పప్పు’గా మారిన రాష్ట్ర బిజెపి!

‘‘ఇటు రాష్ట్రంలో అధికార బిఆర్‌ఎస్‌, అటు కేంద్రంలోని అధికార బిజెపి, ఇద్దరిదీ ఒకటే భయం. రాహూల్‌ ‌గాంధీ. అతడిని ‘పప్పు’ గా హేళన చేసిన బిజెపి నేడు రాష్ట్రంలో తానే ‘పప్పు’గా మారడం ఒక విషాద పరిణామం. కానీ అది తెలంగాణకు ఎంతో ఉపశమనం.’’

– కందుకూరి రమేష్‌ ‌బాబు
భారతీయ జాతీయ పార్టీ తాజాగా తీసుకున్న మూడు కీలక నిర్ణయాలతో ఆ పార్టీ తక్షణం తెలంగాణాలో రాజకీయ ప్రాబల్యం పెంచుకునే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టిందని అంచనా వేయవచ్చు. కేంద్రంలో తమ అధికారాన్ని తిరిగి పదిలం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా ఆ పార్టీ ముందుకు పోవడం స్పష్టమైనట్టే. ఇది ఆ పార్టీకి తక్షణం ఆత్మహత్యా పూరిత చర్యే ఐనప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణాలో అధికారంలోకి రాకుండా దూరదృష్టితో ముందుకు వెళ్ళడంగా చూడాలి. రాష్ట్రంలో ఆ పార్టీ ఇదివరకు చేసిన గడబిడ సరేసరి. ఈ ఏడాది గడిస్తే, తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత గానీ కెసిఆర్‌ ‌గురించి, కవితపై పెట్టిన కేసుల గురించి తీరిగ్గా  ఆలోచిద్దాం అన్నట్లు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టు తెలుస్తోంది. ఆ విషయాలపై స్పష్టత రావడానికి మరికొంత కాలం ఆగాల్సిన పని కూడా లేదనే ఈ చిరు వ్యాసం.
అవును. భారతీయ జనతా పార్టీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు ఆ పార్టీకి రాష్ట్రం కన్నా దేశం ముఖ్యమని తేటతెల్లం చేస్తోంది. దేశంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి రాకుండా చూసుకోవడమే తమ అత్యవసర విధానంగా ఎంచుకున్నట్టు భావించవలసి వస్తోంది.
ఆ లెక్కన రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు తగ్గించుకునేందుకు గానూ మతతత్వ విష బీజాలు నాటి బలపడటం కన్నా, ‘కట్టర్‌ ‌బిజెపి’ వైఖరి ప్రాచుర్యంలోకి తేవడం కన్నా ‘సాధారణ బిజేపి’గా ముందుకు పోవడమే శరణ్యంగా ఎంచుకున్నట్లు తాజా నియామకాలతో తెలుస్తోంది.
ఇప్పటిదాకా బిజెపి పార్టీ దూకుడు పెంచేందుకు ఎంచుకున్న బండి సంజయ్‌ ‌స్థానంలో ‘కర్ర విరగదు పాము చావదు’ అన్న విధానానికి సరిపోయే నాయకుడిని ఎంచుకుంది. ఎవరితోనూ అస్సలు ‘లొల్లి పెట్టుకోని’ వాడిగా పేరున్న వ్యక్తిని, మితవాద రాజకీయాలకు సరిపోయే కిషన్‌ ‌రెడ్డిని నియమించింది. ఆయన బండి సంజయ్‌ ‌మాదిరిగా కెసిఆర్‌ ‌పై దూకుడు విధానాన్ని ఎంచుకోవడం కలలో కూడా జరగదని, అంతకన్నా ముఖ్యం కెసిఆర్‌ ‌గారితో సఖ్యతతో ముందుకు పోయే వ్యక్తే అని అందరికీ తెలిసిందే.
