పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా
సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం
ఆరు రూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా
గెలిచిన ఏడాదిలోనే అమలు చేసి చూపిస్తా
మాట తప్పేదేలేదు మడమ తిప్పేదేలేదు : పొంగులేటి
ఖమ్మం/కొత్తగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : పాలేరు ప్రజల సంక్షేమానికి పాలేరులా పనిచేస్తానని మాట ఇస్తున్నానని, అందుకు దేనికైనా సిద్దంగా ఉంటానని, మీ దీవెనలతో కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలోనూ గెలవబోతుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే పాలేరు నియోజకవర్గానికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతానని హామీ ఇచ్చారు. నేలకొండపల్లి మండలంలోని ఆచర్ల గూడెం, ఆరెగూడెం, కోనాయిగూడెం, కోరట్ల గూడెం, అమ్మగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తండా, ముఠాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలేరుకి ఆరు గ్యారెంటీల హామీ పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కారిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారెంటీలలో ప్రధానంగా మొదటిది పరిపాలన మౌలిక సదుపాయాల్లో భాగంగా ఆర్‌సిసి వాల్ నిర్మాణం, మున్నేరు వరదలకు శాశ్వత పరిష్కారం, రూరల్ మండలంలో లేఔట్ల క్రమబద్ధీకరణ, పాలేరులో కొత్త బస్ టెర్మినల్, బచ్చోడు, బీరోలు, బంగ్లా రూట్ వంటి బస్ సర్వీసులు పునరుద్ధరణ చేయిస్తా. విద్య,యువత విషయానికొస్తే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అర్హులైన యువతకు ప్రతి ఏటా జాబ్ మేళ, మత్స్య పరిశోధన కేంద్రంకు కావాల్సిన శిక్షణ గదులు, ఆడిటోరియం నిర్మాణం, ప్రతి మండలంలో యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, పాలేరు ప్రజలకు అందుబాటులోకి డిగ్రీ కాలేజీని తీసుకొస్తా అన్నారు. అధ్వాన్యంగా ఉన్న ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రులను 50 పడకల ఆసుపత్రులుగా మార్చేందకు కృషి చేస్తా అన్నారు. తండాలకు కూసుమంచి, తిరుమలాయపాలెం మండల కేంద్రాలుగా డెడికేటెడ్ అంబులెన్సు సర్వీస్ కల్పిస్తామాన్నారు. సీతారామ ప్రాజెక్టు, కెనాల్ పనులు పూర్తి చేసి తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలల్లో ఆయకట్టు విస్తరణ, పూర్తిస్థాయిలో మద్దులపల్లి మార్కెట్ యార్డ్ అభివృద్ధి వంటి పనులతో రైతుల అభివుఋద్ధికి పనులు చేపడతామన్నారు. పాలేరు చేపల ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన చేస్తానని మాట ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం శంకుస్థాపనతో నిలిచిపోయిన ఎస్పి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తి. బిసి, ఎస్టి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పద్మ శ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో ఆరోహామీని కూడా ఇస్తున్నా డంపింగ్ యార్డ్ దానవాయిగూడెం నుంచి తరలింపు, పాలేరు చెరువు, బుద్ధ స్తూపం, తీర్ధల క్షేత్రం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా అని స్పష్టం చేవారు. పాలేరు ప్రజలకు మీ శ్రీనన్నగా మాట ఇస్తున్నా తప్పేదే లేదంటూ హామీ ఇచ్చారు. స్థానికులు పొంగులేటికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.