ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 14 : రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతున్నది. మూడో రోజు శనివారం తెల్లవారుజామున లూథియానాలోని లాధోవల్ క్యాంప్ నుండి జలంధర్‌లోని గోరయా, ఫిల్లౌర్ వైపు సాగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడి పోయి అతి చల్లటి, పొగమంచుతో కూడిన వాతావరణంలో కూడా రాహుల్ గాంధీ మామూలుగా రోజూ వేసుకునే టీ-షర్ట్ ధరించి కనిపించారు. శుక్రవారం సాయంత్రం యాత్ర లాధోవల్ శిబిరంలో జరిగిన లోహ్రీ వేడుకల సందర్భంగా అమరిందర్ సింగ్ వారింగ్ పంజాబీ సాంద్రాయ నృత్యం భాంగ్రా నృత్యంతో అలరించారు. భోగి మంటల చుట్టూ ధోల్ దరువులపై డ్యాన్‌లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు తానూ పాల్గొన్నారు.
పాదయాత్రలో ఏఐసీసీ పంజాబ్ ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, లూథియానా ఎంపీ రవ్‌నీత్ బిట్టు, ఎంపీ మనీష్ తివారీ, ప్రతిపక్ష నేత పర్తాప్ సింగ్ బజ్వా, మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా, మాజీ మంత్రి ఎమ్మెల్యే కులదీప్ వైద్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు బారీ సంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర దోబా ప్రాంతానికి చేరుకున్న సందర్భంగా మాజీ మంత్రులు రాణా గుర్జిత్ సింగ్ మరియు పర్గత్ సింగ్ కూడా ఆయనతో కలిసి నడిచారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, రాహుల్ గాంధీ నడక వేగానికి అనుగుణంగా పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నాయకులు అతనితో సమానంగా అడుగులు వేయడానికి చాలా ఇబ్బంది పడడం కనిపించింది.
యాత్రలో విషాదం…గుండెపోటుతో కాంగ్రెస్ నేత చౌదరి సంతోష్ సింగ్ మృతి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో శనివారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. జలంధర్ లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు, కాంగ్రెస్ నేత చౌదరి సంతోష్ సింగ్ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని ఫిలౌర్‌లో రాహుల్ గాంధీతోపాటు పాదయాత్రలో నడుస్తుండగా ఈ విషాదం జరిగింది. ఆయన గుండె కొట్టుకునే వేగం పెరగడంతో అకస్మాత్తుగా అస్వస్థులయ్యారు. వెంటనే ఆయనను ఫగ్వారాలోని విర్క్ హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రాహుల్ గాంధీ యాత్రకు విరామం ఇచ్చి, చౌదరి సంతోష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన భైతికాయానికి అంజలి ఘటించారు. ఆయన అంత్యక్రియలు ముగిసే వరకు యాత్రకు విరామం ప్రకటించారు.