కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌తో షురూ
8.30 నుండి ఈవిఎంల లెక్కింపు
10 కల్లా తొలి ఫలితం వెలువడే ఛాన్స్
భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసి
కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత : అధికారులకు డిజిపి ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : తెలంగాణ వ్యాప్తంగా నేడు జరిగే కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించేలా విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు భారీగా మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భారీ భద్రత ఏర్పాట్లతో 49 కౌంటింగ్ కేంద్రాల్లో 119 నియోజకవర్గాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల కల్లా తొలి ఫలితం వొచ్చేస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రజలే కాక జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వొస్తుందో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు మద్యం దుకాణాలు బంద్ చేశారు. ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశా నిర్దేశర చేయడం జరిగింది. ఆర్‌ఓ ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాప్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎన్నికలు ముగియగానే గురువారం రాత్రే ఈవీఎంలను పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాగ్ రూమ్‌లకు తరలించారు.
ఈవీఎంలు భద్రపరిచిన గదుల దగ్గరకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల దగ్గర బందోబస్తు విధుల్లో ఉంచారు. మొత్తంగా తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల వోట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేపడుతున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే…రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున వోట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. కౌంటింగ్ కోసం మొత్తం 17వందల 66 టేబుల్స్ ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒక్కో టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించారు. చిన్న నియోజకవర్గంలో ఉదయం 10గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక, పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 వోట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ వోట్ల లెక్కింపు కూడా సమాంతరంగా జరుగుతుందని చెప్పారు వికాస్‌రాజ్. లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా వోటు హక్కు వినియోగించుకున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 2 వేల 290 మంది అభ్యర్థులు ఉండగా…వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్. తెలంగాణలో మొత్తం 71.06 శాతం పోలింగ్ జరిగిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది వోటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్‌లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.రేపు జరుగనున్న కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆదివారం మద్యం దుకాణాల మూసివేతకు ఇసి ఆదేశాలు ఇచ్చింది. దాంతో షాపులు మూపతడనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా మందు షాపులు మూసివేయాలని షాపు యజమానులకు పోలీస్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే భాగ్యనగరంలో వైన్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులతో పాటు, బార్లు కూడా మూతపడనున్నాయి.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత : అధికారులకు డిజిపి ఆదేశాలు
నేడు కౌంటింగ్ నేపథ్యంలో భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. వోట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వోట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. సీపీలు, ఎస్పీలతో డీజీపీ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని అంజనీ కుమార్ సూచించారు. కౌంటింగ్ సెంటర్లలో ఫలితాలు వొస్తున్న సమయంలో, కౌంటింగ్ సెంటర్ బయట కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్ల వారీగా వొస్తున్న వివరాలను బట్టి కౌంటింగ్ సెంటర్ బయట పోలీసు బందోబస్తును పై అధికారులు సక్షించాలని చెప్పారు.
పోటీ చేసిన అభ్యర్థుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగాకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.అభ్యర్థులకు, వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించామని చెప్పారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీ తీసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎవరు గెలుపొందిన పోలీసులకు సహకరించేలా వివరించాలని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి విఘాతం లేకుండా ఎన్నికల బందోబస్తు నిర్వహించామని, ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలను అంజనీ కుమార్ ఆదేశించారు.