త్వరలో హాస్పిటల్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం
పలు అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీష్ రావు శంఖుస్థాపన
వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంపటాన్చెరులో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. పటాన్‌చెరుతో పాటు సంగారెడ్డిలో నిర్మించిన వైద్య కళాశాలను సైతం అదే రోజు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, పటాన్‌చెరులో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. పటాన్‌చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడ నుండి కర్ధనూర్ ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు 121 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరుసల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రుద్రారం శ్రీ సిద్ధి గణపతి దేవాలయం ఆవరణలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన మూడు రాజగోపురాలు, నిత్య అన్నదాన సత్రం, కల్యాణ మండపం, 24 దుకాణాల సముదాయ నిర్మాణ పనులకు ఆయన శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ….పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కు ఒక చరిత్ర ఉందని, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు వ్యవసాయ మార్కెట్ కోసం టిఎస్‌ఐఐసికి చెందిన 14 ఎకరాల విలువైన భూమిని కేటాయించాలని సానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరిన వెంటనే.. సాయంత్రం లోపు భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, మలక్‌పేట్ ఉల్లిగడ్డ మార్కెట్‌ను ఇక్కడికి తరలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన బాయికాడి విజయకుమార్ మార్కెట్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పాశమైలారం పారిశ్రామిక వాడ పరిశ్రమలకు, కార్మికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా 121 కోట్ల రూపాయలతో ఓ ఆర్ ఆర్ జంక్షన్ వరకు నాలుగు వరసల బీటీ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ఓ ఆర్‌ఆర్ రహదారి గుండా అన్ని ప్రధాన నగరాలకు సులువుగా రవాణా చేయవచ్చని అన్నారు. రాష్ట్రంలోని పేరొందిన రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ది గణపతి దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.