నాయకత్వ మార్పును కోరుకుంటున్న కాంగ్రెస్‌

‌వృద్ధ కాంగ్రెస్‌ ‌పార్టీ మరి కొద్ది సంవత్సరాల్లో పూర్తిగా కనుమరుగు అవుతుందా ? ఇదే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చగా మారింది. దశాబ్ధాల కాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారడమే ఈ అనుమానానికి కారణమవుతున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నిక) ఫలితాలను పరిశీలించినప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ తన పట్టును కోల్పోతున్న పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలానే కొనసాగితే దేశంలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందంటున్నారు విశ్లేషకులు. ఇలా రోజురోజుకు పార్టీ దిగజారి పోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించిన పెద్దల మాటను కాదని మూర్ఖంగా ముందుకు పోవడం కూడా ఆ పార్టీకి గొడ్డలిపెట్టవుతుందన్నదంటున్నారు. జీవితాంతం ఆ పార్టీలో ఉంటూ, పార్టీ ఔన్నత్యానికి కృషిచేసిన వారిని పార్టీ పట్టించుకోకపోవడం వల్లే పార్టీ ఇలాంటి కష్టకాలాన్ని ఎద్కుర్కునాల్సి వొస్తున్నదంటున్నారు. చాలా సౌమ్యులుగా, ఏ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురైనా అక్కడికి వెళ్ళి సమస్యను సామరస్యంగా పరిష్కరించగల నేర్పరులను పార్టీ దూరం చేసుకుంటున్నదన్న అపవాదు ఉంది. ఇందిరా గాంధీ కాలం నుండి పార్టీలో ఎంతో నమ్మకమైన వ్యక్తులుగా చెలామణి అయిన గులాంనబీ ఆజాద్‌ ‌లాంటి వారు కూడా ఇవ్వాళ పార్టీ పతనమవుతున్న తీరును చూసి ఆవేదనన చెందుతున్నారు. పార్టీని పటిష్టపర్చేందుకు అలాంటి వారి సేవలను నేటితరం వినియోగించుకోలేక పోతున్నది. ఒక్కో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ‌కోల్పోతుండడాన్ని చూసి గుండె తరుక్కుపోతున్నదని ఆయన ఆవేదన చెందుతున్నాడు.

యవ్వనమంతా పార్టీకి దారపోసి, దాని ఉన్నతిని చూసి సంతోషించాల్సిన సమయంలో పతనమవుతుంటే చూడలేకపోతున్నామంటూ ఆయనలా నిస్సహాయులై కుంగిపోతున్నవారనేకులున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎంపి శశిథరూర్‌ ‌కూడా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తనలోని ఆవేదనను ఆపుకోలేకపోతున్నాడు. పార్టీ నాయకత్వంలో మార్పు అనివార్యమంటాడాయన. వ్యవస్థీకృత మార్పులు జరుగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.

Congress wants change of leadership

ఇక ముందు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ‌గెలువాలంటే, నాయకత్వ మార్పు అవసరం. అలాగే దేశ ప్రజల్లో పూర్వపు కాంగ్రెస్‌ ఐడియాలజీని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా అధినాయకత్వం ఈ వాస్తవ పరిస్థితిని తెలుసుకుని మార్పులు చేర్పులు సత్వరం చేపట్టని పక్షంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూడా కాంగ్రెస్‌ ‌కోల్పోక తప్పదు. దశాబ్ధాలుగా పార్టీనే నమ్ముకున్న తమలాంటివారు ఎందరో నష్టపోక తప్పదంటున్నారు ఈ సీనియర్లు. ప్రతిపక్షాలు ముఖ్యంగా భారతీయ జనతాపార్టీ లాంటి వారు కుటుంబ పాలన, ఒకే కుటుంబ ఆధిపత్యం గల పార్టీగా ఒక పక్క నిత్యం ఎద్దేవా చేస్తున్నా కాంగ్రెస్‌ ‌పార్టీ యంత్రాంగం మాత్రం గాంధీ కుటుంబాన్ని వీడలేకపోతున్నది.

ఆ కుంటుంబాలు చేసిన త్యాగాలున్నప్పటికీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వంలో మార్పులు తీసుకురావాలని ఆ పార్టీలోని కొందరి అభిప్రాయాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీకున్నదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలోనే గాక రాష్ట్రాల స్థాయిలో కూడా ఆ పార్టీ తన వెనుకటి గుణాన్ని మార్పుకోలేకపోతున్నది. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇవ్వాళ అధికారంలో ఉన్న పంజాబ్‌ ‌రాష్ట్రాన్ని జారవిడుచుకోవడానికి కూడా అదే కారణం. అంతర్గత కలహాలతో ఆ పార్టీ కనీస వోట్లను కూడా సాధించుకోలేకపోయింది. ఒకప్పుడు దిల్లీలో ఆప్‌ ‌పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మద్దతిచ్చిన కాంగ్రెస్‌, ఇవ్వాళ అదే పార్టీ చేతిలో ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఒక్కటే కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవే కుమ్ములాటలు. ప్రధానంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి అంతర్గత కలహాలతో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతుంది.

ఇతర పార్టీ నుండి వొచ్చిన రేవంత్‌ ‌రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి అప్పగించడమేంటని పార్టీలోని చాలామంది సీనియర్‌ ‌నాయకులు అలిగినప్పటికీ అధిష్టానం ఆయనకే ఆ పదవిని అంటగట్టింది. అప్పటి నుండి ఆ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా సీనియర్లు కలిసి రాకపోవడం, పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వొచ్చిన తర్వాత కూడా అవే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంఎల్‌ఏ ‌కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తాజాగా పరోక్షంగా రేవంత్‌రెడ్డికి ఆ పదవిని ఇవ్వడాన్ని తప్పుపట్టాడు. అంతకు ముందు నుండే మరో ఎంఎల్‌ఏ ‌జగ్గారెడ్డి రేవంత్‌ ‌రెడ్డిపైన అలిగిన రాజీనామా చేస్తానన్నంత వరకు వెళ్ళాడు. మరికొందరు సీనియర్లు ఇవ్వాల్టికి ఆయనతో ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్‌కు భవిష్యత్తు గడ్డుకాలమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page