ఇక, ఈటల రాజేందర్‌. ‌వారిని ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మెన్‌గా నియమించడం అన్నది తాత్వికంగా ఆ పార్టీ భావజాల విస్తృతి కన్నా ఎన్నికల వ్యూహం అనే చెప్పాలి. వారినే కాకుండా కొత్తగా వచ్చి చేరిన బీజెపి యేతర నాయకులను పార్టీ నుంచి వెళ్ళిపోకుండా చూసుకునేందుకు చేసిన కట్టుదిట్ట ఏర్పాటుగా కూడా దీన్ని చూడాలి. అలాగే, వారి ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికలకు వెళ్ళడం అంటే బిజెపి అన్నది ‘మితవాద బిజెపి’ రూపంలో చూపించే ప్రయత్నంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, నిన్నటిదాకా ఊపు మీదున్న ఆ పార్టీని ఇక నుంచి ఒక పరిమిత రాజకీయ క్రీడకు పరిమితం చేయడంగానే చూడాలి. అంతేగాక సిద్ధాంత భూమికతో నడిచే ఆ పార్టీకి ఆయన బలం కాదు, బలహీనత అని ఆ పార్టీకీ బాగా తెలుసు. ఎన్నికల సరళిలో కలిసి వచ్చిన మనిషిగా కెసిఆర్‌ ‌వ్యూహాలు తెలిసిన వ్యక్తిగా ఆయనపై ప్రయోగించడంగా చూపుతున్నారు. కానీ అతడు కెసిఆర్‌ ‘‌గోడకు కొట్టిన బంతి’ వంటి వారే. అది తిరిగి వచ్చే వేగం, ఆ కొట్టిన వేగంతోనే ముడిపడి ఉంటదని అందరికీ తెలుసు. నిజానికి తనను కెసిఆర్‌ ఎం‌తో చాకచక్యంగా అటు కాంగ్రెస్‌ ‌వైపు పోకుండా బిజెపి శిబిరంలోకి త్రోసి వేయడం మొన్నటిదాకా చూసిందే. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరడం అన్నది కూడా నేటి నుంచి ఆ పార్టీ ఎన్నికల చట్రంలో ‘ఉత్త’ ద్వంద్వ యుద్ధం చేపించడమే. పేరుకు అతడి  నాయకత్వంలో, కానీ అంతా కెసిఆర్‌ ‌నిర్దేశించిన రీతిలో, వారి కనుసన్నల్లో చేయడానికి ముందుస్తు ప్రణాళికలో భాగంగా జరిగిన ఏర్పాటే. ఆ సంగతి గత కొన్ని నెలల పరిణామాలను లోతుగా గ్రహిస్తే ఎవరికైనా బోధపడుతుంది. తాజాగా ఈటలకు సెక్యూరిటీ కూడా తానే అరేంజ్‌ ‌చేసి అతడి ప్రతి అడుగు ప్రభుత్వం తెలుసుకోవడానికి వీలుగా చూసుకోవడాన్ని కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. తనను చంపడానికి కౌశిక్‌ ‌రెడ్డి కుట్ర చేసాడని ఈటల ఆరోపించినప్పటికీ, అదే ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం అంటే ఈ హత్యా, ఆత్మహత్యా రాజకీయాలన్నీ బిజెపి పార్టీని నిర్జీవం చేయడానికే అని లోతుగా పరిశీలిస్తే బోధపడుతాయి.  చిత్రమేమిటంటే, ఆటలో పావులుగా మారిన వారు అందుకు తలొగ్గి ఆడటం. ఆ వైచిత్రి గమనిస్తే, ఎన్ని విమర్శలున్నా కెసిఆర్‌ ‌చతురతకు ప్రశంసలు దక్కుతాయి.
బిజెపి తీసుకున్న ఈ నిర్ణయాల ద్వారా ఇక కాంగ్రెస్‌ ‌పార్టీ జోరు ఎంతలేదన్నా పెరగడం ఖాయం. ఐతే, బిజెపి వ్యూహం ప్రకారం రేపు కాంగ్రెస్‌ ‌పార్టీ పోటీ చేసే స్థానాల్లో బిజెపి ‘తలపడుతుంది’ గానీ అది సాధించే రెండు మూడు స్థానాలు లేదా అతిశయోక్తి అనుకోకపోతే పది సీట్లు అనుకున్నా, అంతకన్నాముఖ్యం- మిగతా అన్ని స్థానాల్లో బేషుగ్గా కాంగ్రెస్‌ ‌వోట్లను చీల్చి బిఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలో కూర్చోబెట్టడమే అని సులభంగా బోధపడుతోంది. అదే బిజెపి నూతన నియామకాల అంతిమ సారాంశం. ఈ విషయాలు అర్థమై బిజెపి శ్రేణులే కాకుండా ఆ పార్టీ సానుభూతి పరులు తీవ్ర ఆందోళన చెందుతుండటం సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం.
