పంచుకోవడానికి పంచాయితీ ఎందుకో?

ప్రపంచంలో వివక్షతను గురైన సమూహంలోనే వివక్షకు గురికావడం అనేది వేరే దేశాల్లో ఐతే చాలా అరుదు.. కానీ భారతదేశంలో చాలా సహజం. అందుకు కారణం ఈ దేశంలోని హిందూ వర్ణ వ్యవస్థ. దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో కిందకి పోతున్న కొలది వివక్షకు గురవుతున్న సమూహంలోనీ సభ్యుల మధ్య అసమానత్వం ఇంకా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ అసమానత్వం వెనకబడిన వర్గాలలో కంటే దళిత కులాల్లో స్పష్టంగా కనపడుతుంది. అందుకే  ఎస్సీ వర్గీకరణ ను ఉద్దేశించి బాలగోపాల్‌ గారు ‘ ఇది దోపిడీ,అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచి వేయబడ్డ సామూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. దీని మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో,దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉన్నాయి.’ అని అన్నారు. ఈ అణచివేయబడ్డ సమూహంలోని అసమానతకు గురయ్యే వర్గం ఆ అసమానతకి వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కోసం పోరాడటం అనేది ఏ సమాజానికి అయినా ఒక చైతన్యవంతమైన చర్యగా చూడాలి. సామాజిక న్యాయ సాధన దిశగా జరిగే పోరాటంగా చూడాలి. అట్లా చూసినప్పుడు మాత్రమే ఇటీవల సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ చేయవచ్చు అని ఇచ్చిన తీర్పుని అర్థం చేసుకుంటారు స్వాగతిస్తారు.

ఈ దేశంలో వివక్షతకు గురైన  ఎస్సీ కులాల్లోనె ఎంతటి వివక్షను పాటిస్తారు అనేది దళిత వాడలను ఎరిగిన ఎవరికైనా సులభంగా అర్ధమైతది. ఈ వాస్తవాన్ని మరుగున పెట్టీ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు రాగానే( సుప్రీం కోర్టు అనవసరమైన కొన్ని వ్యాఖ్యల ద్వారా కొర్రీలు పెట్టీ, రిజర్వేషన్లు, దళిత వెనుకబడిన వర్గాల ప్రయోజనాల విషయం వచ్చేసరికి అవి అవలంబించే విధానాలు యెట్లా ఉంటాయో వ్యక్త పరిచినప్పటికి, చాలా కాలంగా రిజర్వేషన్లు పంపకాలు అనేవాటికి అడ్డుగా ఉన్న కొన్ని కంచేలను తొలగించి భవిష్యత్తు సామాజిక న్యాయ సాధనకు అవసరమైన ఒక దారి దొరికినట్టుగానే ఈ తీర్పును భావించాల్సి ఉంటుంది.)ఈ  తీర్పు అన్యాయం, దీని వల్ల దళితుల ఐక్యత దెబ్బతింటుంది అని గగ్గోలు పెట్టేవాళ్ళు కొందరైతే నిన్నటి వరకు సామాజిక చింతనా పరులుగా ఉన్నవాళ్లు,సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నాం అనే వాళ్ళు ఆ తీర్పు రాగానే వాళ్ళలో ఉన్న సంకుచితత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. చట్టసభల్లో మాలలకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టుకుంటున్నారు.

