- ఇది కొత్త అవకాశాల నుండి ప్రయోజనం పొందే సమయం
- జమ్ము కాశ్మీర్ ప్రతి భారతీయుడికి గర్వకారణం
- ‘రోజ్‌గార్ మేలా’లో జమ్ము కాశ్మీర్ యువతకు ప్రధాని మోదీ సూచన
న్యూ దిల్లీ, అక్టోబర్ 30 : జమ్మూ కాశ్మీర్ ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది పాత సవాళ్లను విడిచిపెట్టి, కొత్త అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన సమయమని అన్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్ రోజ్‌గార్ మేలాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడుతూ…వేగవంతమైన అభివృద్ధికి కొత్త విధానంతో, కొత్త ఆలోచనతో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని 20 వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వంలో పనిచేయడానికి నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువకులను ప్రధాని మోదీ అభినందించారు. అభివృద్ధి ప్రయోజనాలను అన్ని వర్గాలు మరియు పౌరులకు సమానంగా అందజేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రతి భారతీయుడికి గర్వకారణమని, మనందరం కలిసి జమ్మూ కాశ్మీర్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.
నియామక పత్రాలు పొందిన యువత పీడబ్ల్యూడీ, ఆరోగ్య శాఖ, ఆహార, పౌరసరఫరాల శాఖ, పశుసంవర్ధక, జలశక్తి, విద్య-సంస్కృతి వంటి వివిధ విభాగాల్లో సేవలందించే అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఇతర శాఖల్లో 700కు పైగా నియామక పత్రాలను అందజేసేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రధాని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని, మౌలిక సదుపాయాల కల్పన, పెరిగిన కనెక్టివిటీ కారణంగా రాష్ట్రంలో పర్యాటక రంగం ఊపందుకుందని తెలిపారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చేయడమే తమ ప్రయత్నమని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో రెండు కొత్త ఎయిమ్స్, ఏడు కొత్త మెడికల్ కాలేజీలు, రెండు రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు, 15 నర్సింగ్ కాలేజీల ప్రారంభంతో ఆరోగ్యం మరియు విద్య సంబంధించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. రైళ్ల ద్వారా కాశ్మీర్‌కు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జమ్మూ-కాశ్మీర్ ప్రజలు ఎల్లప్పుడూ పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తారని ప్రభుత్వ సేవల్లోకి వొస్తున్న యువత కూడా దీనికి ప్రాధాన్యతనివ్వాలని కోరారు.
తాను ఇంతకుముందు జమ్మూ-కాశ్మీర్ ప్రజలను కలిసినప్పుడల్లా వారి బాధను అనుభవించానని, ఇది వ్యవస్థలోని అవినీతి బాధ అని, జమ్మూ కాశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మరియు ఆయన టీమ్ అవినీతిని నిర్మూలించడానికి చేసిన విశేష కృషిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.