మొత్తంగా ఈ మూడు మార్పులను ఎలా చూడాలంటే ఆ పార్టీకి ఈ చర్యల ఫలితం ఒక రకంగా రాష్టంలో ‘ఆత్మహత్య’గా చెప్పాలి. లేదంటే ‘దేశ’ రక్షణ కోసం బలిదానం చేసుకున్నదనే పేర్కొనాలి. అంటే కెసిఆర్‌ ‌రాజకీయ క్రీడలో భాగంగా చూస్తే, ఇది ఒక విధంగా ‘హత్య’గా కూడా చెప్పుకోవచ్చు. ‘ఆత్మ రక్షణాత్మక హత్య’గా చూడాలి. ఐతే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకునేవారికి కూడా కేంద్ర బిజెపి పోకడ మింగుడు పడటం లేదు.
‘ఆత్మహత్య’ అనండి లేదా ‘హత్య’ అనండి, రాష్ట్రంలో తమ తొలి ప్రాధాన్యం బిజెపి పార్టీ బతికి బట్ట కట్టడం లేదా బలపడటం కన్నా కాంగ్రెస్‌ ‌పార్టీ పునరుజ్జీవం పొంది అధికారంలోకి రావొద్దన్నదే మూలం అని గ్రహించాలి. నిజానికి ఈ ధోరణి అటు బిజెపి, ఇటు బిఆర్‌ఎస్‌ ‌పార్టీలకు, ఇద్దరి ప్రయోజనాలకు ఉభయ తారకంగా ఉపకరించే విధానమే. అందుకే తాజాగా కవిత అరెస్టు గానీ, అంతకుముందు బిజెపి నేతలు ఆరోపించినట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి గానీ చేపెట్టే చర్యలేవీ ఇకముందు ముందుకు సాగకపోవచ్చు. ‘చట్టం తనపని తాను చేసుకుపోవడం’ అన్నమాట ఉండనే ఉన్నది. అదే ఇకముందు చెలామణిలోకి రావొచ్చు.
ఏమైనా, ఈ ఎత్తుగడ అంతా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా చూడటం తెలంగాణకు పరిమితమైన అంశం ఐతే,  దేశంలో కూడా ఆ పార్టీని అధికారానికి సమీప దూరంలోకి రాకుండా చూసుకోవడం అంతకు మించిన అంశంగా మారింది. చిత్రమేమిటంటే, ఈ మొత్తం ఎత్తుగడ బిజెపి బలం కాదు, బలహీనతయే. అందుకు కారణం రోజు రోజుకూ బలపడుతున్న రాహూల్‌ ‌గాంధీయే. అతడి ‘ప్రభ’ – ‘ఇంతితై వటుడింతై అన్నట్టు’ పెరుగుతుండటం వారి స్ట్రాటజీలో ముఖ్యం కావడం, అందువల్లే తెలంగాణాలో బిజెపి దూకుడు నాయకత్వాన్ని ‘రిట్రీట్‌’ ‌చేయడంగా చూడాలి.
గమ్మత్తేమిటంటే, రాహుల్‌ ‌గాంధీని ‘పప్పు’ గా హేళన చేసిన బిజెపి నేడు ఒక రాష్ట్రంలో తానే ‘పప్పు’గా మారడం. నిజానికి ఇది విషాద పరిణామమే. కానీ అది తెలంగాణకు ఎంతో ఉపశమనం. ఇక్కడ మతతత్వ శక్తులు నిర్లజ్జగా వివిధ రూపాల్లో విస్తరించకుండా ఉండేందుకు, ప్రజాస్వామిక జీవనం చెల్లా చెదురు కాకుండా చూసుకునేందుకు ఒక ఏడాది పాటైన దొరికిన విరామంగా చూడాలి. ఐతే ఈ సయోధ్య ఒక ఎత్తుగడ అన్నది గ్రహించి, ఈ రెండు పార్టీల వైఖరిని ప్రజల్లోకి కాంగ్రెస్‌ ‌బలంగా తీసుకెళ్ళకపోతే ఆ పార్టీ అందివచ్చిన బంగారు అవకాశాన్ని చేజేతులా నష్టపోతుంది. ఒక రకంగా రేవంత్‌ ‌రెడ్డి ఇక్కడే కాంగ్రెస్‌ ‌పార్టీని సమైక్యంగా ఉంచడంతో పాటు కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి భిన్నమైన ప్రభుత్వాన్ని తామేట్లా స్థాపిస్తారో చెప్పుకోవడంపై దృష్టి పెట్టాలి.
