోదయాన్ని /  ముందెవరు చూస్తారని అన్న నానీ కవిలోని  సాగరాత్మను ఆవిష్కరించింది. ఓసారి తీరానికి / మళ్ళీ సంద్రానికి/  అయోమయంలో/  ఆలోచన అల అని అలలోని కల్లోలిత అంతరంగాన్ని విశ్లేషించారు. అలల  పాదాలకు ఉన్న కనపడని సంకెళ్లే వాటిని తీరం దాటకుండా చేస్తున్నాయని అలకు సాగరానికి ఉన్న విడదీయరాని అనుబంధాన్ని విడమర్చి చెప్పారు. సముద్రంలో వచ్చి పోయే అల సాగరాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడే పుస్తకంలోని పేజీ వంటిదని తెలిపారు. సాగర ఘోషలో దాని గుండె చప్పుడును వినమన్నారు. నదులన్నీ కలవడానికి తోడ్పడే వేదిక మహా సముద్రం అని చెప్పారు. తీరాన ఉన్న శిల సముద్రం అనే పుస్తకంలో ఎన్ని పేజీలున్నాయో అని తీర్పునిచ్చే  న్యాయమూర్తి వంటిదని అన్నారు. నాన్న భుజాలపై ఆడే పిల్లలతో సాగర తీరంలోని అలల  కేరింతలను ప్రతీకాత్మకంగా పోల్చి చూపారు.

తనివారా ఇసుక రేణువులను ఎన్నోసార్లు తడిపిన అలకు వాటి లెక్క మొత్తంగా తెలుసునని చెప్పారు. గుండెపై చెయ్యేస్తే/  ఏదో వింత ఘోష/  నాలోనూ ఒక సముద్రం దాగుంది అన్న నానీ హృదయ సముద్రానికి ప్రతిబింబమైంది. అదుపులో ఉండని అలల గుండెలను చూసి నిండు జాబిలి పరవశం చెందిందన్న మధుర భావనతో ఒక నానీని మెరిపించారు. నదుల్ని అమృతంగా తాగే సముద్రానికి మరణమెక్కడిది అన్నారు. మనో సంద్రంలో / అల్పపీడనం/  భావోద్వేగాలు /  కుండపోతగా కురుస్తున్నాయి అన్న నానీ నిశితంగా ఆలోచింపజేస్తుంది. సముద్రం చెంత నిలబడితే మరో ప్రపంచ మొకటి పిలుస్తుందన్నారు. తీరాన్ని కోసే అల వల్ల ఒక్కోసారి విధ్వంసానికి కారణమయ్యే సునామీ ఆవిర్భవిస్తుందని హెచ్చరిక  చేశారు.

పాదాలను తాకే సంద్రపు అల చల్ల దనమే గొప్ప దీవెన అని చెప్పారు. నడి సంద్రంలో ఒంటరి ద్వీపం అలల జ్ఞాపకాలతో కలకాలం బతికేస్తుందన్న కవి ఊహాత్మకత ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంద్రంపై నుండి పోయే పక్షుల గుంపు అలకు కోరస్‌ పాడుతున్నాయని, ఆకాశం అమ్మై సముద్రానికి నిశ్శబ్దంగా జోల పాడుతుందని, చీకటిని జాబిలి జేబులో వేస్కొని మాయమైతే పొద్దు వెలిగిందన్న భావనలతో ఉన్న నానీలు ఆలోచనకు పదును పెడతాయి. ఆకాశం తొడిగిన /  చుక్కల చొక్కాకి/  ఒకటే గుండీ/  నిండు జాబిలి అన్న నానీతో పాటు తడిసిన /  నింగి కురులను /  తుడిచే ఏడు రంగుల టవల్‌ /  హరివిల్లు అన్న మరో నానీ, రాత్రి /  గోరింటాకు పెట్టుకుందేమో/  సందె వేళకు /  ఆకాశం ఎర్రగా పండిరది అన్న ఇంకో నానీ కవి ఊహ శాలితకు నిదర్శనంగా నిలిచాయి.

వాక్యం అణువంత/  అణుబాంబులా పేలే భావం/ అదే /  నానీ నైజం అని నానీ అంటే ఏమిటో నిర్వచించారు. అహం నిప్పంటించకుండానే దహిస్తుంది జాగ్రత్త అని ఒక నానీలో  హెచ్చరించారు. అలల కొంగు, జాబిలి ముఖం, చినుకుల ముచ్చట్లు, ఆకలితో చెత్తబుట్ట, కొండ కొలతలు, జ్ఞాపకాల పొట్లం, నాన్న భావోద్వేగాల హరివిల్లు, చంద్రుడి సెలవు చీటీ, జాబిలి దిండు, కవిత్వాకర్షణ శక్తి, పూల లైబ్రరీ, పుస్తకాల సముద్రం, మబ్బుల కొమ్మ, చుక్కల విత్తులు, నక్షత్రాల వర్షం, పూల భాష, అలల కౌగిలి, ప్రశాంతమైన ఎరుపు, ఎర్ర శాలువా, సూర్యుడి ప్రభాత గీతం, భావాల సడి, కొండల కౌగిలి, రైలు పట్టాలంత కూత, తీరమొక రఫ్‌బుక్‌  వంటి ప్రత్యేక పద ప్రయోగాలున్న నానీలు ఈ సంపుటిలో ఉన్నాయి. నవ్వు /  ఓ గొప్ప శిల్పి / తన బుగ్గపై సొట్టలు / అందంగా చెక్కుతూ అన్న నానీ కవిలోని లోతైన భావుకతకు అద్దం పట్టింది.

