నామినేషన్‌ రోజే కూనంనేనికి భారీ షాక్‌

సిపిఐ కౌన్సిలర్ల రాజీ ‘నామాలు’
కెటిఆర్‌ సమక్షంలో కారెక్కిన కౌన్సిలర్లు

కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ అధినేత సమక్షంలో కారు ఎక్కుతారు అనే ప్రజాతంత్ర కథనం సత్య రూపం దాల్చింది. కాకపోతే వేదిక మారింది. హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్‌ సమక్షంలో బుధవారం ఐదుగురు సిపిఐ కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కెసిఆర్‌ స్వయంగా కారు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ సిద్ధాంతాలు, కెసిఆర్‌ ఆశయాలు నచ్చి పార్టీలోకి వచ్చే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. వనమా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ రథసారధిగా తెలంగాణ జాతిపితగా కెసిఆర్‌ నాయకత్వంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యావత్‌ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు నచ్చి బిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజకీయాలకు అతీతంగా నిరంతరం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు నచ్చే వారి నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గెలుపు కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తామని అన్నారు. వనమా సారధ్యంలో వార్డుల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు.

ఇదిలా ఉండగాకొత్తగూడెం వేధికగా నిర్వహిస్తున్న ప్రజా ఆశిర్వాద సభలో సిఎం కెసిఆర్‌ సమక్షంలో సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ తీర్థం పూచ్చు కోవల్సి ఉంది. కానీ కాంగ్రెస్‌, సిపిఐ పొత్తులో భాగంగా కొత్తగూడె సీటు కూనంనేనికి ఖరారు అయినట్లు సమాచారం ఉండటంతో ఆయన నామినేషన్‌ రోజు పార్టీలో చేర్చుకుంటామని బిఆర్‌ఎస్‌ పెద్దలు హామీ ఇవ్వడంతో ఈ వ్యవహారం కాస్తా పోస్ట్‌ పోన్‌ అయ్యింది. అయితే మున్సిపాల్టీలో సిపిఐ పార్టీలో మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఐదుగురు పార్టీ మారారు. బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి, కౌన్సిలర్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వైశ్రీనివాసరెడ్డి , ఒకటో వార్డు కౌన్సిలర్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బోయిన విజయ్‌ కుమార్‌, 18 వ వార్డు కౌన్సిలర్‌ పి సత్యనారాయణ చారి, 16 వ వార్డు కౌన్సిలర్‌ మాచర్ల రాజకుమారి,30 వ వార్డు కౌన్సిలర్‌ నేరేళ్ల సమైక్య సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్‌ మాచర్ల శ్రీనివాస్‌, ఏఐటియుసి పట్టణ కన్వీనర్‌ పిడుగు శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

నామినేష్‌ రోజే కూనంనేనికి బిగ్‌ షాక్‌
ఎన్నికల కాంగ్రెస్‌, సిపిఐ పొత్తుల్లో బాగంగా కొత్తగూడెం సీటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కేటాయించారు. కౌన్సిలర్లు పార్టీ మార్పుతో సిపిఐ పార్టీలో గందరగోళం నేలకొంది. పట్టుబట్టి పంతం నెగ్గించుకుని నామినేషన్‌ వేసిన రోజే ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న కూనంనేనికి సొంత పార్టీ కౌన్సిలర్లు పార్టీ మారి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. సిపిఐకి రాజీ ‘నామాల’పై పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page