‘‘ భారతదేశం 2022 డిసెంబరు 1న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతర-ప్రభుత్వ సహకార వేదిక జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. భారత అధ్యక్ష బాధ్యతలపై.. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుండగా, భారీ మాంద్యం ముప్పు కమ్ముకుంటున్న తరుణంలో ప్రపంచం అనేక ఆశలు, కలలు, ఆకాంక్షలు పెట్టుకుంది. మరోవైపు భూతాపం పెరుగుదల, వాతావరణ మార్పుల పెనుసవాళ్లు ఎన్నడూ లేనంతగా భయపెడుతున్నాయి. ఇలాంటి అత్యంత ఆందోళనకర సమస్యలలో కొన్నింటికి ప్రపంచం అత్యవసర పరిష్కారాలు అన్వేషిస్తోంది.’’
భారతదేశం 2022 డిసెంబరు 1న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతర-ప్రభుత్వ సహకార వేదిక జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. భారత అధ్యక్ష బాధ్యతలపై.. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుండగా, భారీ మాంద్యం ముప్పు కమ్ముకుంటున్న తరుణంలో ప్రపంచం అనేక ఆశలు, కలలు, ఆకాంక్షలు పెట్టుకుంది. మరోవైపు భూతాపం పెరుగుదల, వాతావరణ మార్పుల పెనుసవాళ్లు ఎన్నడూ లేనంతగా భయపెడుతున్నాయి. ఇలాంటి అత్యంత ఆందోళనకర సమస్యలలో కొన్నింటికి ప్రపంచం అత్యవసర పరిష్కారాలు అన్వేషిస్తోంది.
ఈ నేపథ్యంలో అందరికీ సుస్థిర భవిష్యత్ దిశగా ప్రపంచ సహకారం కొత్త రంగాల్లో పాదం మోపుతుండగా, మునుపటి అధ్యక్షుల కృషి, ఫలితాలను మరింత ముందుకు తీసుకెళ్లడం భారత అధ్యక్ష బాధ్యత లక్ష్యం. ఈ మేరకు ‘ఒక భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ లేదా ‘వసుధైవ కుటుంబకం’ ఇతివృత్తమే తారకమంత్రంగా మనదైన ‘ఒకే భూగోళం’ స్వస్థత దిశగా మన ‘ఒక కుటుంబం’లో సమన్వయ సృష్టికి, మనదైన ‘ఒకే భవిష్యత్తు’ నిర్మాణంపై ఆశలకు ఊపిరి పోసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం.
భారత్ ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 17 శాతానికి నెలవైనప్పటికీ వృద్ధి నిర్వహణకు సమానన స్థాయిలో వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడంలో మన కృషి అనిర్వచనీయం. భారతదేశంలో (2019నాటికి) తలసరి ఉద్గారాలు 2.46 టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్ ((tCO2e) ) సమాన స్థాయిలో ఉన్నాయి. ఇది మొత్తం ప్రపంచ తలసరి సగటు 4.79 టన్నులలో సగం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టే 2022 వాతావరణ మార్పు పనితీరు సూచీ (సిసిపిఐ) ప్రకారం అత్యుత్తమ సామర్థ్యం కనబరిచే 5 దేశాల జాబితాలో స్థానం పొందాం.
అలాగే స్వల్ప కర్బన ఆర్థిక వ్యవస్థవైపు ప్రపంచ పరివర్తనకు భారత్ నాయకత్వం వహిస్తోంది. తదనుగుణంగా శిలాజేతర ఇంధన సామర్థ్యం జోడింపుపై జాతీయ నిర్దేశిత హామీల (ఎన్‌డిసి)లో 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎంతో ముందుగానే సాధించి, కొత్త లక్ష్యాలతో హామీల జాబితాను సవరించుకుంది. ఈ నవీకృత ‘ఎన్‌డిసి’ ప్రకారం- జీడీపీ ఉద్గార తీవ్రతను 2005 స్థాయినుంచి 2030కల్లా 45 శాతానికి తగ్గించగలమని భారత్ ప్రకటించింది. దీంతోపాటు ప్రస్తుతం అన్నిరకాల వనరుల ఆధారిత విద్యుదుత్పాదన స్థాపిత సామర్థ్యంలో 50 శాతాన్ని 2030కల్లా శిలాజేతర వనరుల నుంచి సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.
దేశంలో యువ జనాభా, పెరుగుతున్న పట్టణీకరణ, డిజిటలీకరణ-సాంకేతిక పరిజ్ఞానాలకు పెద్దపీట, తామరతంపరగా అంకుర సంస్థల ఆవిర్భావం వగైరాల నేపథ్యంలో అందరికీ సుస్థిర, సౌలభ్య విద్యుత్తు సరఫరాపై భారత్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో అనేక సమస్యలను అధిగమించడంలో భారత్ గణనీయ పురోగతి సాధించింది. కాబట్టే కొన్నేళ్ల కిందటి లోటు పరిస్థితి నుంచి మనం నేడు మిగులు విద్యుత్ స్థాయికి చేరుకున్నాం. తదనుగుణంగా సమీకృత జాతీయ గ్రిడ్ ఏర్పాటుసహా పంపిణీ నెట్‌వర్క్ బలోపేతం చేశాం. పునరుత్పాదక శక్తిలో కీలక పాత్రధారిగా ఆవిర్భవించాం… సార్వత్రిక గృహ విద్యుదీకరణ లక్ష్యం సాధించాం.
