పాలమూరు ప్రజల కల నెరవేరబోతున్నది

  • ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి
  • ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం  
  • పరాయి పాలన ఒక శాపం..స్వపరిపాలన ఒక వరం
  • రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి  

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తానని..  పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతా. కృష్ణమ్మ నీళ్లను కలశాలలో గ్రామ, గ్రామానికి తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్ధనాలయాలలో అభిషేకం చేస్తానని ముఖ్యమంత్త్రి కేసీఆర్‌ ‌పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన సందర్బంగా  భూత్పూర్‌ ‌బహిరంగసభలో అన్నారని  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.  అనంతరం జరిగిన పరిణామాలలో ఇంటిదొంగలు, పాలోల్లు, పక్క వాళ్లు ఈర్ష, ద్వేషాలతో కేసులు వేశారని, కేంద్ర ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకపోవడం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారిందన్నారు.  ప్రాజెక్టు ముందుకు సాగకుండా అనేక రకాల అవరోధాలు కల్పించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లి రాజ్యాంగబద్ధంగా అనుమతులు సాధించారు.

బ్యాంకులు రుణాలు ఇవ్వవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు దాదాపు రూ.25 వేల కోట్లు దశలవారీగా కేటాయించుకుని అత్యంత అద్భుతంగా ప్రాజెక్టును పూర్తిచేసుకుంటున్నామని ఆయన అన్నారు.  దశాబ్దాల క్రితమే కృష్ణా నీళ్లు పాలమూరుకు దక్కి ఉంటే దేశంలోనే ఒక హరితప్రాంతంగా, వ్యవసాయిక ప్రాంతంగా, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో అగ్రభాగాన ఉండే ప్రాంతంగా ఈ ప్రాంతం విలసిల్లేది.ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వం, వెన్నెముక లేని తనం పాలమూరు ప్రజలకు శాపంగా నిలిచిందన్నారు.  కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ సాధించి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నిర్మించుకుని కృష్ణా నీళ్లను మలుపుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పెండింగ్‌ ‌ప్రాజెక్టులు కూడా తెలంగాణ ప్రభుత్వంలోనే పూర్తిచేసుకున్నాం. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టుదలతో పూర్తిచేసుకున్నాం. ఈ నెల 16న కేసీఆర్‌ ‌చేతుల మీదుగా  పాలమూరు రంగారెడ్డి పంపుల వెట్‌ ‌రన్‌ ‌తో పాలమూరు ప్రజల కల నెరవేరబోతున్నది. ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు భారీ ఎత్తున బయలుదేరాలి.

కలశాలతో కృష్ణా నీళ్లు తీసుకువచ్చి గ్రామాలలో దేవాలయాల్లో దేవుళ్లను డప్పుచప్పుళ్లు, వాయిద్యాల నడుమ అభిషేకించాలి .. ప్రార్ధనాలయాలలో చల్లుకోవాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1600  పైచిలుకు గ్రామాల్లో ఈ సంబరాలు పెద్దఎత్తున జరగాలి. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నదే ప్రధానంగా సాగునీళ్ల కోసం. కృష్ణా నీళ్ల కోసం తెలంగాణ జెండా ఖచ్చితమైన లక్ష్యంతో ముందుకుసాగినం. ఈ క్రమంలో ఎన్నో జయాపజయాలు ఎదుర్కొన్నాం ఈ రోజు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగస్వామిని కావడం చిరస్మరణీయమైన అంశంగా భావిస్తున్నాను.  నా ఇంటికి కూడా కృష్ణమ్మ అని పేరు పెట్టుకున్నాను .. పాలమూరు ప్రజల ఆకలి, దాహార్తి తీర్చేది కృష్ణమ్మ అని ఆనాడు ఆ పేరు పెట్టుకున్నాను.

ఈ రోజు పాలమూరులోని ప్రతి పల్లెకు కృష్ణమ్మ రాబోతున్నది .. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం సంతోషంగా స్వాగతిద్దాం .. గర్వపడదాం.  పార్టీలు, ప్రభుత్వాలకు అతీతంగా ప్రజల్లో సమూల మార్పుకు దోహదపడే అంశంగా దీనిని చూడాలి.  ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పాలమూరుకు ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలను బహుమతి గా ఇచ్చి శాపంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ‌వరంగా ఇచ్చారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్‌ ‌పంప్‌ ‌హౌస్‌ ‌లో  ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌మోటార్లు ప్రారంభించనున్న నేపథ్యంలో జరిగే బహిరంగసభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలిరావాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి
పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page