నిశిత సాహిత్య విశ్లేషణ…

నిరంతర సాహిత్య పఠనం విషయాత్మతో కూడిన విశ్లేషణాత్మకమైన రచనలను అందించడానికి రచయితకు తోడ్పడుతుందనడానికి సాక్ష్యంగా డాక్టర్‌ అమ్మిన  శ్రీనివాసరాజు రాసిన వ్యాసాలు కన్పిస్తాయి. అక్షరాభిషేకం పేరుతో ఇటీవల ఆయన  వెలువరించిన వ్యాస సంకలనంలో  దేనికదే ప్రత్యేకత కలిగి విభిన్నంగా అనిపించే ఇరవై వ్యాసాలున్నాయి. సృజనాత్మకతను పాటిస్తూ సాధారణ దృష్టితో  చూడబడే వ్యాసాన్ని ముందుకు నడిపించడం నిజానికి రచయితకు ఒక సవాలే అన్నది నిర్వివాదాంశం. రచయితలోని వికసితమైన విమర్శనా దృష్టికోణాన్ని అక్షరాభిషేకంలోని వ్యాసాలు తేటతెల్లం చేశాయి. ఒకవైపు అధ్యాపక వృత్తిని అంకిత భావంతో  నిర్వహిస్తూనే సామాజిక ప్రభోదం చాటే రచనలు చేసిన కందుకూరి, గురజాడ, గిడుగు, కట్టమంచి వంటి ఎందరో మహనీయుల కృషిని ఆసక్తికరమైన రీతిలో డాక్టర్‌ అమ్మిన విశ్లేషించి చూపుతూ రాసిన బడిలో పాఠాలు – బయట రచనలు అన్న వ్యాసం రాశారు.

పఠనాభిలాషను పెంపొందించే రీతిలో వ్యాసాలలోని శైలి సాగింది. నిర్లక్ష్యానికి గురవుతున్న తెలుగు భాష గురించి భాషాభిమానులు  పడిన ఆరాటాన్ని నిర్లక్ష్యానికి బలవుతున్న తెలుగు బోధన వ్యాసంలో విశ్లేషించిన తీరు తెలుగును తెలిసిన ప్రతివారిని ఆలోచింపజేసి పరిరక్షణ దిశగా కార్యోన్ముఖులను చేస్తుందన్న నమ్మకాన్ని పెంచుతుంది. తెలుగు వారి ఉగాది, వైశిష్ట్యాన్ని పొదవుకున్న కూచిపూడి, సంక్రాంతి శోభను ఇనుమడింపజేస్తూ  సంచరించే గంగిరెద్దుల వారు, హరిదాసులు, జంగమయ్యలు, బుడబుక్కల వారు వంటి జానపద భిక్షుకుల గురించి వివరిస్తూ దొరికినప్పుడే కడుపునింపుకుని, దొరకనప్పుడు నీళ్ళు తాగి ఆకలి చల్లార్చుకోవడం వారికి అతి సామాన్య విషయం అయిపోయింది అని రాసిన వాక్యాలలో కళనే నమ్ముకున్న వారి జీవనదైన్యం స్పష్టంగా కన్పిస్తుంది.