భారత ఇంధన సమ్మేళనం వైవిధ్యభరితం. ఈ మేరకు బొగ్గు, లిగ్నైట్, సహజ వాయువు, చమురు, జల-అణుశక్తి వంటి అనేక వనరుల ద్వారా విద్యుదుత్పాదన చేస్తాం. పునరుత్పాదక వనరులైన సౌర, పవన, జీవద్రవ్యాల పాత్ర కూడా క్రమంగా పెరుగుతోంది. కొత్త సాంకేతికత, ఆవిష్కరణలతో పరిశుభ్ర విద్యుదుత్పాదన చేయగల సామర్థ్యం పెంచుకోవడంపై ప్రభుత్వం ఇప్పుడు నిశితంగా దృష్టి కేంద్రీకరించింది. ఇక 2026 నాటికి కొత్త ఉత్పాదక సామర్థ్యం రెట్టింపు కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగం వేగంగా పెరుగుతోంది. భారత విద్యుదుత్పాదన సమ్మేళనంలో సౌర, పవన వనరుల వాటా అనూహ్య స్థాయిలో పెరిగింది. అంతేగాక ప్రపంచంలోని అతిపెద్ద ఆధునిక జీవ ఇంధన ఉత్పాదక దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి.
హరిత ఉదజని ఆర్థిక వ్యవస్థను కర్బనరహితం చేయడంలో కీలక పాత్రసహా ఉత్పత్తి-ఎగుమతులకు ప్రపంచ కూడలిగా మారాలని లక్ష్య నిర్దేశం చేసుకుంది.ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పునరుత్పాదక (ఆర్‌ఇ) సామర్థ్యంగల దేశంగా భారత్ ఆవిర్భవించింది. తద్వారా ఈ రంగంలో అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యంగానూ మారింది. ప్రస్తుత కృషితో భారత్ స్వీయ అవసరాలు తీర్చుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రయత్నాలకు తోడ్పాటునిస్తోంది. ఒకవైపు వస్తూత్పత్తుల ధరలు పెరగడం, మరోవైపు కఠిన మార్కెట్ పరిస్థితులతో ఇంధన భద్రత ముప్పు పెరగడం వంటి పరిణామాలు సరసమైన ధరతో ఇంధన లభ్యత కల్పనకు సవాలు విసురుతున్నాయి.
ఈ పరిస్థితుల నడుమ విధానపరమైన చర్యలు-ఉపశమనాలపై దృష్టి కేంద్రీకరించడం ముఖ్యం. అయితే నిర్దిష్ట/గణనీయ మార్పు దిశగా వ్యక్తులు, సమాజాలపై దృష్టి పెట్టడం అత్యవసరం. స్వచ్ఛ భారత్ అభియాన్, ఉజ్వల పథకం లేదా సబ్సిడీ త్యాగం (గివ్ ఇట్ అప్) వంటి కార్యక్రమాలతో భారీ సమష్టి కార్యాచరణ ద్వారా అభివృద్ధిని ముందుకు నడిపించడం, సామాజిక-ప్రవర్తనాత్మక మార్పులు సాధించడంలో భారత్ గణనీయ విజయం సాధించింది. మరోవైపు 2021లో కాప్26 సందర్భంగా గ్లాస్గోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ప్రపంచ ఉద్యమం- ‘లైఫ్’ లేదా ‘పర్యావరణం కోసం జీవనశైలి’ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ సర్వసన్నద్ధంగా ఉంది.
ఈ మేరకు అంతర్జాతీయ సామూహిక ఉద్యమంగా దీన్ని నడపాలని/నిర్మించాలని వ్యక్తులు, సమాజాలకు ఈ కార్యక్రమం పిలుపునిచ్చింది. పర్యావరణ రక్షణ-సంరక్షణ దిశగా ‘అవివేక-ఆత్మ విధ్వంసక’ వినియోగం కాకుండా ‘వివేకం-విచక్షణనాత్మక’ వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని ఉద్బోధిస్తోంది. భూమాతకు హాని కలిగించడంగాక ప్రకృతితో సమరస జీవనం గడపాల్సిన కర్తవ్యం వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రతి ఒక్కరిపైనా ఉందని ‘లైఫ్’ స్పష్టం చేస్తోంది.
ఇక 140 కోట్లకుపైగా జనాభాతో పురోగమిస్తున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అనుసరిస్తున్న వాతావరణహిత, ఉపశమన విధానాలు దేశానికి మాత్రమేగాక మొత్తం భూగోళానికే పరివర్తనాత్మకం కాగలవు. ఏ దేశమైనా తన అవసరాలు, తదనుగుణ వనరుల వినియోగంలో సద్వివేచనతో వ్యవహరిస్తే ముందడుగు వేయడం సాధ్యమేనని పునరుత్పాదక శక్తివైపు మళ్లడంలో భారత్ సాధిస్తున్న అద్భుత పురోగతి రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలో అందరికీ సుస్థిర భవిష్యత్తు నిర్మించే దిశగా సభ్యదేశాల మధ్య ధర్మకర్తృత్వ భావనను భారత జి-20 అధ్యక్షత ప్రోది చేస్తుంది.. పంచుకుంటుంది.. నిర్మిస్తుంది.
– కేంద్ర విద్యుత్-ఎంఎన్‌ఆర్‌ఇ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్