నేడు హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ కు గులాబీ దళపతి కేసీఆర్

 

అందరి దృష్టి హుస్నాబాద్ వైపు 

సభకు భారీ ఏర్పాట్లు ..సర్వం సిద్దం

 ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్ 

గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావానికి హుస్నాబాద్ వేదికైంది. సి ఎం కేసీఆర్ ఆదివారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచనున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సి ఎం కేసీఆర్ హుస్నాబాద్ కు వస్తున్న సందర్భంగా హుస్నాబాద్ గులాబీ మయమైంది. ఎక్కడ చూసినా గులాబీ సందడి కనిపిస్తోంది. సి ఎం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్ ద్వారా హుస్నాబాద్ చేరుకొని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అంతకుముందు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేస్తారు. బీ ఆర్ ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. సి ఎం హుస్నాబాద్ బహిరంగ సభకు వస్తున్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. సుమారు లక్షమంది ఈ సభకు హాజరుకానున్నారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని సబ్ స్టేషన్ పక్కన సభను ఏర్పాటు చేసారు. హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయింది. బహిరంగ సభ కోసం అతిపెద్ద వేదికను ఏర్పాటు చేసారు. పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేసారు. పోలీసుశాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తోంది. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పర్యవేక్షించారు.

మంత్రి, ఎమ్మెల్యే టెలి కాన్ఫరెన్స్ 

ఆర్థిక, ఆరోగ్య మంత్రి టి.హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వీరిరువురూ శనివారం పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సి ఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారని, అప్పటికే జనం మైదానానికి చేరుకోవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి ప్రజలతో కలిసి సభకు రావాలని సూచించారు. బాగా ముందుగా లేదా బాగా ఆలస్యంగా కాకుండా సరైన సమయానికి సభకు జనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాగ్రత్త వహించాలని కోరారు. జనం రోడ్లపై ఆగకుండా చూడాలని, ట్రాఫిక్ నిర్వహణ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

అందరి దృష్టి హుస్నాబాద్ పై… 

2018 లోనూ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుండే ప్రారంభించారు. ఈ సారి కూడా హుస్నాబాద్ నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి హుస్నాబాద్ వైపు మళ్లింది. సి ఎం హుస్నాబాద్ వేదికగా ఏం సందేశం ఇస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది. అయన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలతో పాటు గడచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రతిపక్షాలపై కూడా పదునైన విమర్శలు చేసే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు.

హుస్నాబాద్ గులాబీలో జోష్… 

సి ఎం కేసీఆర్ తొలి ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీలో జోష్ నెలకొంది. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఉత్సాహంగా కదం తొక్కుతున్నాయి. సి ఎం సభకు జన సమీకరణ కోసం గత మూడు రోజుల నుండి పార్టీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. మండలాల వారిగా గ్రామాల వారిగా జనసమీకరణకు లక్ష్యాలు నిర్దేశించారు. వాహనాలు ఏర్పాటు చేసారు. బతుకమ్మలు, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో ఉత్సాహంగా సభకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసారు. హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ నాయకత్వంలో గులాబీ పార్టీ బలంగా ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గడచిన పదేళ్లలో జరిగాయి. ఈ అంశాలు కూడా సి ఎం సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గ వరప్రదాయిని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. గడచిన పదేళ్లలో హుస్నాబాద్ అభివృద్ధికి కృషి జరగడంతో పాటు హుస్నాబాద్ కరవు ప్రాంతం, వివక్షకు గురైన ప్రాంతం అన్న పేరు మరచిపోయేలా చేసారు. గోదావరి జలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్న విషయం కూడా సి ఎం ప్రస్తావించే అవకాశం ఉంది.

రాజకీయంగా.. గులాబీ దే ఆధిపత్యం 

హుస్నాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ 2014లో మొదటిసారి 34 వేల మెజారిటీతో 2018లో రెండోసారి 70 వేల మెజారిటీతో విజయం సాధించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తనయుడైన వొడితల సతీష్ కుమార్ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వివాద రహితునిగా, మృదు స్వభావిగా, మంచి ప్రజాప్రతినిధిగా, మచ్చలేని నేతగా సతీష్ కుమార్ కు పేరుంది. తెలంగాణ ఉద్యమ సమయం నుండి హుస్నాబాద్ లో గులాబీ పార్టీ తన ప్రభావాన్ని చాటుతూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రభావం చూపుతూ వస్తోంది. మెజారిటీ ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీ వైపే ఉన్నారు. మూడోసారి కూడా భారీ మెజారిటీతో విజయం దిశగా సతీష్ కుమార్ దూసుకుపోతున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు అయన కృషి చేశారనే పేరుంది. ఇంకా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఖరారు కాక ముందే.. ఎమ్మెల్యే సతీష్ ప్రజలతో మమేకమై ప్రచారంలో దూసుకుపోతున్నారు. సి ఎం కేసీఆర్ సభతో గులాబీ పార్టీలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు.

సభ ఏర్పాట్లు పరిశీలించిన కెప్టెన్

హుస్నాబాద్ లో సి ఎం కేసీఆర్ హాజరయ్యే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు ఆదివారం పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీ ఆర్ ఎస్ నాయకులు వారిని ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… సి ఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని హుస్నాబాద్ నుండి పూరించడం హర్షణీయమని అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ 100 స్థానాలకు పైగా కైవసం చేసుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అయన స్పష్టం చేసారు. కేసీఆర్ తెలంగాణ కలను సాకారం చేసారని, బంగారు తెలంగాణ దిశగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని అన్నారు. ప్రతిపక్షాలకు ప్రజా సంక్షేమం పై, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అయన విమర్శించారు. హుస్నాబాద్ నుండి మరోసారి సతీష్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అయన అన్నారు.

సభను విజయవంతం చేయండి : ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్ లో ఆదివారం జరిగే ప్రజా ఆశీర్వాద సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ.. సి ఎం కేసీఆర్ తొలి ప్రచార సభకు హుస్నాబాద్ ను ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. హుస్నాబాద్ లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అయన అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం గులాబీ పార్టీకి కోట అని, ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో మరోసారి విజయం ఖాయమన్నారు. హుస్నాబాద్ లో కరవును రూపుమాపామని, గోదావరి జలాలు తీసుకువచ్చామని, సి ఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని అన్నారు. సి ఎం సభకు గ్రామగ్రామం నుండి ప్రజలు,నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page