ఎప్రిల్ మాసాంతానికి భూసేకరణ పూర్తి
రైతులతో త్వరితగతిన సంప్రదింపులు
అటవీ భూములకు అదనపు చెల్లింపులకు ప్రతిపాదనలు సిద్ధం
ఐదు చెక్ డ్యామ్‌లకు టెండర్ల పక్రియ పూర్తి చేయాలి
నెల్లికల్లు ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగసఖఖ్ట్ 22 : నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్ మాసాంతానికి భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా• సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…భూసేకరణ విషయమై రైతులతో త్వరితగతిన సంప్రదింపులు జరిపి పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే సమయంలో అటవీ శాఖ భూములకు అదనంగా చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పూర్తి చేయాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న 23 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు పెరిగిన విద్యుత్ బకాయిల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అదే విదంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన చెక్ డ్యామ్ నిర్మాణానికి పాలనపరమైన అనుమతులు తీసుకోవడంతో పాటు మొత్తం ఐదు చెక్ డ్యామ్‌లకు తక్షణమే టెండర్ల పక్రియ పూర్తి చేయాలన్నారు.
ఏయంఆర్‌పి పరిధిలోని లో లెవల్ కెనాల్‌లో జంగిల్ కటింగ్ వెంటనే మొదలు పెట్టాలని ఉత్తమ్ అన్నారు. దాంతో పాటుగానే యన్‌యస్‌పి కెనాల్ పరిధిలో ఉన్న మరమ్మతులను గుర్తించి వెంటనే పనులు మొదలు పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో నల్లగొండ లోకసభ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, శాసన సభ్యులు కుందూరు జయదీర్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు అజయ్ కుమార్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.