వినూత్న ప్రక్రియలు కథా వస్తువులంటూ అసలు కథల రూపాలనే మార్చే ధోరణులకు వెళ్ళకుండా తెలుగు కథా సుమాలను  వాడిపోకుండా మరో వందేళ్లు కాపాడుకుందామన్న సందేశంతో పత్రికల గుప్పెట్లో కథల ప్రాణాలు అన్న వ్యాసం సాగింది. భాషా నిక్షేపాలను సంస్కరిస్తే వినియోగదారుల్లో మార్పులు రావడం అనివార్యమని మూలాలను ముట్టుకోకపోతే  ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని పదసంపదను  పండించుకుందాం అన్న వ్యాసంలో స్పష్టంగా చెప్పారు.  భాషలో భావంలో నవీన రీతులకు నాందీ గీతాన్ని పాడి ఆశయాల ఆచరణ, కార్యాచరణతో సాగితే ప్రత్యేకత ప్రజ్వరిల్లుతూనే ఉంటుందంటారు. అన్ని మూలాలు ముట్టిన అదేపుట అన్న వ్యాసంలో డా. రావులపాటి సీతారామారావు ప్రస్తావనలో సాహితీ సద్విమర్శకు అక్షర సూది వైద్యుడు, మానవతా పాదరసం, అక్షరాల బువ్వముద్దలు వంటి ప్రయోగ పదాలు సరికొత్తగా ప్రకాశించాయి. రచనలు అర్థం చేసుకుని విమర్శ చేయడం ఉత్తమమన్న దృష్టికోణాన్ని వెల్లడించారు.

సాహితీపోషణ భాషాభిమానం అంతర్లయగా సాగుతుందని భావించారు. విశ్వ సంద ర్శనలోని  నిబిడీకృతమైన కళావిర్భూతిని విశ్వంభరతో ఆవిష్కరించి మహాకవి సినారెను సాహితీ విపంచిగా విస్తరించి చూపారు.  భద్రాద్రి మన్నె సీమలో ఆదివాసీలు, గిరిజనేతరుల సమైక్య జీవనాన్ని ప్రస్తావిస్తూ మన్నె సీమకు ఖమ్మంతో  ఏర్పడిన 56 ఏళ్ళ సాంగత్యాన్ని తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలలో గోదావరి, కృష్ణా జిల్లాల వారితో కలిసి నాటక కళ అభివృద్ధి చెందిందని చెప్పారు. చుక్కబొట్ల సత్యనారాయణమూర్తి చర్లకు  రావడంతో నాటక రంగం అంకురార్పణ మొదలై చెన్నకేశ్వర నాట్యమండలితో పాటు అనేక నాటక కళా సమితులు, ఆర్టస్ అకాడమీలు, కళా పరిషత్లు విస్తరించగా ఏలూరు హనమంతరావు, కడెం కృష్ణార్జునరావు, షేక్‌ ‌హిమాం, గాలి లక్ష్మణస్వామి, బివిరావు, సివి రమణ వంటి 136 మంచి కళాకారుల నాటక రంగ కృషి  కనిపించిందని వివరించారు. చర్ల వేదికగా ప్రఖ్యాత నటులు తనికెళ్ల భరణి కూడా నాటకాల్లో నడించడం విశేషం అన్నారు. బలిదానం, రంగూన్‌ ‌రౌడి వంటి ప్రసిద్ధ నాటకాలను  ప్రస్తావించారు. వాజేడుకు  చెందిన బుల్లితెర, వెండితర నటులుగా ఎదిగిన జాపాకుల సమ్మయ్య, బత్తుల కుమార్‌ ‌రాజా, భద్రాచలంకు చెందిన టివీ నుటుడు ప్రఖ్యాత బంగారు దుర్గా ప్రసాద్ల ప్రతిభను కొనియాడారు.

