నేడు మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ ర్యాలీ

అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి : టీపీయూ
ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ పేరుతో ఆదివారం ఎల్బీ స్టేడియం జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌ ‌వద్ద ఉన్న అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫర్‌ ‌పీస్‌ ‌యూనిటీ (టీపీయూ) ప్రతినిధులు పద్మజా షా, ఖలీదా పర్వీన్‌, ‌కిరణ్‌ ‌విస్సా, మరియా తబస్సుమ్‌ ‌తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో ప్రజలు, స్వచ్చంద సంస్థలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈమేరకు వారు శనివారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో దేశంలో, రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మతం పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దిశగా కొన్ని మత ఛాందసవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయనీ, వాటిని అడ్డుకోవడంలో భాగంగా ప్రజలలో చైతన్యం కలిగించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని ప్రజల మధ్య బేధభావాలు సృష్టించే శక్తుల పన్నాగాలను సాగనివ్వబోమనే సంకేతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పీస్‌ ‌మార్చ్ ‌ర్యాలీ అనంతరం రానున్న రోజుల్లో ప్రజలలో కొన్ని మతాల స్వేచ్ఛకు భంగం కలిగించి రాజకీయ లబ్ది పొందాలనే కుట్రలు పన్నుతున్నారనీ, దీనిని ఎదుర్కునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో మతం పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు పన్నుతున్న కుట్రలను అడ్డుకునేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలనని గత కొద్ది రోజుల క్రితం సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా టీపీయూ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page