చంద్రబాబుకు కొమ్ముకాయడమే తెలుసు: ధర్మాన
శ్రీకాకుళం,జనవరి13 :పవన్ సీజనల్ పొలిటీషియన్ అని, యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా అని ప్రశ్నించారు. పుస్తకాలు చదవడం కాదని.. ఆ గొప్పవారి భావజాలం పవన్‌లో కనిపించాలన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న రియల్‌ఎస్టేట్‌ను పవన్ సమర్థిస్తున్నారని విమర్శించారు. పవన్ ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
నిజాయితీ ఉన్న నేతలకు మద్దతు ఇస్తామని చెబుతున్నారని, అవినీతిపరుడైన చంద్రబాబును సమర్థించి నీతులు చెబుతావా అంటూ నిలదీశారు. పవన్ కల్యాణ్‌కు ఒక స్టాండ్ లేదని, తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారో పవన్ ఆలోచించాలని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల పన్నులన్నీ తీసుకువెళ్లి అమరావతి అభివృద్ధి చేస్తామంటే ఈ ప్రాంత వ్యక్తిగా తాను అంగీకరించని ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ అమరావతిలోనే పెట్టుబడి పెడతారన్నారు. ఒకవేళ అదే జరిగితే విశాఖ కేంద్రంగా తమకు ప్రత్యేక రాష్ట్రం అడుగుతామన్నారు. తాను సైనికుల భూములు కబ్జా చేశానంటున్నారని.. తాను భూమి కబ్జా చేశానని ఏ సైనికుడైనా చెప్పారా అని ధర్మాన ప్రశ్నించారు.