విశ్వనాథ అమృత సృష్టి కిన్నెరసాని కాలమెంత మారినా తెలుగింటి వన్నెల దొరసానిగా విరాజిల్లుతూనే ఉంటుందన్నారు. 1947లో ఉద్యమ ప్రజా రచయితలైన వాసిరెడ్డి భాస్కరరావు – సుంకర సత్యనారాయణ కలాల నుండి వెలుగు చూసిన మా భూమి నాటకాన్ని ప్రజాచైతన్యానికి ప్రతిబింబంగా, నాటి తెలంగాణ జీవన చిత్రం – మా భూమి నాటకం అన్న వ్యాసంలో డాక్టర్‌  అమ్మిన ఎన్నో సంఘటనలను జాగ్రత్తగా క్రోడీకరించి మలిచి చూపారు. సమాజ మార్గాన్ని మార్చగలిగే శక్తి కలిగింది  సాహిత్యం అని నిరూపించిన మహాకవి శ్రీశ్రీ అంతర్గత శబ్దశక్తితో రాసిన కథలు మంచి వస్తువుతో, విషయ నిష్టతో, ఉత్తమ పురుష పద్ధతిలో కొనసాగాయని తొమ్మిది కథలను నవరస కవితాకథకుడు శ్రీశ్రీ అన్న వ్యాసంలో విశ్లేషించి చూపారు. 1977లో జ్యోతి మాసపత్రిక కోసం ఈ కథలను శ్రీశ్రీ రాశారు. మొదటి కథ  లెనినిజం, నింపాదిగా కోపం చేయి, అరవంలో కోడిగుడ్డు, దైవబూతి, భయానక రసం, మదన కవన, కుళ్లూపేతూళ్ళూ, బ్రూహిముకుందేతి, కన్నీటి కబుర్లు,  వెలుతురు కిరణాలు కథల అంతస్సూత్రాలను  అమ్మిన చిత్రిక పట్టి అందులోని అభ్యుదయ భావాలు, కవితాగుణాల్ని, మార్పును ఆశించిన ప్రబలత్వాన్ని  ఎత్తిచూపారు.

మన భాషను కాపాడేందుకు మన అరచేతులే పెద్ద దిక్కులంటూ అమ్మ భాషాపండుగ – అందరికీ పండుగ అన్న వ్యాసంలో చెప్పారు. నీతితో మాత్రమే మనుషుల మనస్తత్వాల్ని అంచనా వేయాలన్న గొప్ప సందేశాన్ని అందించిన కాళ్ళకూరి మానస పత్రిక చింతామణి నాటకాన్ని గురించి చెప్పారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం భాహ్య దృష్టిలో రామాయణానికి వ్యాఖ్యానంగా దృశ్యమానమైనా అది నవలారూప కావ్యంగానే విశ్లేషించబడుతుందని విశ్వనాథ కవితా కిరీటం వ్యాసంలో వెల్లడించారు. విఖ్యాత రచయిత రావూరి భరద్వాజ రాసిన పాకుడురాళ్ళ  నవలలో సినీ జీవిత సజీవ చిత్రణను ప్రస్తావిస్తూ బతుకు పొలంలో అనుభవ అక్షర విత్తనాలు చల్లి పండించిన పంటే ఈ రచన అని వ్యాఖ్యానించారు. అందుకే తొలితెలుగు జ్ఞానపీఠం దక్కించుకున్న నవలగా పాకుడు రాళ్లు నిలిచిపోయిందని చెప్పారు.

శంకరం మంచి సత్యం రాసిన అమరావతి కథల్లో శిల్పానికి  ఉన్న అత్యంత ప్రాధాన్య స్థానాన్ని విశ్లేషిస్తూ సరికొత్త భావ ప్రపంచావిష్కరణ కథల్లో జరిగిన తీరును తెలిపారు. వంద ఆలోచనల చెట్టు – ఒంటరి పూలబుట్ట అంటూ పద్యాన్ని తెలుగు సాహిత్యానికి హృదయ రమణీయంగా అందించిన రాళ్ళబండి కవితాప్రసాద్‌ ‌చిరు కవితలను విశ్లేషిస్తూ సిద్ధ కవితాప్రయత్నంగా,ధ్వనిమంతమైన కవితాత్మగా చూపారు. అక్షరాభిషేకంలోని అమ్మిన ప్రతి వ్యాసం లోతైన విమర్శనాత్మక  విశ్లేషణలోని శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది.అక్షరాభిషేకం (వ్యాసావళి), డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, వెల రూ. 200, ప్రతులకు.. లక్ష్మీపురం, పేరూరు పోస్టు, వాజేడు మండలం, ములుగు జిల్లా, తెలంగాణ, 507136.
తిరునగరి శ్రీనివాస్‌
                            8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page