పార్టీ మారిన వారికి పరాభవం

  • పన్నెండులో పది మంది ఓటమి
  • ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో ఉన్న నలుగురూ ఓటమి
  • గెలిచిన వారిలో 15 మంది డాక్టర్లు

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 : గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి, నాడు అధికారంలోకి వొచ్చిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) పార్టీలోకి చేరిన శాసన సభ్యులను ప్రజలు ఆదరించలేదనడానికి ఆదివారం వెలువడిన రాష్ట్ర  ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. నాడు కాంగ్రెస్‌లో పద్దెనిమిది మంది ఎంఎల్యేలు గెలుపొందగా వారిలో పన్నెండు మంది ఒక్కసారే కట్టకట్టుకని బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోయారు. వారిలో కొందరు మంత్రి పదవులు అలంకరించగా, మరికొందరు వివిధ హోదాల్లో ప్రభుత్వంలో చెలామణి అయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2018లో రెండవసారి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్‌నే ప్రజలు ఆదరించారు. ఆనాడు 88 స్థానాల్లో ఆ పార్టీని తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ నుండి గెలిచినవారిని కూడా బిఆర్‌ఎస్‌ అక్కున చేర్చుకుంది.

అయితే కష్ట కాలంలో పార్టీని వదిలిపెట్టినవారిని తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానించేది లేదని ఆ తర్వాత కాలంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా వారిని రానున్న ఎన్నికల్లో ఓడిరచి తీరుతామని ప్రకటించారు. అన్నట్లుగానే ఆనాడు పార్టీ ఫిరాయించిన పన్నెండుగురిలో ఇద్దరు మినహా మిగతా వారంతా ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. మహేశ్వరం నుండి బిఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీచేసిన మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌ ఎంఎల్‌ఏ సధీర్‌రెడ్డిలు ఈ ఎన్నికల్లో గెలిచినవారిలో ఉన్నారు. కాగా ఓటమి చవిచూసిన వారిలో ఎల్లారెడ్డి ఎంఎల్‌ఏ జాజుల సురేందర్‌, తాండూరులో పైలెట్‌ రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్దన్‌ రెడ్డి, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, ఇల్లందులో హరిప్రియా నాయక్‌, ఆసిఫాబాద్‌కు చెందిన అత్రం సక్కు, పాలేరు ఎంఎల్‌ఏ ఉపేందర్‌రెడ్డి ఓటమి పాలైనవారిలో ఉన్నారు. దీంతో రేవంత్‌ రెడ్డి పంతం కూడా నెగ్గినట్లైంది. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఎంఎల్యేలు తమ పార్టీ ఓటమిపాలు కావడంతో పార్టీ ఫిరాయింపుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అయిదేళ్ళ కాలంలో బిఆర్‌ఎస్‌లో ఎందరు ఎంఎల్‌ఏలు మిగులుతారో వేచి చూడాల్సిందే.

ఆ నలుగురూ ఓడారు
ఎంఎల్‌ఏల కొనుగోలు కేసుకు సంబందించిన నలుగురు ఈ ఎన్నికల్లో పరాభవం పాలైనారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా  సంచలనాత్మకంగా మారిన ఈ కేసు ఇంకా ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) పరిధిలోనే ఉంది. ‘ఎంఎల్యేలకు ఎరకేసు’ 2022లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడిన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ నుంచి పోటీ పెట్టిన రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకునేందుకు బిజెపి పెద్ద స్కెచ్‌ వేసిందన్న  ప్రచారం జరిగింది. అందులో భాగంగా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలు కాంతారావు, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, హర్షవర్దన్‌ రెడ్డి, గువ్వల బాలరాజులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందన్నది ప్రధాన ఆరోపణ. అందుకు తిరుపతికి చెందిన సింహయాజులు, దిల్లీకి చెందిన సతీశ్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లు రోహిత్‌రెడ్డి ఫామ్‌ హౌజ్‌లోనే ఈ తతంగం నడిపించారన్నది ఆరోపణ. అయితే ఈ కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురు ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు.

గెలిచిన వారిలో 15మంది డాక్టర్లు..
విలువలు అంతరించిపోతున్న నేటి రాజకీయాలకు కాయకల్ప చికిత్స చేస్తామంటున్నారు డాక్టర్లు. కేవలం రోగాలకేకాదు నాయకుల మానసిక విధానాలకు కూడా చికిత్స చేయడానికి తాము సిద్ధమేనంటూ ఈ ఎన్నికల్లో దాదాపు 15 మంది డాక్టర్లు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో పదొండు మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే కావడం విశేషం. బిఆర్‌ఎస్‌ నుండి ముగ్గురు, బిజెపి నుండి ఒకరు ఈసారి గెలుపొందినవారిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుండి గెలిచిన వారిలో డోర్నకల్‌ నుండి రాంచంద్రనాయక్‌, అచ్చంపేట వంశీకృష్ణ, మహబూబాబాద్‌ మురళీనాయక్‌, మానకొండూరు సత్యనారాయణ, నారాయణపేట నుండి గెలిచిన వర్ణికారెడ్డిలు జనరల్‌ సర్జన్స్‌ కాగా,  నారాయణఖేడ్‌ సంజీవరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌. మెదక్‌, చెన్నూరు నుండి గెలిచిన మైనంపల్లి రోహిత్‌, వివేక్‌ వెంకటస్వామి ఎంబిబిఎస్‌ డాక్టర్లు కాగా, నాగర్‌కర్నూల్‌కు చెందిన కూచుకుల్ల రాజిరెడ్డి ఎండీఎస్‌, నిజామాబాద్‌ రూరల్‌కు చెందిన భూపతిరెడ్డి ఎంఎస్‌ ఆర్థో, సత్తుపల్లిలో గెలిచిన రాగమయి ఎండీ పల్మనాలజిస్ట్‌, అదే విధంగా  సిర్పూర్‌ నుండి బిజెపి అభ్యర్ధిగా నెగ్గిన పాల్వాయి హరీశ్‌ కూడా ఎంఎస్‌ ఆర్థో కావడం విశేషం. ఇక బిఆర్‌ఎస్‌ నుండి గెలిచిన ముగ్గురు మూడు విభాగాల్లో డాక్టర్లు, కోరుట్ల నుండి గెలిచిన కల్వకుంట్ల సంజయ్‌ న్యూరో సర్జన్‌, భద్రాచలం నుండి గెలిచిన తెల్లం వెంకట్రావ్‌ ఎంఎస్‌ ఆర్థో కాగా డోర్నకల్‌ రాంచంద్రనాయక్‌ జనరల్‌ సర్జన్‌ కావడంతో ఈసారి అసెంబ్లీలో  విద్యాధికుల సంఖ్య పెరిగినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page