రైతులకూ తీవ్ర అన్యాయం.. మోదీ, కేసీఅర్ విధానాలు ఒక్కటే..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
జోగిపేట్, ప్రజాతంత్ర: రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకెళుతున్నాం అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జీడో పాద యాత్ర లో భాగంగా శనివారం యాత్ర ముగిసిన తరువాత పెద్దాపూర్ వద్ద కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ..బీజేపీ, టీఆరెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు..దేశంలో ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదు..2014 తరువాత అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేశారు..ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రయివేటుకు అమ్మేస్తున్నారు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.భారతదేశంలో ప్రభుత్వ రంగంతో పాటు చిన్న పరిశ్రమలు ప్రధాన ఉపాధిని కల్పించేవి. కానీ 2014 తర్వాత, మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు మరియు జీఎస్టీ తప్పుడు విధానాలతో చిన్న పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యమయినాయి మరియు ప్రభుత్వాల వైపు నుండి సరైన రిక్రూట్‌మెంట్ లేదు అని రాహుల్ గాంధీ అన్నారు.
మోదీ ప్రభుత్వం భారతదేశంలోని పిఎస్‌యులను ప్రైవేటీకరించింది. అని పేర్కొంటూ దీని వల్ల సామాన్యులకు ప్రయోజనం ఉండదు కానీ మోదీ మిత్రులైన కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.. కేసీఆర్ కూడా మోదీ• తరహాలోనే వ్యూహాలు పన్నుతున్నారు అని రాహుల్ అన్నారు. తెలంగాణాలో రైతు వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయి అని పేర్కొంటూ తనను కలవడానికి వొచ్చిన రైతు నాగిరెడ్డితో కార్నర్ మీటింగ్ లో మాట్లాడించారు. రైతు నాగిరెడ్డి మాట్లాడుతూ – డ్రిప్ ఇరిగేషన్‌పై 100% సబ్సిడీ పొందే మేము ఇప్పుడు ఇప్పుడు పొందలేక పోతున్నాము. యూరియా, పొటాష్ ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ప్రభావం పరోక్షంగా రైతులపై ఒత్తిడి పెంచుతోంది..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కనీస మద్దతు లభించడం లేదు.. అని నాగిరెడ్డి అన్నారు.
ఆ తరువాత రాహుల్ ప్రసంగం కొనసాగిస్తూ …తెలంగాణలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.. నాగిరెడ్డి కి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కంటే ఎక్కువ తెలుసు…ప్రభుత్వం నాగిరెడ్డి మాటలు వింటే రైతుకు మేలు జరుగుతుంది..సిఎం కేసీఆర్ రైతుల భూములు లాక్కుంటూ రైతుల గొంతు నొక్కుతున్నారు.. మోదీ రైతు వ్యతిరేక చట్టాలకు టీఆరెస్ మద్దతు ఇచ్చింది..విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టాం..ప్రజల ప్రేమాభిమానాలతో భారత్ జోడో యాత్ర ముందుకెళుతోంది.. అని రాహుల్ గాంధీ అన్నారు.