పాల్కురికి సోమనాథ తెలుగు విశ్వవిద్యాలయం!

తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ కేంద్రంగ 1985 డిసెంబర్‌ 2 నాడు ప్రారంభమైంది. తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, కళలు అధ్యయన, అధ్యాపనలతో పాటు, పరిరక్షణ, పరిశోధనలు ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన సంస్థ ఇది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు తెలుగు అకాడెమీ మినహా అన్ని అకాడెమీలను రద్దు పరచి ఆ ఊరుమ్మడి బాధ్యతలు నిర్వహించటానికి ఏర్పరచిన బృహత్‌ సంస్థ తెలుగు విశ్వవిద్యాలయం. ఉమ్మడి రాష్ట్రంలోని వేరు వేరు చోట్ల దీనికి ప్రత్యేక విభాగాలతో కూడిన ప్రాంతీయ పీఠాలు ఉన్నయి. 1998లో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ విశ్వవిద్యాలయం పేరును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా మార్పు చేసిండ్రు. ఆ మార్పు ఎవరు అడుగక పోయినా, ఎవరికీ ఇష్టం లేకపోయినా, అధికారంలో ఉన్న వారి అభీష్టం మేరకు అట్లా జరిగి పోయింది. దానితో సాధారణ జనం తెలుగును మింగి కేవలం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనటం దాకా పోయింది. తేరుకున్న తెలుగు అభిమానులు మొదటి వలె తెలుగు విశ్వవిద్యాలయం, లేదా పి ఎస్‌ తెలుగు విశ్వవిద్యాలయం అనటం అలవాటు చేసుకొన్నరు.

 

పి ఎస్‌ కు తెలుగు అభిమానులు ఇచ్చుకున్న పూర్తి రూపం పాల్కురికి సోమనాథ. తొలి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు. సోమనాథుని కంటె పూర్వం దాదాపు అందరూ అనువాద కవులే! అన్నీ సంస్కృత భూయిష్ట అనువాద రచనలే! జన వ్యవహారంలోని జాను తెలుగుకు కావ్య గౌరవం కలిగించి, దేశి ఛందస్సులను దేదీప్యమాన పరచి, సామాన్యులను కథా నాయకులుగా చేసి, స్వతంత్ర రచనలు కూర్చిన అసమాన కవి పండితుడు సోమనాథుడు. బసవ తత్వాన్ని ఆలంబన చేసుకొని సర్వ మానవ సమానత్వం ప్రబోధించిన సామాజిక విప్లవ కవి ఆయన. తెలుగు, కన్నడ, సంస్కృతాలతో పాటు, దాక్షిణాత్య భాషల గురించి తెలుసుకోవాలన్నా, సామాజిక, శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానం గ్రహించాలన్నా, మధ్య యుగాల చరిత్ర, సంస్కృతి అర్థం చేసుకోవాలన్నా పాల్కురికి సోమనాథుడే ఏకైక ఆదరువు. సోమనాథునితో సమానమైన కవి ఇంతవరకు లేడు, రాబోడు.

 

సి పి బ్రౌన్‌, బండారు తమ్మయ్య, దివాకర్ల వెంకటావధాని, చిలుకూరి నారాయణరావు, తిమ్మావజ్జల కోదండరామయ్య, తిరుమల రామచంద్ర, ముదిగొండ శివప్రసాద్‌, వేణుముద్దల నరసింహారెడ్డి వంటి పండిత ప్రకాండులెందరో నిగ్గు తేల్చిన నిజాలు ఇవి. పోతన, వేమన, అన్నమయ్యల మీద సోమన ప్రభావం ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆ కాలం నుంచి అత్యాధునికుల వరకు సోమనాథుని ఆరాధించని వారు లేరు, ఆయన గురించి వ్రాయని వారు లేరు. తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన ఉపాధ్యక్షులు సి నారాయణరెడ్డి సోమనాథుని రచనలను అచ్చు వేయించిండ్రు. ప్రచురణల విభాగం సంచాలకులు జయధీర్‌ తిరుమలరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నరు. పేర్వారం జగన్నాథం 1994లో మూడు రోజుల పాటు పాలకుర్తి గ్రామంలో సోమనాథుని అష్టశత జయంతి ఉత్సవాలు నిర్వహించిండ్రు. పాలకుర్తిలో సోమనాథుని శిలా విగ్రహం ప్రతిష్ఠ చేయించిండ్రు. ఎన్‌ గోపి సోమనాథునిచే ప్రభావితుడైన వేమన మీద సాధికార పరిశోధన చేసిన వ్యక్తి. ఎస్‌ వి సత్యనారాయణ విశ్వవిద్యాలయంకు పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని బహిరంగ ప్రకటన చేసిన అభిమాని. అనుమాండ్ల భూమయ్య పాల్కురికి సాహిత్య పీఠం ఏర్పాటు చేసి బృహత్‌ వ్యాస సంకలనాన్ని అచ్చు వేయించిండ్రు.

