- ప్రతిష్టాత్మకంగా నిర్వహంచేలా ఏర్పాట్లు
- కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్‌కు ఆహ్వానం
వరంగల్, ప్రజాతంత్ర, జూలై 6 : చారిత్రక వరంగల్ నగరంలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా మంత్రి కెటిఆర్ మంగళవారం విడుదల చేశారు. కాకతీయుల వైభవాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికి, ప్రస్తుత తరానికి వారి పరిపాలనా వైశిష్ట్యాన్ని తెలియచేయడానికి 7 నుం చి 13వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. అయితే ఈ సప్తాహం జరపాలన్న నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. అధికారగణంలో మూడు, నాలుగు రోజుల నుంచే హడావుడి కనిపిస్తుంది. కాకతీయ ఉత్సవాలు జరపక దాదాపు పది సంవత్సరాలు అవుతుంది.
మధ్యలో ఒకటీ రెండు సార్లు వారోత్సవాలంటూ వివిధ రకాల కార్యక్రమాలు సాధారణంగా నిర్వహించారు. కానీ చాలా రోజుల తర్వాత సప్తాహం పేరుతో అధికారుల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పాల్గొనడానికి ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని జగదల్పూరులో కాకతీయుల వారసులుగా భావిస్తున్న కమల్ చంద్ర భంజ్ దేవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయతే కాకతీయుల సామ్రాజ్యం అంతమైన దాదాపు 800 సంవత్సరాల అనంతరం కాకతీయుల వారసులు ఓరుగల్లు గడ్డపై ఒక చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అడుగుపెడుతుండడంతో ఆసక్తి నెలకొంది. వరంగల్లుకు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ రాకపై తెలంగాణా ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది.
బస్తర్‌లో కాకతీయ వంశస్తుల పాలన విషయానికి వొస్తే 1223లో దండకారణ్యానికి వొచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అలా కాకతీయుల వారసుడిగా ఉన్న కమల్ చంద్ర భంజ్ దేవ్ 1984లో జన్మించారు. బ్రిటన్‌లో కాన్వెంటరీ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం పొలిటికల్ సైన్సులో పీజీ చేశారు. ప్రస్తుతం ప్రవీర్ సేన అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బస్తర్ కేంద్రంగా ఉన్న సర్వ్ సమాజ్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. యువకుడిగా, ఆధునిక భావాలు ఉన్న కాకతీయుల వారసుడిగా కమల్ చంద్ర వరంగల్, హైదరాబాద్‌ల పర్యటనకు వొస్తున్నందున పెద్దఎత్తున స్వాగతం పలుకనున్నారు.