శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడా ఆగకుండా వర్షంలోనే శోభాయాత్రలు కొనసాగాయి. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌస్, చార్మినార్, అత్తాపూర్, బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో గణనాథులు మండపాలకే పరిమితమయ్యాయి. పలు మండపాల నిర్వాహకులు వర్షంలోనే గణెషుడి శోభయాత్ర నిర్వహించారు. ఇదిలావుంటే హైదరాబాద్ లో కొనసాగుతున్న శోభాయాత్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను డీజీపీ మహేందర్ రెడ్డి సీసీ టీవీల ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న శోభా యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 35 వేల మంది పోలీసులను మోహరించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.