ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామపంచాయతీలకు ప్రతి ఒక్కరు సహకరించి ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. శుక్రవారం కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో హైదరాబాద్ – శ్రీశైల ప్రధాన రహదారి వెంట గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి పరిశీలించారు. రహదారుల గుండా ఉన్న ప్లాస్టిక్ ను సిబ్బంది సహాయంతో సేకరించారు. ఈ సందర్భంగా రహదారుల గుండా ప్లాస్టిక్ వేయరాదని వ్యర్ధాలను రోడ్ల వెంట వేయడం వలన తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వ్యర్ధాలను రోడ్ల వెంట వేసిన వారికి గ్రామ పంచాయతీ తరపున జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. జాతీయ రహదారులలో నిర్వహించే పారిశుద్ధ్య నిర్వహణ పనులు గ్రామపంచాయతీలకు పెనుబారంగా మారాయని తెలిపారు. గ్రామంలో అంతర్గత రోడ్ల వెంట ఉన్న వ్యర్ధాలను సిబ్బంది సాయంతో తొలగించారు. గ్రామ ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది మరియు కార్యదర్శి రాఘవేందర్ వార్డు సభ్యులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.