వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనము బాగున్నట్లేనని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన సర్పంచులు, పాలకవర్గానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ-2023 కింద జిల్లా స్థాయి అవార్డుల సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి పని చేసినట్లయితే ప్రజలనుండి గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుందన్నారు. మంచి పనులు చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ప్రజలకు మంచి సదుపాయాలు కల్పించే విధంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల అభివృద్ధి సమగ్రమైనదిగా ఉండాలని ఆ దిశగా వేగాన్ని తగ్గించకుండా ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకునేలా అలాగే వాటిని వాడుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. రోడ్లపై మురుగునీరు చేరడం వల్ల దోమల వ్యాప్తితో అంటు వ్యాధులు సోకకుండా, దుర్వాసన వెదజల్లకుండా ఉండేందుకు వీలుగా వ్యక్తిగత ఇంకుడు గుంతలు తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని అదేవిధంగా అవసరాలను బట్టి సామూహిక ఇంకుడు గుంతలను ఏర్పాటుచేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ ను నిషేధించే దిశగా గ్రామపంచాయతీలు పనిచేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని 12 గ్రామపంచాయతీలు జిల్లాస్థాయి, పరిగి మండలం రాఘవాపూర్ రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కింద ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎన్నికైన సర్పంచులకు, పాలకవర్గాలకు కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కింద ఎంపికైన గ్రామపంచాయతీలు వికారాబాద్ మండలం పులిమామిడి, ద్యాచారం లు, మోమిన్ పేట్ – ఎన్కేతల , చీమలదరి లు, కొడంగల్ – రుద్రారం, బంట్వారం – తోర్మామిడి , కుల్కచర్ల – బండి వెనకచర్ల, నవాబ్ పేట్ – ఎల్లకొండ, దోమ – దాదాపూర్, పూడూరు – మిర్జాపూర్ గ్రామపంచాయతీలు జిల్లాస్థాయి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కింద ఎంపిక కాగా పరిగి మండలం రాఘవపూర్ గ్రామపంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం జరిగింది.ఈ సన్మాణ కార్యక్రమంలో డిపిఓ తరుణ్ కుమార్, డిఆర్డిఓ కృష్ణన్, జెడ్పి ఇన్చార్జ్ సీఈవో సుభాషిని, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.