 

మేము రెండు /  భిన్నతీరాలం /  మా మధ్య /  ప్రేమ ప్రవహిస్తూనే ఉంటది అన్న నానీ అవ్యాజానురాగాన్ని చూపింది. వెలుగు, చీకటికి ఆశ్రయమిచ్చే ఆకాశానిది గొన్న మనస్సు అన్నారు. శాంతి పోరాటం/ ఒక అబద్ధం/  నెత్తురు పారని/  యుద్ధాల చరిత్రలో లేదు అన్న నానీ యుద్ధాల  చరిత్రను తవ్వి పోసింది. జీవితం సాండ్విచ్‌ లాంటిదన్నారు. కాగితంపై /  కవిత ఎపుడూ నీలమే/  ఆకాశమంత /  భావానికది ప్రతీక అన్న నానీ కవితా విశాలతను చాటింది. మేఘాలను /  ఎవరు పొగిడారంతగా /  అంతెత్తున వెళ్లి కూర్చున్నాయి అన్న నానీ, సముద్రం/ నదుల్ని అప్పు తీసుకుంది/  వర్షాన్ని/  వడ్డీగా కట్టేస్తూ అన్న మరో నానీ కవిలోని సృజన శీలతను పట్టి  చూపాయి. మా ఇద్దరి / అభిరుచులొక్కటే /  సవర్ణ దీర్ఘ సంధి/   సరిగ్గా కుదిరింది అన్న నానీ, పాల పుంతను /  చుట్టేయడం నాసాకవ్వలేదు/  కవి ఊహల్లో /  సాధ్యమైంది అన్న మరో నానీ ఆలోచింపజేస్తాయి. ఆత్మహత్యను అసంపూర్ణ  పుస్తకంతో,   పిల్లలను గాలిపటాలతో  పోల్చారు.

కుంకుమ డబ్బా/  ఒలికిపోయింది /  సందె వేళ ఆకాశం/  బొట్టెట్టుకుంటుంటే అన్న నానీ ప్రకృతి ప్రత్యేకతను విశదీకరించింది. నానీల సంద్రంలో /  నాలుగే అలలు /  భావాల లోతు మాత్రం /  అంతులేనిది అని నానీలలోని గొప్పతనాన్ని తెలిపారు.  జేబుకు జెండాను /  కుట్టింది పిన్నీస్‌ /  గుండెల్లో /  దేశభక్తి నింపుతూ అని గుండె నిండిన దేశాభిమానాన్ని చాటారు. సుగంధాన్ని తన వద్దకు తీసుకొచ్చిన గాలికి రుణపడి ఉన్నానని అన్నారు. కొండలు నదిని /  దారి తప్పనివ్వవు/  జీవితంలో /  మంచి మిత్రులూ అంతే అన్న నానీ స్నేహమేరా జీవితమని తేల్చి చెప్పింది. అలెప్పుడూ /  శృతి తప్పదు /  అందుకే సాగర సంగీతం /  అంత మధురం అన్నారు.

 

పూటకో రంగు మారుస్తుంది /  ఆకాశానికి/   ఎన్ని భావ చిత్రాలో అన్న నానీ, రైలుకెంత /  మతిమరుపో /  వెళ్లే ప్రతిసారీ పట్టాలే /  దారి చూపించాలి అన్న మరో నానీ వస్తు వైవిధ్యాన్ని ప్రదర్శించాయి. అలల కేతనం/   రెపరెపలాడుతుంది /  తీరంపై సంద్రం గెలుపొందింది అన్న నానీ సముద్రపు  విజయోత్సాహాన్ని తెలిపాయి. పుస్తక పరిమళం ఎన్నటికీ వాడిపోదన్నారు. చెట్లు కూడా/  ఉగాది జరుపుకుంటున్నాయి /  మనలానే /  కొత్త బట్టలేస్కుంటూ అన్న నానీ వసంతా గమనానికి సూచిక అయ్యాయి. కనులు పారేసుకునే కలల్ని ఉదయం రహస్యంగా దాస్తోందన్నారు. తీరం హాయిగా /  బజ్జుంటుంది /  సముద్రం అలలతో /  జోకొడుతుంటే అన్న చీవరి  నానీ కూడా సముద్రానికి, తీరానికి, అలలకు మధ్య ఉన్న అన్యోన్యానుబంధాన్ని చక్కగా చూపింది. దేశీయత, మానవత, కవితాత్మకత నిండిన ప్రతిభా సమన్విత  సృజనావిష్కరణ ఈ నానీలలో  జరిగింది.
-డా.తిరునగరి శ్రీనివాస్‌
  9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page