 

ఆపద్ధర్మ ఉపాధ్యక్షులుగ పనిచేసిన కొంక యాదగిరి తెలుగు అకాడెమీ ద్వారా సోమనాథునిపై గ్రంథాలు వ్రాయించిండ్రు. తంగెడ కిషన్‌ రావు విశ్వవిద్యాలయంకు పాల్కురికి సోమనాథుని పేరు సూచిస్తూ ప్రభుత్వానికి తీర్మానం పంపిండ్రు. బయట విశ్వవిద్యాలయాలలోను, వ్యక్తులు, సంస్థల ద్వారా సోమనాథుని మీద గణనీయ పరిశోధనలు జరిగినయి. వెల్డండ నిత్యానంద రావు ఈ పరిశోధనల మీద ఒక బిబ్లియోగ్రఫి విడుదల చేసిండ్రు. బసవ సంక్షేమ సమితి, ఓం నమః శివాయ సాహిత్య సాంస్కృతిక పరిషత్తు సోమనాథుని సాహిత్యాన్ని ప్రచురణ చేస్తున్నయి. అక్కిరాజు రమాపతి రావు, రవ్వ శ్రీహరి వంటి పండితులు సోమనాథుని రచనలను వచనంలో వ్రాసిండ్రు.

కాకతీయ విశ్వవిద్యాలయం, జోగిపేట ప్రభుత్వ కళాశాల సోమనాథుని మీద గొప్ప సదస్సులు నిర్వహించి పరిశోధనా పత్రాలను పుస్తకంగా తెచ్చినయి. వే న రెడ్డి గారి పరిశోధనను కసిరెడ్డి వెంకటరెడ్డి, అంపశయ్య నవీన్‌, దహగం సాంబశివరావు, గన్నమరాజు గిరిజామనోహర్‌ బాబు అచ్చు లోనికి తెచ్చిండ్రు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో ‘‘తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు’’ అని ద్వానా శాస్త్రి చేసిన ప్రతిపాదన ఉద్యమానికి ఊతాన్ని ఇచ్చింది. జూకంటి జగన్నాథం ఈ అంశాన్ని నెత్తి కెత్తుకున్నరు. అందెశ్రీ, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌, పిల్లలమర్రి రాములు వ్రాసిన పాటలు ఉర్రెత్తించినయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం సోమనాథుని జన్మస్థలం పాలకుర్తిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచటానికి చర్యలు చేపట్టింది. పాలకుర్తిలో సోమనాథుని భారీ శిలా విగ్రహాన్ని చేయించి పెట్టింది. సోమనాథుని తెలంగాణ ఆదికవిగా ప్రకటించింది.

 

తెలుగు విశ్వవిద్యాలయంకు పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం, వరంగల్‌ రచయితల సంఘం, ఇతర వ్యక్తులు, సంఘాలు చేస్తున్న విజ్ఞాపనల పట్ల సానుకూలంగా స్పందించింది. తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్‌ 10 లో ఉన్నది. అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో రెండవ విడత ప్రభుత్వం విభజన పట్ల ఆసక్తి కనపరచ లేదు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయినయి. ఇప్పుడు విశ్వవిద్యాలయం విభజన తప్పదు. అవశేష అంధ్రప్రదేశ్‌ వాటాకు వచ్చిన దానిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనే కొనసాగించు కొంటది. వలస పాలన గుర్తులు వదిలించు కోవటానికి పేరు మార్చు కోవలసిన అవసరం తెలంగాణకు తప్పది.

 

ఈ పరిస్థితులలో 2024 ఆగస్ట్‌ 2 న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై అసెంబ్లీలో చేసిన ప్రకటన తెలంగాణ ఉద్యమకారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అందరికి ఆమోదం అయితె సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ప్రకటన సారాంశం. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళికుడే! ఒక విశ్వవిద్యాలయంకు పేరు పెట్ట తగిన వ్యక్తియే. కానీ, అది తెలుగు విశ్వవిద్యాలయానికి మాత్రం కాదు. పాలమూరు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు తగినట్టు ఉంటది. తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు తప్ప మరేదీ పొసగదు.
-డాక్టర్‌ రాపోలు సత్యనారాయణ
అధ్యక్షుడు, సోమనాథ కళా పీఠం
పాలకుర్తి, జనగామ జిల్లా
ఫోన్‌: 9440163211

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page