- మునుగోడులో పండుగ వాతావరణంలో మనిగి తేలుతున్న ప్రజలు
- ప్రచారంలో నేతల పడరాని పాట్లు
- మునుగోడు ఉప ఎన్నిక కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ఎన్నిసార్లు జంప్ చేస్తే అంత లాభం…కండువాలు మార్చడంలో ఆరితేరిన స్థానిక ప్రజాప్రతినిధులు
నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : మునుగోడు నియోజకవర్గంలో ఏ ప్లలెలో చూసినా మధ్యాహ్నం వేళ గుంపులుగుంపులుగా భోజనాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తోటలు, ఫంక్షన్ హాళ్లలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఒక్కో పార్టీ పక్షాన 25 మందికి తక్కువ కాకుండా ప్రచారంలో ఉంటున్నారు. బయటి నుంచి వొచ్చిన నేతలు, గ్రామస్థాయి నేతలు కలిసి ప్రచారం చేస్తున్నారు. కష్టపడిన వారికి మధ్యాహ్నం వేళ కడుపునిండా తిండి పెట్టాలి, ఏమాత్రం ఇబ్బంది వొచ్చినా వారు స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఏర్పాట్లను పార్టీ పెద్దలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఊరంతా కలియతిరుగుతున్న నేతలు రాత్రివేళ అలసట తీర్చుకుని మరుసటి రోజుకు సిద్ధమయ్యేందుకు మద్యంతో ప్రతీరోజు రాత్రి విందు ఇస్తున్నారు.
దీంతో పండగ వాతావారణం నెలకొంటోంది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి మరో పదిరోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేసేందుకు ఆరాటపడుతున్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా గ్రామాలకు చేరుకుంటున్నారు. వోటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వెంట పెట్టుకుని మంత్రి జగదీష్‌రెడ్డి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. కీలక పనులు ఉన్న సమయంలో మంత్రి ప్రచారం నుంచి దూరంగా ఉంటున్నారు. చేరికలు, వలసల నివారణ, నియోజకవర్గ వ్యాప్తంగా పనులను సమన్వయం చేసే అంశాలను మరోవైపు మంత్రి పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ ఎంపీటీసీ పరిధిలో ఎమ్మెల్యే లేదా మంత్రికి బాధ్యతలు ఇవ్వగా, వారు వారి అనుచరులు 25 మందికి తగ్గకుండా వొచ్చి స్థానికంగా మకాం వేశారు.
వీరు ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి పరిధిలోని వోటర్లను కలిసి సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, మునుగోడు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో సామాజికవర్గాల వారీగా రాత్రివేళ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థి గ్రామాల్లోకి వొచ్చిన సందర్భంలోనే స్థానికంగా చేరికల చేపడుతున్నారు. ఇక బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అందరినీ ఆకర్షించేలా రూపొందించిన పువ్వుగుర్తు తన వెనుక కనిపించేలా ప్రచారంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ వెలువడడానికి ముందే వ్యూహాత్మకంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించిన రాజగోపాల్‌రెడ్డి చేరికల అంశాన్ని పూర్తిచేయడంతో పాటు స్థానిక నేతలకు టచ్‌లోకి వెళ్లారు. నామినేషన్ల కార్యక్రమం ముగియడంతో పూర్తిగా ప్రచారానికి సమయం కేటాయిస్తున్నారు. తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను ప్రచారానికి తీసుకెళ్తున్నారు. మండలాల వారీగా బాధ్యతలు తీసుకున్న బీజేపీ నేతలు పూర్తిస్థాయిలో ఇంకా గ్రామాలకు చేరుకోవాల్సి ఉంది.
మునుగోడు క్యాంపు కార్యాలయం కేంద్రంగా చేరికలు, సామాజికవర్గ సమావేశాలను రాజగోపాల్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. అధికార పక్షం చేసే ప్రకటనలు, ఆరోపణలకు ఖండనలు ఎప్పటికప్పుడు అందించేందుకు ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని రాజగోపాల్‌రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి గాజులు, బొట్టు ఉన్న ప్యాకెట్‌ను అందజేస్తున్నారు. వోటు బ్యాంకు బలంగా ఉన్న గిరిజన ప్రాంతాలు, ఇతర గ్రామాల్లో ఆమె స్వయంగా మహిళా వోటర్లకు గాజులు తొడుగుతూ అందరిని ఆకర్షిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘం నేతలు పాదాభివందనం కార్యక్రమాన్ని చేపట్టారు. బూత్‌ల వారీగా స్థానిక నేతలతో కమిటీలు ఏర్పాటు చేశారు. వీరికి పీసీసీ నుంచి సమన్వయకర్తలను నియమించారు. ఓవైపు అభ్యర్థి, మరోవైపు బూత్‌స్థాయి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి రోడ్‌షోతో పలు మండలాల్లో మాస్ క్యాంపెయినింగ్ పూర్తయింది.
మునుగోడు ఉప ఎన్నిక కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఫోన్ నంబర్ 08682 230198కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేసినా, ఇతర ప్రలోభాలకు గురిచేసినా, వోటు వేయకుండా నిరోధించినా, భయబ్రాంతులకు గురిచేసిన, రాత్రి 10గంటల తరువాత ప్రచారం చేసినా, అనుమతి లేకుండా గోడలపై రాతలు రాసినా కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు దారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలీస్ పరిశీలకులుగా మయాంక్ శ్రీవాత్సవను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే సెల్ నంబర్‌కు 7989819963 ఫోన్ చేసి ఆయనకు ఫిర్యాదు చేయవచ్చు.
ఎన్నిసార్లు జంప్ చేస్తే అంత లాభం…కండువాలు మార్చడంలో ఆరితేరిన స్థానిక ప్రజాప్రతినిధులు
మునుగోడులో ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ అటువారు ఇటు..ఇటువారు అటు దూకేస్తున్నారు. కండువాలు కప్పుకుంటే ఇంత రేటు అన్న చందంగా పార్టీలు మారుతున్నారు. ఏ పార్టీలో చేరడం అన్నది కాకుండా ఎంత రేటు పలికిందన్నదే ముఖ్యమని అంటున్నారు. నెలరోజుల కింద టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సర్పంచ్ బీజేపీలో చేరగా..ఆదివారం మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరారు. చండూరు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు ఇటీవల రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఏమైందో ఏమో గాని ఆదివారం చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం సమక్షంలో హైదరాబాద్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంట్లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇందులో దొనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ ముందు కాంగ్రెస్ ?నుంచి గెలుపొంది తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. నెల కింద రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి రాగా, మళ్లీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోకే పోయారు. అలాగే టీఆర్‌ఎస్‌కు చెందిన గుండ్రపల్లి సర్పంచ్ తీగల సుభాష్, నేర్మట సర్పంచ్ నందికొండ నరసింహ, కస్తాల సర్పంచ్ ద్రౌపదమ్మ, తుమ్మలపల్లి సర్పంచ్ కృపాటి రాములమ్మలు కూడా నెల కింద బీజేపీలో చేరి ఇప్పుడు మళ్లీ టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. అధికార పార్టీతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నట్టు పార్టీ మారిన సర్పంచులు ప్రకటించారు.