పాలమూరు ప్రజలను నిండా ముంచారు

  • ఏమీ చేయని.. ఏమీ తేలేని బీఆరెస్ సిగ్గులేకుండా వోట్లు అడుగుతోంది
  • నన్ను అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేస్తున్నారు
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో తెలియదు అని కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతు బంధు రాదని కేసీఆర్ అంటుండు ఉచిత కరెంటు తెచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన అన్నారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్, మద్దూర్, గుండుమాల్, కోస్గిలలో నిర్వహించిన ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్లొన్నారు. మీరు పెంచిన మొక్క వృక్షమై పీసీసీ అధ్య క్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండే స్థాయికి చేరిందన్నారు.
 “సిద్దిపేట నుంచి ఒకడు, సిరిసిల్ల నుంచి ఇంకొకడు గజ్వేల్ నుంచి మరొకడు కొడంగల్ కు గొడ్డలి తీసుకుని బయలుదేరారు..తండ్రీ కొడుకులు, అల్లుడు, వాళ్ల చెంచాలు ఈ చెట్టును అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేస్తున్నారు వాళ్ల మోచేతి నీళ్లు తాగిన వాళ్లు ఈ కుట్రలో భాగస్వాములై సహకరిస్తున్నారు. మీరు పెంచిన చెట్టును ఎవడో గొడ్డళ్లు తీసుకుని నరకాలని చూస్తుంటే మీకు పౌరుషం లేదా?” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ ఐదేళ్లలో కొడంగల్ కు చేసిందేంటి. బస్టాండు , సబ్ స్టేషన్, కాలేజీ, ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టించింది నేను కాదా? ఇంటికొచ్చి ఏదైనా అడిగితే.. ఎవరైనా సాయం కోరి వస్తే ఏనాడైనా కాదన్ననా? ఏరోజైనా ఎవరి దగ్గర నుంచైనా ఒక్క రూపాయి అడిగానా? గౌడ సోదరులకు, ముదిరాజులకు, దళిత బిడ్డల అభివృద్ధికి నేను కృషి చేసింది నిజం కాదా? మైనారిటీలకు కమ్యూనిటీ భవనం కట్టించింది నేను కాదా? మార్కెట్ యార్డు కట్టించింది, అభివృద్ధి చేయించింది నేను నేను కాదా? నియోజకవర్గానికి ట్రాన్స్ఫార్మర్స్ తెచ్చి అగ్గిపెట్టెల్లా పంచింది నేను కాదా??పదేళ్లు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇవన్నీ చేసింది నిజం కాదా?” అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవేవీ చేయకపోగా కొడంగల్ ను రెండు ముక్కలు చేసి కుక్కలు చించిన విస్తరి చేశారు. అలాంటి కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి కొడంగల్ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్ కో, ఐదు వేలకో తాకట్టు పెట్టకండని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కానీ కేసీఆర్ మాటలు నమ్మి గత ఎన్నికల్లో మీరు బీఆరెస్ కు వోటు వేసి గెలిపించారు.. బీఆరెస్ హయాంలో ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు రాలే, రైల్వే లైన్ రాలే,డిగ్రీ కాలేజీ రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘కొడంగల్‌ నియోజకవర్గానికి రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామని సీం కేసీఆర్‌ చెప్పారు. కొడంగల్‌ నియోజకవర్గంలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఈ ఐదేళ్లలో కొడంగల్‌ నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చాయా? కొడంగల్‌, మద్దూరుకు రైల్వే లైన్లు వచ్చాయా? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేశారా?’’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ పదేళ్లలో ఎంత మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిందో మీరు ఆలోచించాలన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు గడీల్లాంటి పెద్ద బంగాళాలు, ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ సీఎం అయ్యాక పాలమూరు ప్రజలను నిండా ముంచారు..కేసీఆర్ ను సీఎం చేయడమే నేరమా అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మద్దూర్ లో డిగ్రీ కాలేజీ, వందపడకల హాస్పిటల్, స్టేడియం నిర్మించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల రెండేళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దే అన్నారు రేవంత్ రెడ్డి. నా ఒత్తిడి, నా పోరాటంతోనే గుండుమాల్ మండల కేంద్రం అయిందన్నారు. ఏమీ చేయని.. ఏమీ తేలేని బీఆరెస్ వాళ్లు సిగ్గులేకుండా వచ్చి వోట్లు అడుగుతున్నారు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిండ్రు.. పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చని నేతలు మళ్ళీ గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నారు.. బీఆర్ఎస్ నేతలు నీళ్లు తేలేదు కానీ బెల్ట్ షాపులు తెచ్చారని విమర్శించారు. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు నేను తీసుకొచ్చినవే అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి లంబాడీ సోదరుల ఆత్మగౌరవం నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు లంబాడాలకు భూములు పంచింది కూడా కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆరెస్ ను బొంద పెట్టి… ఇందిరమ్మ రాజ్యం తెచ్ఛుకుందామన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం.. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15 వేలు అందిస్తాం.. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం.. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందిస్తాం.. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం.. చేయూత పథకం ద్వారా రూ.4 వేలు పెన్షన్ అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
*తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు..మోదీ గద్దె దించేందుకు పునాది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఢిల్లీలో మోదీని గద్దె దించేందుకు పునాది అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో జరిగే ఎన్నికలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదన్నారు. తెలంగాణలో గెలవడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను మరింత సమర్ధవంతంగా నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
బిడ్డలు కష్టంలో ఉంటే జీసెన్ త్యాగం చేసినట్లు.. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ త్యాగం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్రను మనం ప్రస్తావించాల్సి వస్తే క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అని ప్రస్తావిస్తామని, అలాగే తెలంగాణ సమస్యల్ని ప్రస్తావించాల్సి వస్తే తెలంగాణ వచ్చాక.. తెలంగాణ రాకముందు అని చెబుతామని తెలిపారు.
రాష్ట్రంలో పదేళ్లుగా స్వేచ్ఛ ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి నెలకొందన్నారు. మణిపూర్ లో జరిగిన దాడులను చూసైనా ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓడిన వారు బానిసలు అన్నట్లుగా మోదీ ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు.
డిసెంబర్ అంటే మిరాకిల్ నెల అని అన్నారు. 2023 డిసెంబర్ లో ఒక మిరాకిల్ జరగబోతుందని తెలిపారు. ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నారు రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page