ఈ గగ్గోలు పెట్టుతున్న వాళ్ళందరికీ ముందుగా చిన్న ప్రశ్న. ఇప్పటికీ మాలల కంటే మాదిగలు తక్కువ అని మాల సమాజం భావిస్తున్నదా లేదా? మాదిగల పట్ల మాల సమాజం వివక్షను చూపిస్తున్నదా లేదా? చెప్పాలి. రెండవ ప్రశ్న ఏమిటంటే మాలలకు అన్యాయం జరుగుతుందని మట్లాడుతున్నవారు ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు మాట్లాడలేదు. కేవలం వర్గీకరణ అంశం ముందుకు వచ్చినపుడు మాత్రమే మాలలకు అన్యాయం జరుగుతుందని గుండెలు బాదుకోవడం దేనికని. ఏ సమాజంలో అయినా ఎక్కువగా ఫలాలు అనుభవించిన సమూహం వాటిని వదులుకోవడానికి అంత సులభంగా ఒప్పుకోవు. అందుకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అన్నపుడు వ్యతిరేకించిన అగ్రవర్ణ వ్యవస్థలన్నీ, మండల్‌ కమిషన్‌ ను వ్యతిరేకించిన అన్ని సందర్భాలలో ఇదే నిజమైంది.ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే సందర్భంలో మాలల నాయకులు అట్లానే మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు వర్గీకరణ ఉద్యమంలో ఉన్న సామాజిక న్యాయ భావనను సమర్ధించిన నాయకులు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇవ్వడం అంటే ఇప్పటిదాక వాళ్ళు సామాజిక న్యాయ భావనను మనస్పూర్తిగా కాక అవసరం రీత్యా సమర్ధించినట్టుగానే భావించాల్సి ఉంటుందేమో.

వర్గీకరణ వల్ల ఈ దళిత సమాజం చీలిపోతుంది.ఇది పాలకవర్గాల కుట్ర అని మాట్లాడుతూ చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు దళిత సమాజం మొత్తం పై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. వర్గీకరణ పాలక వర్గాల కుట్ర ఐతే అవవచ్చు కానీ దానివల్ల సామాజిక న్యాయం దక్కాల్సిన సమూహాలకు దక్కుతుందా లేదా? అనేది చూడాలి. ఒకవేళ వర్గీకరణ పాలకవర్గాల కుట్రే కావచ్చు.దళితులను వర్గీకరణతో విభజించి, అనైక్య పరుస్తారనీ భయమెవరికన్న ఉంటే అది ఉట్టి అపోహ మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో దళితులకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు ఇంకా ఎన్నో ఉన్నవి.వాటిని సాధించడానికి సోదరభావంతో ఒకరికొకరు కలిసి ఉమ్మడిగా ఉద్యమాలు చేసి దళితుల ఐక్యతను చాటుకోవచ్చు.

రాజకీయ రంగాలలో రాజ్యాంగంలో విధించిన పరిమితి మేరకే మాత్రమే సీట్లిచ్చి అన్ని పాలక వర్గాలు చేతులు దులుపుకుంటున్నారు. వారి వారి రిజర్వేషన్లు వరకే వారిని పరిమితం చేస్తున్నారు. నిజానికి వర్గీకరణ వల్ల మాలమాదిగల ఐక్యత పోతుందనుకునే నాయకులు దళిత వర్గాల ఐక్యత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో క్యాబినెట్‌ మంత్రిత్వ శాఖల్లో కూడా మా వాటా ప్రకారం మాకు మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని ఒక ఉమ్మడి ఉద్యమం తీసుకురండి. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, దేశ ప్రధానిగా వ్యక్తులను ఎన్నుకునేటప్పుడు రొటేషన్‌ పద్ధతిలో దళితులకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేయండి. దీని ద్వారా దళిత జాతి మొత్తాన్ని రాజ్యాధికారం దిశగా నడిపించవచ్చు. దళిత జాతి ఐక్యతను చాటవచ్చు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికోసమని కేటాయిస్తున్న అరకొర నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నవి ప్రభుత్వాలు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు కానీ ఇతరత్రా అభివృద్ధి పనులను చేయడానికి ప్రభుత్వాలు కేటాయించిన ఆ సబ్‌ ప్లాన్‌ నిధులలోనుండే ఖర్చు పెట్టీ ఎస్సీ ల అభ్యున్నతికి ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. దళితుల ఐక్యతను చాటుకోవాలంటే ఆ ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను సక్రమంగా వినియోగించేటట్టు ఐక్య ఉద్యమాలు చేసి ఐక్యతను చాటుకొవచ్చు.

రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల ఐక్యత దెబ్బతింటుంది,విభజన పెరుగుతుంది ఇంకేదో ఇంకేదో అయిపోతుందని గగ్గోలు పెట్టీ,గాభరా పడేవాళ్ళందరూ నిజంగా ఐక్యతను కోరుకునేటట్లైతే… ఈ దేశంలో రోజురోజుకి ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసేయడానికి కుట్రలు జరుగుతున్నవి.వాటిని అడ్డుకోవడానికి ఐక్య ఉద్యమాలు చేయవచ్చు. దేశంలో ఉన్నత విద్య మొత్తంగానే ప్రైవేటీకరణకు గురై ఆ విద్యాసంస్థల్లో ఏటువంటి రిజర్వేషన్లు అమలుచేయాలని నిబంధన లేదని ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలకు ఎర్ర తివాచీలు పరుస్తున్నవి. దీనివల్ల పరోక్షంగా దళిత కులాలు, వెనుకబడిన వర్గాలు ఉన్నత విద్యకు దూరం చేయబడుతున్న ప్రస్తుత సందర్భంలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని ఉద్యమం చెయ్యండి. దీని ద్వారా దళిత వర్గాల ఐక్యతనే కాదు మొత్తం బహుజన వర్గాల ఐక్యతను చాటుకోవచ్చు.

ఇంకా ఈ సమాజంలో ఉన్న ఉన్నత విద్యావంతులైన యువకులను చైతన్య పరిచి, జాతి ప్రయోజనాలకోసం పనిచేయడానికి సిద్దం చెయ్యడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే దళితుల ఐక్యతను మాత్రమే కాదు దళిత సమాజపు మేధో శక్తిని కూడా చూపించుకునే అవకాశం ఉన్నది. తద్వారా ఊరికే నినాదంగా ఇచ్చే రాజ్యాధికార సాధన అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి దళిత సమాజమే నాయకత్వం వహించే అవకాశం కూడా ఉన్నది.ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత సమాజం పాలక వర్గాల కుట్రలను ఛేదించి ఐక్యతను యెట్లా ప్రదర్శించవచ్చు అనేటివి చాలనే చెప్పవచ్చు.ఇవ్వాలా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే సామాజిక న్యాయ భావనను వ్యతిరేకించడం. అసమానతల సమూహంలోని అసమానతలను, వివక్ష ను చూడటాన్ని నిరాకరించడంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది.

ఈ వర్గీకరణను వ్యతిరేకించే వారందరూ రేపు సామాజిక న్యాయం దృష్టితో చూడకుండా ఐక్యత అనే పేరు వెనుక దాక్కొని ఎస్టీల వర్గీకరణను వ్యత్తిరేకించవచ్చు, బీసీ ల వర్గీకరణను వ్యతిరేకించవచ్చు. నిజానికి ఏ సామాజిక న్యాయ వర్గీకరణ వల్ల ఐక్యత దెబ్బతింటుందని మాట్లాడేవాళ్ళందరూ ఏ సమూహాలైతే అన్యాయానికి గురవుతున్నాయో ఆ సమూహాలతో న్యాయమైన పంపిణీ చేసుకొని ఇంకా దక్కాల్సిన రాజ్యాంగ ఫలాల కోసం ఉమ్మడిగా కలిసి కొట్లాడినప్పుడు మాత్రమే నిజమైన ఐక్యత సాధించగలుగుతారు. ఎస్సీ వర్గీకరణను మాత్రమే కాదు ఏ వర్గీకరణ అయినా ఉత్త పంపకాలుగా మాత్రమే చూడకూడదు. వివక్షా పూరితమైన , అసమానతకు గురవుతున్న సమూహాలలోనీ ప్రజలలోనే వివక్షకు గురవుతున్న సమూహాల సామాజిక న్యాయ కాంక్షగా చూసినప్పుడు మాత్రమే వర్గీకరణలో గల న్యాయమైన సూత్రాన్ని అర్థం చేసుకోగలుగుతారు.
 -దిలీప్‌.వి
మానవ హక్కుల వేదిక, 

సెల్‌: 8464030808

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page