నెత్తుటి లేపనం!

నిజమే….
మన ప్రమేయం లేకుండానే
ఏ మాత్రం తెలియకనే
వయసు పెరిగి పోతోంది !
రోజూ రోజటిలా లేకున్నా
నిన్నటి రోజులా అనిపించక
కొత్తగా నేడు మనముందు
తెర తీసి ఆవిష్కారమై
నిన్నను మరిచేలా నేడు
కొత్తగా అందంగా దర్షనమౌతోంది !

అవును నిజంగానే
గడిపిన రోజులు
పాత జ్ఞాపకాలు
బాల్యపు స్మృతుల చెలిమెలు
యవ్వన ఆవేశాలు ఆదర్శాలు
వాటికోసం తెగించి నడచిన
దారులు నేస్తాలు
వెనక కూడా కదిలి వస్తూ
మలివయసును వేడి నెత్తుటితో
లేపనంగా పులిమినట్టుంది !

నాటి మధుర జ్ఞాపకాలు
తనివితీరా నెమరేసుకుంటూంటే
అప్పుడు తాగిన తాజా
చెరుకు రసం తీపిలా
స్వచ్ఛంగా విరిసే
మెత్తని పూరేకుల్లా
మనసు మందారమైపోతుంది !

నీవూ నేనూ నేడో రేపో
వయసై ముసలి వాళ్ళమవాల్సిందే !
అందరం వెనకో ముందో
ఇష్టమైన ఈ దేహాన్ని వదిలి
లోకానికి వీడ్కోలు చెప్పాల్సిందే !

ఎప్పుడో ఒకప్పుడు
కాలం తీరాక పండిన
ఆకులుగా రాలిపోవాల్సిందే
గాలికి సుగంధాలు పులిమినా
మలిరోజు వాడిపోయిన
పూలమై మిగలాల్సిందే !

ఈ లోపు మనల్ని మనమే
నిజాయితీగా నిలదీసుకోవాలి !
నడిచి వచ్చిన దారి
కలిసి సాగిన ప్రయాణం
ఎందరి హృదయాల్లో
ప్రేమ జ్యోతుల ప్రకాశాన్ని అద్దిందో ?
ఎంత ప్రయోజనాన్ని నింపిందో ?

బ్రతకటమంటే బండలా
కదలక కాలానికి లొంగటం కాదని
మారుతున్న ఋతువులతో

పల్లవించే పచ్చదనమైపోవాలి !
కొత్త రెక్కలు తొడిగిన
పిల్ల విహంగాలై ఎగురుతూ
ఆకాశాన్ని ముద్దాడాలి !

బ్రతికినంత కాలం ప్రతి
వసంతాన్నీ చిగురింపచేస్తూ
నిజంగానే జీవించాలి !
స్వచ్ఛ జల ప్రవాహమై
దారెంటా ఎదురయ్యే
దాహార్తుల దప్పిక తీరుస్తూ
పచ్చగా ప్రతి హృదిలో
జీవకళను నాటాలి!

ఆశా ఆకాశాన రాలిన
తారకలు చీకటిలో కనుమరుగైనా
ప్రకాశిస్తూ వెలుగులు వెదజల్లే
అరుణ తారలు రేపటి
ఉదయానికి స్వాగతం పలుకుతాయి!
కలలుకన్న రేపటి ఉషోదయానికై
ఆశగా ఎదురు చూడాల్సిందే!

-డా.కె. దివాకరాచారి
9391018972

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page