మొగ్గల్ని తెంపేసి
పూలను స్వప్నిస్తోన్న రాజ్యంలో
మానవత్వం
ఏ కత్తెరకు ఉరిపెట్టుకొన్నదో
కరుణజి
ఏ సమాధుల కింద దాగి ఉన్నదో?
సర్వం అవకతవకల కిష్కింధలో
ఇనుపపాదాల కింద నలుగుతూ
ప్రజాస్వామ్యం
అపవిత్రమవుతోన్న వేళ
మంచితనానికి స్థానమెక్కడ?
మానవత్వానికి మనుగడెక్కడ?
చేతకాని పాలనతో
వెతల చిరునామాగా మారిన
ఏలుబడి
క్రూరమృగాలు పొంచిఉన్న
ముళ్ళ పొదలా ఉంది,
బుసలు కొడుతున్న
సర్పాల వల్మీకంలా ఉంది.
జడలు విప్పిన
కసాయి రాజకీయ క్రీడలో
అధికారపు పిడికిలి ఎవ్వరిదైతేనేమి
తస్మదీయులు ఎప్పుడూ సమిధలే!
నిత్యం అహంకారపు
కచ్చాడాలలో నలుగుతూ
గాలికి పెట్టిన దీపంలా
అస్థిత్వానికై పోరాటం చేస్తోన్న
ఓ మనిషీ! నీ పయనమెటు?
ప్రగతి పధమా!వినాశన మార్గమా!
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం