- పాలమూరు పచ్చబడుతుంటే ఏడుపు
- ముందు కృష్ణా జలాల్లో వాటా తేల్చండి
- పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి
- బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్
నారాయణపేట, ప్రజాతంత్ర, మే 9 : పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు పచ్చబడుతుంటే కొంత మంది కండ్లు ఎర్రబడుతున్నాయంటూ బీజేపీ నాయకత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతున్నాయని ఘాటుగా విమర్శించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే సుష్మా స్వరాజ్ ప్రకటించిన మాదిరిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…కృష్ణా జలాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని కొందరు పనికిమాలిన మాటలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా లెక్కలు చెప్తున్నా.. కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు మనకు కేటాయింపులు ఉండే. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతుంది.. అప్పట్నుంచి కేంద్రాన్ని అడుగుతున్నాం.. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల హక్కు ఇవ్వాలని, పంపకాలు తేల్చాలని అడిగాం. ప్రాజెక్టులు కట్టకుండా సతాయించిన జిల్లా పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాకు 575 టీఎంసీల నీటిని ఇవ్వండని 8 ఏండ్ల నుంచి కోరుతూనే ఉన్నాం.
స్వయంగా మోదీని కేసీఆర్ అడిగారు. అయినా ఉలుకుపలుకు లేదు. సెక్షన్ 3 కింద బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయాలని అడిగాం. దున్నపోతు వి•ద వానపడ్డట్టు ఉంది. ఉలుకు పలుకు లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాకు చేసిందేవి• లేకపోగా పాదయాత్రలు చేస్తూ పచ్చికారుకూతలు, పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. 299 టీఎంసీలకు సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని అబద్ధాలు చెబుతున్నారు. దమ్ముంటే, పలుకుబడి ఉంటే, మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. సుష్మా స్వరాజ్ హైదరాబాద్‌లో సభ పెట్టి పాలూమురుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.
మోదీకి చిత్తశుద్ధి ఉంటే సుష్మా మాట నిలబెట్టి.. పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న కర్ణాటకలోని తుంగభద్ర నదిపై ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇస్తరు. కానీ మేం అడిగితే వినబడనట్టు ముందుకు పోతరని అమిత్ షాను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమిత్ షాకు నీతి, నిజాయితీ, సిగ్గు లజ్జ ఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు కేటాయించి, వెంటనే పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తగ మాటలు చెప్పుడు కాదని అమిత్ షాపై కేటీఆర్ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో స్థానపికనేతులకూడా పాల్గొన్నారు.