నిజానికి బిజెపి భయపడినట్లే, రాహూల్‌ ‌గాంధీ క్రమేణా బలపడుతున్నాడు. మొన్న బెంగుళూరులో మాదిరిగా నేడు తెలంగాణాలో బలం పుంజుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను గనుక ఇలాగే చూస్తూ ఉంటే రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం కావడం ఏమోగానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. అది అంతిమంగా కేంద్రానికే ప్రమాదం. అందుకే కెసిఆర్‌ ‌మరోసారి అధికారంలోకి వచ్చినా మంచిదే గానీ కాంగ్రెస్‌ ఏలుబడిలోకి రానేకూడదు అని వ్యూహం మలుచుకున్నారు. అందులో బలిపశువు ఒక్క బండి సంజయ్‌ ‌మాత్రమే కాదు, కిషన్‌ ‌రెడ్డి, ఈటల కూడా అని చెప్పక తప్పదు.
ఏది ఏమైనా బిజెపి స్పష్టంగా ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఓట్లు చీల్చే యంత్రంగా తెలంగాణాలో రాష్ట్ర బిజెపిని కేంద్రం నూతన నాయకత్వంతో మోహరిస్తోంది. అది నిజానికి వారి దూరదృష్టి. రేపు ఎన్నికలు అయ్యాక అవసరం ఐతే కెసిఆర్‌ని మళ్ళీ ఇరుకున పెట్టడానికి చాలినంత సమయం ఉంటుంది. ఇప్పుడు మాత్రం వారికి అతడే కావాలి. కెసిఆర్‌ ‘‌శ్రీరామ రక్ష’.
అందుకే అనడం, ఇవన్నీ అటు కేంద్ర బిజెపి, ఇటు బిఆర్‌ఎస్‌ ‌పార్టీలు ఇరువురి మధ్య సయోధ్యగా బిజెపి పార్టీని నామ మాత్రంగా మార్చడానికి జరిగిన ఒడంబడిక అని, ఈ పరిణామాలూ ఒక రకంగా కాంగ్రెస్‌ ‌కు మంచివని. ఇక్కడే  మరో మాట చెప్పాలి. గత కొన్నేళ్లుగా ‘లేని బిజెపి’కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన కెసిఆర్‌కు – నిజానికి ‘ఉన్నా లేనట్లు’ చూసిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు నిజమైన శత్రువు. దాన్ని ఎదుర్కోవడానికి బిజెపి, బిఆర్‌ ఎస్‌ ‌లు ఇద్దరూ గనుక ముందు పేర్కొన్నట్టు ఒక్కటైనప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ మరింత వ్యూహాత్మకంగా పోక తప్పదు.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాల వల్ల మరో అసక్తికరమైన మలుపు చెప్పుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో నిన్నటి దాక ఎగిరెగిరి దుంకిన బిజెపి మద్దతుదారులు, హిందూ మతోన్మాదులు, అంతకన్నా ముఖ్యం – బిజెపి సోషల్‌ ‌మీడియా ఆర్మీ ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడటం. వారికి తక్షణం ఏం చేయాలో పాలుపోవడానికి కాస్త సమయం పడుతుంది.
ఏమైనా ఈ పరిణామాల కారణంగా మతాల మధ్య విద్వేషం నూరిపోసే విధానాలు ఇక ముందు రాష్ట్రంలో అనివార్యంగా తగ్గుముఖం పడుతాయని మాత్రం చెప్పవచ్చు. ఆ కొద్దికాలంలో ప్రజలు మేలుకుంటే మరింత ఆరోగ్యకరమైన సుదీర్ఘ భవిష్యత్తును నిర్మించుకోగలరు. కొంతలో కొంత ఉపశమనం అంటే ఇదే.
(వ్యాసకర్త ఇండిపెండెంట్‌ ‌జర్నలిస్ట్)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page